
IPL 2023 సీజన్‌లో గత వారం హై స్కోరింగ్ గేమ్స్ క్రికెట్ ఫ్యాన్స్‌కి మజాని అందించగా ఈ వారం మాత్రం అలాంటి మెరుపులు కనిపించడం లేదు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెజర్స్ బెంగళూరు, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 174 పరుగుల ఓ మోస్తరు స్కోరు చేయగలిగింది. ఒకనాక 137/0 స్కోరుతో కనిపించిన ఆర్‌సీబీ, ఈజీగా 200+ స్కోరు చేస్తుందని అనుకున్నారు ఫ్యాన్స్. డెత్ ఓవర్లలో వరుస వికెట్లు తీసిన పంజాబ్ కింగ్స్ బౌలర్లు, ఆర్‌సీబీ స్కోరును కట్టడి చేశారు.
ఫాఫ్ డుప్లిసిస్ గాయంతో బాధపడుతూ ఇంపాక్ట్ ప్లేయర్‌గా రావడంతో ఈ మ్యాచ్‌కి విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 2021 ఐపీఎల్ సమయంలో ఆర్‌సీబీ కెప్టెన్సీకి రాజీనామా ప్రకటించిన విరాట్ కోహ్లీ, 2022 జనవరి 11న కేప్‌టౌన్ టెస్టులో ఆఖరిగా కెప్టెన్సీ చేశాడు. 15 నెలల తర్వాత తిరిగి కెప్టెన్‌గా నేటి మ్యాచ్ ఆడుతున్నాడు విరాట్ కోహ్లీ..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి శుభారంభం దక్కింది. ఫాఫ్ డుప్లిసిస్, విరాట్ కోహ్లీ కలిసి తొలి వికెట్‌కి 137 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన మొదటి ఓవర్‌లో 5 పరుగులే రాగా హర్‌ప్రీత్ బ్రార్ వేసిన రెండో ఓవర్‌లో 6 పరుగులే వచ్చాయి. మొదటి 2 ఓవర్లలో 11 పరుగులే చేసిన ఆర్‌సీబీ ఓపెనర్లు ఆ తర్వాత గేర్ మార్చారు...
అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో విరాట్ కోహ్లీ 2 ఫోర్లు బాదగా, హర్‌ప్రీత్ బ్రార్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో ఫాఫ్ డు ప్లిసిస్ రెండు సిక్సర్లు బాదాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
ఆ తర్వాత ఓవర్‌కో బౌండరీ చొప్పున కొడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు ఫాఫ్ డుప్లిసిస్. మరో ఎండ్‌లో విరాట్ కోహ్లీ మాత్రం సింగిల్స్ తీస్తూ, ఫాఫ్ డుప్లిసిస్‌కి స్ట్రైయిక్ ఇవ్వడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు..
40 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ, హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జితేశ్ శర్మ పట్టిన సూపర్బ్ క్యాచ్‌కి అవుట్ అయ్యాడు. 47 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 59 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... ఐపీఎల్ 2023 సీజన్‌లో నాలుగో హాఫ్ సెంచరీ బాది పెవిలియన్ చేరాడు..
ఆ తర్వాతి బంతికి వస్తూనే భారీ షాట్ ఆడేందుకు చూసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, అథర్వ టైడ్‌కి క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. వరుసగా రెండు వికెట్లు పడిన తర్వాత వేగం పెంచిన ఫాఫ్ డుప్లిసిస్, రెండు సిక్సర్లు బాదాడు...
56 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 84 పరుగులు చేసిన ఫాఫ్ డుప్లిసిస్, నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో సామ్ కుర్రాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 137/0 స్కోరు ఉన్న ఆర్‌సీబీ, 8 బంతుల గ్యాప్‌లో 3 వికెట్లు కోల్పోయి 151/3 స్థితికి చేరుకుంది...
దినేశ్ కార్తీక్ కూడా ఎప్పటికే 5 బంతుల్లో ఓ ఫోర్ బాది 7 పరుగులు చేసి అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మహిపాల్ లోమ్రోర్ 9 బంతుల్లో 7, షాబజ్ అహ్మద్ 5 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.