హమ్మయ్య.. సన్‘రైజ్’ అయింది.. బోణీ కొట్టిన హైదరాబాద్

Published : Apr 09, 2023, 11:05 PM ISTUpdated : Apr 09, 2023, 11:16 PM IST
హమ్మయ్య.. సన్‘రైజ్’ అయింది.. బోణీ కొట్టిన హైదరాబాద్

సారాంశం

IPL  2023: ఐపీఎల్ -16 లో సన్ రైజర్స్  హైదరాబాద్ ఎట్టకేలకు బోణీ కొట్టింది.  వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయిన ఎస్ఆర్‌హెచ్..  పంజాబ్ కింగ్స్‌కు ఈ సీజన్ లో ఓటమి రుచి చూపించింది.  

హమ్మయ్య.. సన్ రైజర్స్  హైదరాబాద్ గెలిచింది. వరుసగా రెండు  ఓటముల తర్వాత  ఈ సీజన్ లో  విజయం సాధించి బోణీ కొట్టింది. సొంతగడ్డలో పంజాబ్ ను ఫస్ట్ బాల్ తో  తర్వాత బ్యాట్ తో  రఫ్ఫాడించింది.  పంజాబ్ నిర్దేశించిన  144 రన్స్  టార్గెట్ ను   17.1 ఓవర్లలోనే  ఛేదించింది. సన్ రైజర్స్ లో   వన్ డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి  (48 బంతుల్లో  74 నాటౌట్, 10 ఫోర్లు, 3 సిక్సర్లు), ఎయిడెన్ మార్క్‌రమ్ (21 బంతుల్లో 37 నాటౌట్, 6 ఫోర్లు) రాణించారు.  రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి   టార్గెట్ ను మరో  17 బంతులు మిగిలుండగానే ఊదేసింది.   ఈ సీజన్ లో హైదరాబాద్ తమ తర్వాతి మ్యాచ్ ను ఈనెల 14న కోల్కతాతో ఆడనుంది. 

స్వల్ప లక్ష్య ఛేదనను  హైదరాబాద్ ఆడుతూ పాడుతూ ఛేదించింది.   ఇన్నింగ్స్ ప్రారంభంలోనే  హ్యారీ బ్రూక్ వికెట్ కోల్పోయినా   రాహుల్ త్రిపాఠి, కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ ల నిలకడతో   హైదరాబాద్ కు  తొలి విజయం దక్కింది.  

144 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో  గత రెండు మ్యాచ్ లలో  మిడిలార్డర్ లో వచ్చి విఫలమైన  ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (13) ను ఓపెనర్ గా పంపింది.   14 బంతులాడిన బ్రూక్..  మూడు ఫోర్లు కొట్టినా  అర్ష్‌దీప్ సింగ్ వేసిన  నాలుగో ఓవర్లో  ఐదో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.   క్రీజులో కుదురుకుంటున్నట్టే కనిపించిన  మయాంక్ అగర్వాల్  (20 బంతుల్లో 21,     3 ఫోర్లు)  కూడా  రాహుల్ చాహర్ వేసిన 9వఓవర్ మూడో బంతికి  సామ్ కరన్ కు క్యాచ్ ఇచ్చాడు.  

ఆదుకున్న త్రిపాఠి-మార్క్‌రమ్.. 

54కే రెండు కీలక వికెట్లు కోల్పోయిన తరుణంలో రాహుల్ త్రిపాఠి, కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ లు  పంజాబ్ కు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు.    ఆది నుంచి దూకుడుగానే ఆడిన  త్రిపాఠి.. హర్‌ప్రీత్ బ్రర్ వేసిన  పదో ఓవర్లో మూడు బౌండరీలు బాదాడు.   ఆ తర్వాత రాహుల్ చాహర్ బౌలింగ్ లో కూడా రెండు  ఫోర్లు కొట్టాడు.  మోహిత్ రథి వేసిన  13వ ఓవర్లో భారీ సిక్సర్ తో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న  త్రిపాఠి.. ఆ తర్వాత కూడా ధాటిగా ఆడాడు.  రథి వేసిన  15వ ఓవర్లో  4, 6, 4,4 బాదాడు.  

 

ఒకవైపు త్రిపాఠి బాదుతుంటే అతడికి తోడుగా సింగిల్స్ తీసుకుంటూ ఆడిన  మార్క్‌రమ్..  స్కోరు 100 పరుగులు దాటినాక బ్యాట్ కు పనిచెప్పాడు. నాథన్ ఎలీస్ వేసిన  17వ ఓవర్లో   నాలుగు బౌండరీలు బాదాడు.   ఇక హర్‌ప్రీత్ బ్రర్ వేసిన 18వ ఓవర్లో తొలి బంతికి  అవుట్ సైడ్ ఆఫ్ దిశగా  ఫోర్ కొట్టిన రాహుల్.. ఈ సీజన్ లో  సన్ రైజర్స్ కు తొలి విజయాన్ని అందించాడు.  

అంతకుముందు ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన  పంజాబ్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బౌలర్ల ధాటికి పంజాబ్ బ్యాటర్లలో  ఏకంగా 9 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే వెనుదిరిగారు.  కానీ కెప్టెన్ శిఖర్ ధావన్..  66 బంతుల్లో 12 బౌండరీలు, 5 సిక్సర్లతో  99 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.  సామ్ కరన్ (22) ఫర్వాలేదనిపించాడు.  సన్ రైజర్స్ బౌలర్లలో మయాంక్ మార్కండే నాలుగు వికెట్లు తీశాడు. 

 

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?