IPL 2024 RCB vs PBKS : ధావన్ ధనాధన్ .. బెంగళూరు లక్ష్యం 177 పరుగులు

By Siva KodatiFirst Published Mar 25, 2024, 9:24 PM IST
Highlights

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు ఎదుట పంజాబ్ 177 పరుగుల లక్ష్యాన్ని వుంచింది. అయితే పెద్దగా మెరుపుల్లేకుండానే పంజాబ్ బ్యాటింగ్ సాగింది. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసరడంతో పరుగులు రావడం కష్టమైంది. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు ఎదుట పంజాబ్ 177 పరుగుల లక్ష్యాన్ని వుంచింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్‌లలో కెప్టెన్ శిఖర్ ధావన్ (45), జితేష్ శర్మ (27), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (25) పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లు తలో రెండు వికెట్లు, యాష్ దయాళ్, జోసెఫ్‌లు ఒక్కో వికెట్ పడగొట్టారు. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టు .. పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 

ఢిల్లీతో జరిగిన తొలి మ్యాచ్‌లో తడబడ్డ శిఖర్ ధావన్.. బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించాడు. 37 బంతుల్లో 45 పరుగులు చేసి అలరించాడు. అయితే దానిని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ధావన్ ఇచ్చిన మెరుపు ఆరంభాన్ని పంజాబ్ కొనసాగించలేకపోయింది. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్లు చెప్పుకోదగ్గ స్కోరు సాధించలేకపోయారు. చివర్లో జితేష్ శర్మ, శశాంక్ సింగ్‌లు ధాటిగా ఆడటంతో పంజాబ్ 150 ప్లస్ మార్క్‌ను చేరుకోగలిగింది. 

ఈసారైనా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలని బెంగళూరు పట్టుదలగా వుంది. విరాట్ కోహ్లీపైనే ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో పంజాబ్ - బెంగళూరు జట్టులు 31 సార్లు తలపడగా.. పంజాబ్ 17 సార్లు, బెంగళూరు 14 సార్లు విజయం సాధించింది. 

click me!