గబ్బర్ సెంచరీ మిస్.. ఉప్పల్‌లో పంజాబ్‌కు చుక్కలు చూపించిన హైదరాబాద్..

Published : Apr 09, 2023, 09:24 PM ISTUpdated : Apr 09, 2023, 09:27 PM IST
గబ్బర్ సెంచరీ మిస్.. ఉప్పల్‌లో పంజాబ్‌కు చుక్కలు చూపించిన హైదరాబాద్..

సారాంశం

IPL 2023 SRH vs PBKS: ఐపీఎల్-16లో వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిన తర్వాత సన్ రైజర్స్ బౌలర్లకు జ్ఞానోదయం  అయినట్టుంది.   పటిష్టమైన పంజాబ్ బ్యాటింగ్ లైనప్ ను హైదరాబాద్ బౌలర్లు ఆటాడుకున్నారు. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2023 ఎడిషన్ లో   దాదాపు అన్ని జట్లు బోణీ కొట్టడమే గాక తమ మార్క్ ఆటతో అలరిస్తున్న వేళ సన్ రైజర్స్ హైదరాబాద్  ఆటగాళ్లు  మాత్రం   వరుసగా రెండు మ్యాచ్ లను ఓడిపోయి   అభిమానులను నిరాశపరిచారు.  సన్ రైజర్స్ అంటేనే  బౌలింగ్.. బౌలింగ్ అంటే సన్ రైజర్స్. గత రెండు మ్యాచ్ లలో అదే మిస్ అయింది.  కానీ ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న  మ్యాచ్ లో  హైదరాబాద్ బౌలర్లు తడాఖా చూపించారు.  పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న  పంజాబ్ కింగ్స్ ను నిర్ణీత 20 ఓవర్లలో 143-9 కే పరిమితం చేశారు. 

అయితే  పంజబాబ్ బ్యాటర్లను  వెంటవెంటనే ఔట్ చేసిన ఎస్ఆర్‌హెచ్ బౌలర్లు చివర్లో లయ తప్పారు.  పంజాబ్ సారథి శిఖర్ ధావన్ (66 బంతుల్లో99 నాటౌట్, 12 ఫోర్లు, 5 సిక్సర్లు) ఒక్క పరుగు తేడాతో  సెంచరీ కోల్పోయాడు. కానీ ఒంటరిపోరాటం చేసి   ఆ జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. సన్ రైజర్స్ తరఫున తొలి మ్యాచ్ ఆడుతున్న మయాంక్ మార్కండే   నాలుగు ఓవర్లు వేసి 15 పరుగులే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు.పంజాబ్ లో   శిఖర్ ధావన్, సామ్ కరన్ మినహా  ఒక్క బ్యాటర్ కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయలేదు. 

ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన పంజాబ్ కింగ్స్  కు తొలి బంతికే  భువనేశ్వర్ షాకిచ్చాడు.  గత రెండు మ్యాచ్ లలో  మెరుపులు మెరిపించిన ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్  సింగ్.. ఈ మ్యాచ్ లో ఎదుర్కున్న తొలి బంతికే  భువీకి వికెట్లు ముందు దొరికిపోయాడు.  అప్పుడు  మొదలైన పంజాబ్ పతనం  మధ్యలో గ్యాప్ లేకుండా సాగింది.  

వచ్చారు.. వెళ్లారు.. 

మార్కో  జాన్సేన్  వేసిన రెండో ఓవర్లో  మాథ్యూ షార్ట్  (1)  కూడా ఎల్బీగా వెనుదిరిగాడు. అతడే వేసిన నాలుగో ఓవర్లో   జితేశ్ శర్మ  (4) కూడా  మార్క్‌రమ్ కు క్యాచ్ ఇచ్చాడు. జాన్సేన్ వేసిన ఆరో ఓవర్లో  ఓ 6, 4 కొట్టిన సామ్ కరన్ (15 బంతుల్లో 22, 3 ఫోర్లు, 1 సిక్సర్) ను సన్ రైజర్స్ తరఫున తొలి మ్యాచ్ ఆడుతున్న మయాంక్ మార్కండే బలితీసుకున్నాడు. కరన్ ఇచ్చిన క్యాచ్ ను షార్ట్ థర్డ్ మ్యాన్ లో  ఉన్న భువనేశ్వర్ అందుకన్నాడు. 

పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ ప్లేస్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన   సికందర్ రజ  (5) ను ఉమ్రాన్ మాలిక్ తాను వేసిన తొలి ఓవర్ (ఇన్నింగ్స్ 10వ) లోనే   ఔట్ చేశాడు.  10 ఓవర్లకు  పంజాబ్  సగం వికెట్లు కోల్పోయి  73 పరుగులు చేసింది. 

మార్కండే ..  11వ ఓవర్లో   షారుఖ్ ఖాన్ (4) ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఉమ్రాన్ మాలిక్ .. 12వ ఓవర్లో  హర్‌ప్రీత్ బ్రర్  (1) ను బౌల్డ్ చేశాడు. మార్కండే  వేసిన  13వ ఓవర్లో రాహుల్ చాహర్ (0) కూడా  పెవిలియన్ కు పంపాడు.   

 

నిలబడ్డ ధావన్..

ఒకవైపు  వరుసగా వికెట్లు కోల్పోతున్నా శిఖర్ ధావన్ మాత్రం  కెప్టెన్ గా బాధ్యతాయుత ఇన్నింగ్స్  ఆడాడు.  వీలు చిక్కినప్పుడల్లా  బంతిని బౌండరీకి తరలించాడు.  అతడికి తోడుగా ఒక్కరూ నిలవకున్నా ధావన్ రాణించాడు. మార్కండే వేసిన   15వ ఓవర్లో  నాథన్ ఎలిస్  (0)  ను బౌల్డ్ చేశాడు.  ఆడుతున్న తొలి మ్యాచ్ లోనే  నాలుగు వికెట్లు తీసిన మార్ఖండే తన కోటాను ముగించాడు. నటరాజన్ వేసిన   16వ ఓవర్లో  నాలుగో బంతిని సిక్సర్ కొట్టిన శిఖర్.. హాఫ్  సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  అదే ఓవర్లో ఫైన్ లెగ్ మీదుగా మరో సిక్సర్ బాది పంజాబ్ స్కోరును వంద పరుగులు దాటించాడు.   ఉమ్రాన్ మాలిక్ వేసిన 18వ ఓవర్లో  6,4,6 బాదాడు.  ఇదే క్రమంలో  ధావన్ 90లలోకి చేరాడు. నటరాజన్ వేసిన  ఆఖరి ఓవర్లో  తొలి బంతికి పరుగులు తీయలేదు. రెండో బాల్ కు 2 రన్స్ వచ్చాయి.  మూడు, నాలుగు బంతులకు పరుగులు రాలేదు.  ఐదో బంతికి అదే పరిస్థితి. కానీ ఆరో బంతికి భారీ సిక్సర్ తో 99 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.  పంజాబ్ చేసిన 143 పరుగులలో ధావన్ చేసినవే 99 రన్స్ ఉండటం గమనార్హం.ఈ మ్యాచ్ లో  మార్కండే నాలుగు వికెట్లు తీయగా ఉమ్రాన్ మాలిక్, మార్కో జాన్సేన్ లు  తలా రెండు  వికెట్లు తీశారు. భువనేశ్వర్ కు ఒక వికెట్ దక్కింది. 

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?