IPL 2024 Auction List: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో పాల్గొంటున్న మొత్తం 10 జట్లలో 77 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని పూర్తి చేయడానికి మొత్తం 333 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొంటున్నారు.
IPL 2024 Player Auction list: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 కోసం మినీ వేలం డిసెంబర్ 19న దుబాయ్ లో జరగనుంది. ఐపీఎల్ చరిత్రలో వేలం విదేశాల్లో జరగడం ఇదే తొలిసారి. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ 333 మంది ఆటగాళ్లను వేలం కోసం షార్ట్ లిస్ట్ చేసింది. ఈసారి ఈ మినీ వేలం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది. వేలానికి ఎంపికైన 333 మంది ఆటగాళ్లలో 214 మంది భారతీయులు కాగా, 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అలాగే, ఈ జాబితాలో 111 మంది క్యాప్డ్, 215 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లు ఉన్నారు.
అలాగే, వేలంలోని జాబితాలో రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో 23 మంది ఆటగాళ్లు ఉన్నారు. రెండు అసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లను కూడా వేలం కోసం ఈ జాబితాలో చేర్చారు. ఐపీఎల్ 2024 కోసం మొత్తం 10 జట్లలో మొత్తం 77 మంది ఆటగాళ్ల కోసం ఖాళీలు ఉన్నాయి. అంటే షార్ట్ లిస్ట్ చేసిన 333 మంది ఆటగాళ్లలో కేవలం 77 మంది ఆటగాళ్లు మాత్రమే అమ్ముడుపోతారు. ఐపీఎల్ విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాలో రూ.2 కోట్ల బేస్ ప్రైజ్ ఉన్న 23 మంది ఆటగాళ్లు ఉన్నారు. 13 మంది ఆటగాళ్ల బేస్ ప్రైస్ ను రూ.1.5 కోట్లుగా ఉంచారు. వీరితో పాటు రూ.కోటి, రూ.50 లక్షలు, రూ.75 లక్షలు, రూ.40 లక్షలు, రూ.30 లక్షలు, రూ.20 లక్షల బేస్ ప్రైస్ ఉన్న ఆటగాళ్లను కూడా ఈ జాబితాలో చేర్చారు.
గుజరాత్ జట్టు పర్సులో ఎక్కువ డబ్బు..
వివిధ జట్ల వద్ద ఉన్న మనీ పర్సును గనక గమనిస్తే గుజరాత్ వద్ద ఎక్కువ మనీపర్సు ఉంది. గుజరాత్ టైటాన్స్ వద్ద అత్యధికంగా రూ.38.15 కోట్లు మిగిలాయి. అంటే వేలంలో ఈ జట్టు ఎక్కువ డబ్బు వెచ్చించగలదు. ఇప్పుడు కేవలం 8 మంది ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) అత్యల్పంగా రూ.13.15 కోట్లుగా ఉంది. కేఎల్ రాహుల్ సారథ్యంలోని ఈ జట్టు ఇప్పుడు మరో ఆరుగురు ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది. ముంబయి, పంజాబ్ లలో 8 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. చెన్నై, లక్నో, బెంగళూరు, హైదరాబాద్ జట్లలో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా కోల్ కతా జట్టులో 12 ఖాళీలు ఉండగా, తర్వాతి స్థానంలో ఢిల్లీ (9) ఉంది.