IPL 2025 KKR vs CSK: ఐపీఎల్ 2025లో ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి అవుట్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మెరుగైన ప్రదర్శనలో టోర్నీని ముగించాలని చూస్తోంది. అలాగే, ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పకుండా గెలివాల్సిన మ్యాచ్ ను సీఎస్కేతో ఆడింది కోల్ కత నైట్ రైడర్స్.
ఈ బిగ్ ఫైట్ లో కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలను దూరం చేస్తూ ఎంఎస్ ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ చివరి ఓవర్ లో విక్టరీ కొట్టింది. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో కేకేఆర్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అవుట్ అయింది.
ఈడేన్ గార్గెన్స్ వేదికగా ఐపీఎల్ 2025 57వ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో ఎంఎస్ ధోని టీమ్ సీఎస్కే విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన అజింక్య రహానే టీమ్ కేకేఆర్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది.
కేకేఆర్ బ్యాటర్లలో కెప్టెన్ అజింక్య రహానే 48 పరుగులు, ఆండ్రీ రస్సెల్ 38 పరుగులు, మనీష్ పాండే 36 పరుగులు, సునీల్ నరైన్ 26 పరుగుల ఇన్నింగ్స్ లను ఆడారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలలో నూర్ అహ్మద్ సూపర్ బౌలింగ్ ప్రదర్శనతో 4 వికెట్లు తీసుకున్నాడు.
180 పరుగులు టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్లు ఇద్దరు పరుగుల ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యారు. అయితే, డెవాల్డ్ బ్రెవిస్ 22 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. ఒకే ఓవర్‌లో 30 పరుగులు రాబట్టి మొత్తంగా 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. అలాగే, శివం దూబే 45 పరుగుల ఇన్నింగ్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 183 పరుగులతో టార్గెట్ ను అందుకుంది.
కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా 3 వికెట్లు, హర్షిత్ రాణా 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసుకున్నారు. ఈ మ్యాచ్ లో ఓటమితో కేకేఆర్ పాయింట్ల పట్టికలో 11 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచింది. సీఎస్కే 6 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది.