
IPL 2025 Final PBKS vs RCB playing 11: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ చివరి ఘట్టానికి చేరుకుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పంజాబ్ కింగ్స్‌ను (PBKS) ఢీకొనబోతోంది. టైటిల్ కోసం ఇప్పటివరకు మూడు సార్లు ఫైనల్‌కి చేరిన ఆర్సీబీ ఇప్పటికీ కప్‌ను గెలవలేకపోయింది.
చివరగా 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే, ఈ సారి మాత్రం ఎలాగైనా గెలిచి ఐపీఎల్ టైటిల్ ను సాధించాలని పక్కా వ్యూహాలతో ఆర్సీబీ బరిలోకి దిగుతోంది.
మంగళవారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం బెంగళూరు ప్లేయింగ్ 11 అంచనా జట్టు వివరాలు ఇలా ఉన్నాయి.
ఫిల్ సాల్ట్ ఈ సీజన్ ఆరంభంలో తడబడినప్పటికీ, ఆ తర్వాత దూకుడుగా ఆడుతున్నాడు. ఇక్కడ మూడు కీలక ఇన్నింగ్స్‌లు గమనిస్తే అందులో 62, 30, 56 పరుగుల ఇన్నింగ్స్ లు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 175గా ఉంది. ఇక విరాట్ కోహ్లీ అయితే ఆర్సీబీకి బలమైన ప్లేయర్. పరుగుల వరద పారిస్తున్నాడు. నరేంద్ర మోడీ స్టేడియంలో గతంలో 70 పరుగుల సూపర్ నాక్ ఆడాడు.
జితేష్ శర్మ ధైర్యంగా ఆడే ఆటగాడు. మయాంక్ ఈ సీజన్‌లో వేగంగా పరుగులు రాబట్టాడు. పాటిదార్ కూడా మంచి టచ్ లో ఉన్నాడు. ఇప్పటివరకు అతను 1085 ఐపీఎల్ పరుగులు చేయగా, అతని స్ట్రైక్ రేట్ 154గా ఉంది. ఈ మ్యాచ్ లో అతని నుంచి ఒక పెద్ద ఇన్నింగ్స్ రావచ్చు.
షెఫర్డ్ 14 బంతుల్లో 53 పరుగులు చేసి చెన్నై సూపర్ కింగ్స్ పై ఆల్‌రౌండ్ ప్రదర్శన ఇచ్చాడు. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో అనుభవంతో మధ్య ఓవర్లలో కీలకంగా మారతాడు. బ్యాటింగ్ లో కూడా రాణించగల సత్తా ఉన్న ప్లేయర్.
హేజిల్ వుడ్ ఆర్సీబీ బౌలింగ్ విభాగం భారం మోస్తున్నాడు. ఇప్పటివరకు 21 వికెట్లు తీసి టాప్ 4 పర్పుల్ క్యాప్ హోల్డర్స్ లో ఉన్నాడు. అతనికి తోడుగా భువనేశ్వర్ తన గత 10 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసాడు. సుయాష్ శర్మ స్పిన్‌తో హిట్టర్లను పెవిలియన్ కు పంపగలడు. యష్ దయాల్ ఆరంభంలో వికెట్లు తీయగల డైనమిక్ పేసర్.
ఈ అంచనా జట్టుతో ఆర్సీబీ టైటిల్ గెలవాలనే తపనతో గ్రౌండ్‌లో దిగనుంది. అన్ని విభాగాల్లో సమతూకం ఉన్న ఈ జట్టు పంజాబ్ కింగ్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. మరి ఈసారి కోహ్లీ నేతృత్వంలోని బెంగళూరు చరిత్ర సృష్టిస్తుందా? లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.