IPL2021 CSK vs PBKS: కెఎల్ రాహుల్ ఒక్కడే కొట్టేశాడు... క్లాస్ ప్లేయర్, వన్ మ్యాన్ షోతో...

By Chinthakindhi RamuFirst Published Oct 7, 2021, 6:49 PM IST
Highlights

13 ఓవర్లలో మ్యాచ్‌ను ముగించిన పంజాబ్ కింగ్స్... ముంబై ఇండియన్స్ కంటే మెరుగైన రన్‌రేట్ నమోదు... 98 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన కెఎల్ రాహుల్...

‘వన్ మ్యాన్ షో’... చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌కి సరిగ్గా సూటయ్యే మాట ఇది... 135 పరుగుల లక్ష్యఛేదనలో అన్నీ తానై, అదరగొట్టి మాస్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు కెఎల్ రాహుల్...

మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ కలిసి పంజాబ్ కింగ్స్‌కి మెరుపు ఆరంభం అందించారు. 4.2 ఓవర్లలోనే తొలి వికెట్‌కి 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే 12 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అయితే టీవీ రిప్లైలో మాత్రం బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టు స్పష్టంగా కనిపించింది...

వన్‌డౌన్‌లో వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ 3 బంతులాడి, వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డకౌట్ కాగా... షారుక్ ఖాన్ 10 బంతుల్లో ఓ సిక్సర్‌తో 8 పరుగులు చేసి దీపక్ చాహార్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
ఆ తర్వాత మర్క్‌రమ్ 8 బంతుల్లో ఓ సిక్సర్‌తో 13 పరుగులు చేసి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 

ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో వైపు బౌండరీలతో విరుచుకుపడిన కెఎల్ రాహుల్, 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. పంజాబ్ కింగ్స్ తరుపున కెఎల్ రాహుల్‌కి ఇది 25వ హాఫ్ సెంచరీ కాగా, ఈ జట్టు తరుపున 2500+ పరుగులు చేసిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు...


కెఎల్ రాహుల్ 42 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 98 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 13 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించిన పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ కంటే మెరుగైన రన్‌రేట్ నమోదుచేసింది.

click me!