
ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడే అసోం కుర్రాడు రియాన్ పరాగ్ పేలవ ఆటతో దారుణంగా విఫలమవుతున్నాడు. టాలెంట్ పరంగా దేశవాళీలో అతడు తానేంటో నిరూపించుకున్నాడు. ఇటీవలే ముగిసిన రంజీ సీజన్ లో అసోం తరఫున మెరుగైన ప్రదర్శనలే చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఒక మ్యాచ్ లో 170 ప్లస్ స్కోరు కూడా చేశాడు. కానీ ఐపీఎల్ లో మాత్రం అతడి ఆట బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అన్నట్టుగా ఉంది.
బుధవారం లక్నో - రాజస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో హెట్మెయర్ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన అతడు.. 12 బంతుల్లో 15 పరుగులే చేశాడు. రాజస్తాన్ ధాటిగా ఆడే ధ్రువ్ జురెల్ ను పక్కనబెట్టి పరాగ్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు పంపినా అతడి వైఫల్యం కొనసాగుతోంది.
ఈ సీజన్ లో ఐదు మ్యాచ్ లు పరాగ్ స్కోర్లు 7, 20, 7, 5, 15 గా ఉన్నాయి. జో రూట్ వంటి దిగ్గజ బ్యాటర్ ను కూడా బెంచ్ లో కూర్చోబెట్టి పరాగ్ ను ఆడిస్తున్న రాజస్తాన్ యాజమాన్యం అందుకు భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నది. ఫీల్డ్ లో తన అటిట్యూడ్ తో పిచ్చి పిచ్చి వేషాలతో నిత్యం ట్రోల్స్ కు గురయ్యే పరాగ్ పై తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. ఒక ఆటగాడు బాగా ఆడినప్పుడు ఎన్ని వేషాలైనా వేయొచ్చు. కానీ ఆడకున్నా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం అందుకు సంబంధించిన రియాక్షన్లు దారుణంగా ఉంటాయి. దీనికి పరాగే అతిపెద్ద నిదర్శనం.
వరుసగా విఫలమవుతున్న పరాగ్ ను ఉద్దేశిస్తూ ట్రోలర్స్ ఆటాడుకుంటున్నారు. అతడిని ‘మోస్ట్ ఇరిటేటింగ్ ప్లేయర్’ గా అభివర్ణిస్తూ మీమ్స్ తో ఫన్ ను పంచుతున్నారు. రాజస్తాన్ ఇటువంటి ఆటగాడికి రూ. 3.8 కోట్లు వెచ్చించడంతో వారి డబ్బంగా బూడిదలో పోసిన పన్నీరైందని వాపోతున్నారు. ఈ మీమ్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఐపీఎల్ లో 2019 నుంచి ఆడుతున్న పరాగ్ రాజస్తాన్ కే ఆడుతున్నాడు. ఆ ఏడాది రూ. 20 లక్షలతో రాజస్తాన్ అతడిని దక్కించుకుంది. 2022 వేలంలో పరాగ్ ను ఏకంగా రూ. 3.8 కోట్లకు దక్కించుకుంది. రింకూ సింగ్, ధ్రువ్ జురెల్, జితేశ్ శర్మ, షారుక్ ఖాన్ వంటి ప్లేయర్లకు రూ. 50 లక్షలు కూడా వెచ్చించని ఫ్రాంచైజీలు ఇటువంటి చెత్త ప్లేయర్లకు కోటానుకోట్లు పోసి వారి డబ్బును వృథా చేసుకుంటున్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి.