INDw vs AUSw: చివరి టీ20 లోనూ తడబడిన భారత అమ్మాయిలు.. సిరీస్ ఆస్ట్రేలియాదే..

By team teluguFirst Published Oct 10, 2021, 5:49 PM IST
Highlights

INDw vs AUSw: ఆస్ట్రేలియా తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ ను భారత్ 0-2 తేడాతో ఓడిపోయింది.  మూడో టీ20లో ఆసీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో భారత అమ్మాయిలు తడబడ్డారు. 

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ ను కోల్పోయిన ఇండియా మహిళల క్రికెట్ జట్టు.. తాజాగా టీ20 సిరీస్ నూ కోల్పోయింది.  సిరీస్ సమం చేయాలంటే తప్పన గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ బౌలింగ్ లో మెరుగ్గానే రాణించినా  బ్యాటింగ్ విభాగంలో విఫలమైంది. దీంతో ఆస్ట్రేలియా అమ్మాయిలు టీ20 సిరీస్ ను 2-0 తో గెలుచుకున్నారు. 

క్వీన్స్ లాండ్ వేదికగా జరిగిన మూడో టీ20లో టాస్ నెగ్గిన భారత్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ బౌలింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ ఓపెనర్లు హీలి (4)  త్వరగానే ఔటైనా.. మూనీ (43 బంతుల్లో 61) రాణించింది. కానీ మిడిలార్డర్ విఫలమైంది.  హీలి ఔటైన తర్వాత వచ్చిన కెప్టెన్ లానింగ్ (14), గార్డ్నర్ (1), పెర్రీ (8) లు  త్వరగానే ఫెవిలియన్ చేరారు. కానీ చివర్లో వచ్చిన  మెక్ గ్రాత్ (31 బంతుల్లో 44) ధాటిగా ఉంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్.. 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాజేశ్వరి  గైక్వాడ్.. 4 ఓవర్లలో 37 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది. వస్త్రాకార్, దీప్తి శర్మకు తలో వికెట్ దక్కింది. 

150 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత అమ్మాయిలకు ఆదిలోనే షాక్ తగిలింది. డాషింగ్ ఓపెనర్ షెఫాలి వర్మ (1) రెండో ఓవర్లోనే ఔటైంది. కానీ జెమీమా రొడ్రిగ్స్ (26) తో  కలిసి ఓపెనర్ స్మృతి మంధాన (49 బంతుల్లో 52) భారత శిభిరంలో ఆశలు కల్పించింది.  కానీ నికోలా బౌలింగ్ లో మంధాన, వేర్హమ్ బౌలింగ్ లో రొడ్రిగ్స్ ఔటవడంతో భారత్ కు కష్టాలు మొదలయ్యాయి. లక్ష్యం దిశగా సాగుతున్న భారత్ ఒక్కసారిగా తడబడింది. పది ఓవర్లలో 60/1 గా ఉన్న భారత్.. 15 ఓవర్లు వచ్చేసరికి 5 కీలక వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (13), పూజా (5) లు వెనువెంటనే పెవిలియన్ కు చేరారు. 

ఆ తర్వాత వచ్చిన వికెట్ కీపర్ రిచా ఘోష్ (11 బంతుల్లో 23 నాటౌట్)  రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది ఆశలు రేపినా.. అప్పటికే విజయానికి చాలా ఆలస్యమైంది. ఘోష్ పోరాటంతో  ఆఖరుదాకా పోరాడిన భారత్.. 20 ఓవర్లలో 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా ఆసీస్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లలో నికోలా నాలుగు ఓవర్లలో 42 పరుగులు సమర్పించుకున్నా కీలక కీలక వికెట్లు తీసింది. 

ఇప్పటికే వన్డే సిరీస్ ను 1-2 తో కోల్పోయిన భారత్.. తాజాగా టీ20 సిరీస్ నూ  దక్కించుకోలేకపోయింది. కానీ ఇటీవలే ముగిసిన ఏకైక డేఅండ్ నైట్ టెస్టులో మాత్రం భారత్ అదరగొట్టింది.  ఆ టెస్టులో మంధాన సెంచరీ కూడా చేసింది. ఏదేమైనా వన్డే, టీ20 సిరీస్ లు ఓడిపోయినా.. మునపటితో పోల్చితే భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో  భాగా మెరుగైంది.

click me!