IPL2021 CSK vs DC: కీలక పోరులో టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై.. గురు శిష్యుల్లో ఫైనల్ చేరెదెవరు..?

By team teluguFirst Published Oct 10, 2021, 7:10 PM IST
Highlights

IPL2021 CSK vs DC: ఐపీఎల్ లో మూడు సార్లు ట్రోఫీ నెగ్గిన Chennai super Kings ఒక వైపు. రెండు సార్లు గట్టిగా ప్రయత్నించి విఫలమైనా ఈసారి ఎలాగైనా కప్ ను చేజిక్కించుకోవాలని ఆరాటపడుతున్న Delhi capitals మరోవైపు. ఈ రెండు జట్లు నేడు క్వాలిఫైయర్-1 మ్యాచ్ కోసం సిద్ధమయ్యాయి. 

ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా జరుగుతున్న తొలి క్వాలిఫైయర్  మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. గురు శిష్యుల మధ్య పోరాటంగా జరుగబోతున్న ఈ పోరులో ‘డాడీస్ ఆర్మీ’గా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్.. గెలిచి ఫైనల్స్ కు అర్హత సాధించాలనే పట్టుదలతో ఉన్నది. మరోవైపు యువరక్తంతో IPL-14 లీగ్ అంతా నిలకడగా రాణిస్తున్న ఢిల్లీ బాయ్స్ కూడా ఈసారి కప్ ఒడిసిపట్టేది తామే అనే ధీమాలో ఉన్నారు. మరి ఈ రెండు జట్ల మధ్య తుది పోరుకు అర్హత సాధించేదెవరో.. కొద్దిసేపట్లో తేలిపోతుంది. 

ఈ కీలక మ్యాచ్ కోసం ఢిల్లీ ఒక మార్పు చేసింది.  గత రెండు మ్యాచుల్లో ఢిల్లీ తరఫున ఆడిన రిపల్ పటేల్ స్థానంలో టామ్ కరన్ బరిలోకి దిగుతున్నాడు. చెన్నై జట్టులో మార్పులేమీ లేవు. 

గత ఐపీఎల్ లో ప్లేఆప్స్ లో చేరక నిష్క్రమించిన CSK ఈసారి ఆ గండాన్ని దాటడంతో పాటు మళ్లీ టైటిల్ ను చేజిక్కించుకోవాలనే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నది. ఇందులో భాగంగానే లీగ్ దశలో ఆ జట్టు అదిరిపోయే ప్రదర్శనలు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆ జట్టును ఒంటిచేత్తో గెలిపించగల మ్యాచ్ విన్నర్లు Chennai సొంతం. చెన్నై బ్యాటింగ్ భారాన్ని మోస్తున్న డూప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్ లు చెలరేగితే భారీ స్కోరు ఖాయం. ఇక వారికి మోయిన్ అలీ, రాయుడు అండగా నిలుస్తుండగా.. ఆఖర్లో రవీంద్ర జడేజా, బ్రావో మెరుపులు మెరిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ కెప్టెన్ గా తన వ్యూహాలతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న MS dhoni.. బ్యాట్స్మెన్ గా మాత్రం విఫలమవుతుడటం ఒక్కటే చెన్నైని కలవరపరిచే అంశం. బౌలింగ్ లో దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, హెజెల్వుడ్, బ్రావోలు మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు.

ఇక మరోవైపు Delhi Capitals కూడా  అన్ని విభాగాల్లో చెన్నైకి తీసిపోలేదు. బ్యాటింగ్ లో శిఖర్ ధావన్, పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ లు ఇప్పటికే తామెంత విలువైన ఆటగాళ్లమో చూపించారు. బ్యాటింగ్ కు తోడు అద్భుత కెప్టెన్సీతో Rishabh Pant ఢిల్లీకి విజయాలను అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు.  ఇక బౌలింగ్ లో.. అవేశ్ ఖాన్, రబాడ, నార్త్జ్, అక్షర్ పటేల్ లు ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నారు. వీళ్లు విజృంభిస్తే చెన్నైకి పరుగులు చేయడం దాదాపు అసాధ్యమే.

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ.. రెండో స్థానంలో నిలిచిన చెన్నైతో ప్రస్తుత సీజన్ లో రెండు సార్లు తలపడింది. రెండు సార్లు DCదే విజయం కావడం గమనార్హం. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి ఐదు మ్యాచుల్లో నాలుగుసార్లు ఢిల్లీ గెలవగా.. ఒక్కదాంట్లో మాత్రమే చెన్నై నెగ్గింది. ఇప్పటివరకు ఐపీఎల్ లో ఇరుజట్లు 25 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో ఢిల్లీ 10 సార్లు నెగ్గగా.. చెన్నై 15 సార్లు విజయం సాధించింది. 

బ్యాటింగ్ కు కష్టమైన దుబాయ్ పిచ్ పై తొలుత బ్యాటింగ్ చేయబోయే ఢిల్లీ బ్యాట్స్మెన్ ఏ మేరకు రాణిస్తారో చూడాలి. బౌలర్లకు సహకరించే ఈ పిచ్ పై.. ఈ సీజన్ లో జరిగిన 11 మ్యాచుల్లో  8 సార్లు రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. 

జట్లు: 
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, ధావన్, శ్రేయస్‌ అయ్యర్, రిషబ్ పంత్‌ (కెప్టెన్‌, వికెట్ కీపర్), హెట్మైర్, టామ్ కరన్, అక్షర్‌ పటేల్,  అశ్విన్‌, రబడ, అన్రిచ్ నార్త్జ్, అవేశ్‌ ఖాన్.

చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్‌, డుప్లెసిస్‌, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప, ఎంఎస్ ధోనీ (కెప్టెన్‌, వికెట్ కీపర్), జడేజా, డ్వేన్ బ్రావో, శార్దూల్‌ ఠాకూర్, దీపక్‌ చహర్, జోష్ హజిల్‌వుడ్‌
 

click me!