
ఐపీఎల్ (IPL-15) లో వచ్చే ఏడాది నుంచి రెండు కొత్త జట్లు (IPL New Teams) రాబోతున్న విషయం తెలిసిందే. లక్నో (LUCKNOW), అహ్మదాబాద్ (AHMEDABAD) ఫ్రాంచైజీల పేర్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ-BCCI) ఇప్పటికే ఖరారు చేసింది. లక్నో ను కోల్కతా ప్రధాన కేంద్రంగా వ్యాపారాలు నడిపిస్తున్న ఆర్పీఎస్జీ (RPSG) గ్రూప్ అధినేత సంజీవ్ గొయెంకా (SANJIV GOENKA) దక్కించుకోగా.. అహ్మదాబాద్ ను సీవీసీ పార్ట్నర్స్ (CVC PARTNERS) దక్కించుకుంది. అయితే లక్నో ఫ్రాంచైజీని సంజీవ్ గొయెంకా దక్కించుకోవడం ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడు (BCCI PRESIDENT) సౌరవ్ గంగూలీ (SOURAV GANGULY) మెడకు చుట్టుకుంది.
బెంగాల్ కు చెందిన సంజీవ్ గొయెంకా తో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీకి సత్సంబంధాలున్నాయి. ఇద్దరూ కలిసి క్రీడలకు సంబంధించిన పలు వ్యాపారాల్లో పెట్టుబడులు కూడా పెట్టారు. ఈ చనువుతోనే ఆర్పీఎస్జీ గ్రూప్.. లక్నోను గెలుచుకుందని విమర్శలు వెల్లువెత్తాయి.
ఐపీఎల్ లో లక్నో ఫ్రాంచైజీ కంటే ముందు సంజీవ్ గొయెంకా ఇండియన్ సూపర్ లీగ్ లో కూడా పెట్టుబడులు పెట్టారు. బంగ్లాకు చెందిన ప్రముఖ ఫుట్ బాల్ ఫ్రాంచైజీ అయిన ఏటీకే- మోహన్ బగన్ (ATK-MOHUN BAGAN) జట్టు ఓనర్ ఆయనే. ఈ ఫ్రాంచైజీలో సంజీవ్ తో పాటు.. గంగూలీకి చెందిన కోల్కతా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, హర్షవర్ధన్ నియోటియా, ఉత్సవ్ పరేఖ్ లు కూడా సహా యజమానులుగా ఉన్నారు. ఆ జట్టు బోర్డు సభ్యుల్లో గంగూలీ కూడా ఒకరు.
ఇదే ఇప్పుడు వివాదానికి కేంద్ర బింధువైంది. గొయెంకాతో ఉన్న వ్యాపార సంబంధాల వల్లే గంగూలీ.. ఆయనకు లక్నో ఫ్రాంచైజీ దక్కేలా చేశాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తున్నది. మోహన్ బగన్ జట్టు లో తన బాధ్యతల నుంచి తప్పుకునేందుకు ఆయన సిద్ధమయ్యారని సమాచారం.
ఇదే విషయమై సంజీవ్ గొయెంకా కూడా స్పందించారు. నిన్న ఆయన ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ.. ‘అవును.. అతడు (గంగూలీ) మోహన్ బగన్ నుంచి పూర్తిగా తప్పుకోబోతున్నాడు’ అని తెలిపారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తికి రెండు పదవులు ఉండటాన్ని అంగీకరించరు.
సోమవారం ముగిసిన ఐపీఎల్ కొత్త జట్ల వేలంలో లక్నో జట్టును ఆర్పీఎస్జీ రూ .7,090 కోట్లకు దక్కించుకోగా.. అహ్మదాబాద్ ను సీవీసీ పార్ట్నర్స్ రూ. 5,625 కోట్లకు చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.