
Delhi Capitals vs Kolkata Knight Riders : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లో కోల్ కతా నైట్ రైడర్స్ మరో విజయాన్ని అందుకుంది. డిల్లీని వారి హోమ్ గ్రౌండ్ లోనే చిత్తుచేసింది... అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ ఉంత్కఠభరితంగా సాగింది. భారీ లక్ష్యచేధనలో డిసి తడబడటంతో విజయం కెకెఆర్ న వరించింది.
మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా టీంలో ఏ ఒక్కరూ కనీసం హాఫ్ సెంచరీ సాధించలేకపోయారు... కానీ అందరూ సమిష్టిగా రాణించడంతో 204 పరుగుల భారీ స్కోరు సాధించారు. అంగ్రిశ్ రఘువంశి 44 పరుగులు (32 బంతుల్లో, 2 సిక్సర్లు, 3 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్లు గుర్బాజ్ కేవలం 12 బంతుల్లో 26 పరుగులు, నరైన్ 16 బంతుల్లో 27 పరుగులతో సూపర్ స్టార్ట్ అందించారు. ఆ తర్వాత కెప్టెన్ రహానే దాన్ని కొనసాగిస్తూ కేవలం 14 బంతుల్లో 26 పరుగులు చేసాడు.
వెంకటేష్ అయ్యర్ (7 పరుగులు) నిరాశపర్చినా రింకూ సింగ్ 25 బంతుల్లో 36 పరుగులతో అదరగొట్టాడు. రస్సెల్ 9 బంతుల్లో 17 పరుగులతో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. చివర్లో వెంటవెంటనే వికెట్లు పడటంతో పరుగులు రాలేవు... కానీ అప్పటికే మిగతా ఆటగాళ్లు వేగంగా ఆడటంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది కెకెఆర్. బ్యాట్ తోనే కాదు బాల్ తోనూ మ్యాజిక్ చేసిన నరైన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
205 పరుగుల భారీ విజయలక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన డిల్లీ క్యాపిటల్స్ ను గెలిపించేందుకు మొదట్లో ఫాప్ డుప్లెసిస్, చివర్లో విప్రాజ్ నిగమ్ పోరాడారు. ఓవైపు వికెట్లు పడుతున్నా డుప్లెసిస్ పోరాటం మాత్రం కొనసాగింది... అతడు కేవలం 45 బంతుల్లోనే 62 పరుగులు చేసాడు. కానీ నరైన్ బౌలింగ్ లో రింకు సింగ్ చేతికిచిక్కి ఔటయ్యాడు.
డుప్లెసిస్ తర్వాత కొద్దిసేపు కెప్టెన్ అక్షర్ పటేల్ పోరాటం సాగింది. అతడు వేగంగా పరుగులు సాధించే క్రమంలో ఔటయ్యాడు. కేవలం 23 బంతుల్లోనే 43 పరుగులు చేసాడు. తర్వాత విప్రాజ్ నిగమ్ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. 19 బంతుల్లో 38 పరుగులు చేసాడు. వీరి ఎంత పోరాడినా విజయం మాత్రం కెకెఆర్ నే వరించింది. 20 ఓవర్లలో డిసి 190 పరుగులకే పరిమితం అయ్యింది... 14 పరుగుల తేడాతో కెకెఆర్ విజేతగా నిలిచింది.