
Rohit Sharma retires from Test cricket: టీమిండియా మాజీ టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంగ్లాండ్ పర్యటనకు నెల రోజుల ముందు, ఐపీఎల్ మధ్యలో ఈ ప్రకటన రావడంతో అభిమానులను షాక్ కు గురిచేసింది. రోహిత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన డెబ్యూ టెస్ట్ క్యాప్‌ను పంచుకుంటూ భావోద్వేగపూరిత సందేశం ద్వారా రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించాడు.
"అందరికీ నమస్కారం. నేను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నానని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. తెల్లజెర్సీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం నాకు గర్వకారణం. గత కొన్ని సంవత్సరాల్లో నాకు అందించిన ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. నేను వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం కొనసాగిస్తాను" అని రోహిత్ పేర్కొన్నాడు.
రోహిత్ కెప్టెన్సీ భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో అతను టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' కథనం ప్రకారం, సెలక్షన్ కమిటీ ఇప్పటికే BCCIకి రోహిత్ టెస్ట్ కెప్టెన్‌గా కొనసాగడం సాధ్యపడదని తెలిపినట్లు సమాచారం. "వారు కొత్త నాయకుడిని తయారుచేయాలనుకుంటున్నారు. రోహిత్ ఉన్న ప్రస్తుత ఫామ్ ఈ ఫార్మాట్‌లో సరైన వ్యక్తి కాదనే అభిప్రాయానికి వచ్చారు" అని సంబంధిత వర్గాలు తెలిపినట్టు పేర్కొంది.
రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్‌లో 67 మ్యాచ్‌ల్లో పాల్గొని 4301 పరుగులు చేశాడు. ఆయన అత్యధిక వ్యక్తిగత స్కోరు 212 పరుగులు. అలాగే, టెస్టుల్లో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2023లో అతను టీమ్ ఇండియాను వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కి తీసుకెళ్లాడు. అయితే ఆ మ్యాచ్‌లో భారత్ ఆస్ట్రేలియాతో ఓటమిని ఎదుర్కొంది. తాజా సీజన్‌లో భారత్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది.
ఆస్ట్రేలియాతో 2024 డిసెంబరు-2025 జనవరిలో జరిగిన సిరీస్‌లో రోహిత్ 8 ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఒక్కసారి 50 మార్క్‌ను చేరుకున్నాడు. సగటు 10.93గా ఉంది. అంతకు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల హోమ్ సిరీస్‌లో ఆయన సగటు 15.16 మాత్రమే. టెస్టుల్లో అతని పేలవమైన ఫామ్ కారణంగా సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్‌లో రోహిత్ టీమ్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు.