IPL 2023: బట్లర్ సెంచరీ మిస్.. దంచికొట్టిన రాజస్తాన్.. హైదరాబాద్ ముందు భారీ లక్ష్యం

Published : May 07, 2023, 09:10 PM IST
IPL 2023: బట్లర్ సెంచరీ మిస్.. దంచికొట్టిన రాజస్తాన్.. హైదరాబాద్ ముందు భారీ లక్ష్యం

సారాంశం

IPL 2023, RR vs SRH:  ఐపీఎల్-16లో రాజస్తాన్ రాయల్స్ మరోసారి  తన బ్యాటింగ్  పవర్ చూపెట్టింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను ఆటాడుకుంటూ  20 ఓవర్లలోనే  214 పరుగులు సాధించింది. జోస్ బట్లర్ తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. 

గత సీజన్ లో   వీరబాదుడు బాది   ఐపీఎల్-16లో వరుసగా విఫలముతున్న రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్.. సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో రెచ్చిపోయాడు. ఇప్పటివరకు ఆడిన  10 మ్యాచ్ లలో  297 పరుగులే చేసిన  బట్లర్.. నేడు సన్ రైజర్స్ పోరులో మాత్రం వీరవిహారం చేశాడు.  59 బంతుల్లోనే 10 ఫోర్లు,4  సిక్సర్ల సాయంతో 95 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అతడికి తోడు  సంజూ శాంసన్ (38 బంతుల్లో 66, 4 ఫోర్లు, 5 సిక్సర్లు)  కూడా రాణించడంతో రాజస్తాన్..  నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 214 పరుగులు చేసింది. 

రాజస్తాన్ - హైదరాబాద్ మ్యాచ్ లో  టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ కు జైస్వాల్ తో కలిసి  బట్లర్ తొలి వికెట్ కు అర్థ సెంచరీ భాగస్వామ్యం  జతచేశాడు. ఆది నుంచే ధాటిగా ఆడిన  జైస్వాల్..  18 బంతుల్లోనే 5 బౌండరీలు,  2 సిక్సర్ల సాయంతో  35 పరుగులు చేశాడు.  మార్కో జాన్సెన్  వేసిన   ఐదో ఓవర్లో  నటరాజన్ కు క్యాచ్ ఇచ్చి  ఔటయ్యాడు. 

జైస్వాల్ నిష్క్రమించిన తర్వాత వచ్చిన  బట్లర్‌కు  కెప్టెన్ సంజూ శాంసన్ జతకలిశాడు.   క్రీజులోకి రావడం రావడమే భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు శాంసన్.  మయాంక్ మార్కండే వేసిన  9వ ఓవర్లో   శాంసన్.. రెండు భారీ సిక్సర్లు బాదాడు.  ఇదే ఓవర్లో బట్లర్ కూడా ఓ సిక్స్  కొట్టాడు. 

తొలుత కాస్త నెమ్మదిగా ఆడిన బట్లర్..  తర్వాత రెచ్చిపోయాడు. తొలి 9 ఓవర్ల వరకు  22 బంతుల్లో  27 పరుగులే చేసిన బట్లర్.. తర్వాత  బ్యాట్ ఝుళిపించాడు.   అభిషేక్ శర్మ వేసిన 11వ ఓవర్లో   6,4 కొట్టిన బట్లర్  32 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. అర్థ సెంచరీ తర్వాత రెచ్చిపోయాడు.  

 

ఈ ఇద్దరూ  వీరబాదుడు బాదడంతో   15 ఓవర్లకే  రాజస్తాన్ స్కోరు 150 దాటింది.  ఇదే క్రమంలో ఈ ఇద్దరి మధ్య   వంద పరుగుల భాగస్వామ్యం పూర్తైంది.   భువనేశ్వర్ కుమార్ వేసిన  17వ ఓవర్లో  మూడు ఫోర్లు కొట్టిన  బట్లర్ 90లలోకి వచ్చాడు.   కాన భువనేశ్వర్ వేసిన  19వ ఓవర్లో మూడో బంతికి అతడు ఎల్బీడబ్ల్యూ అయి  తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు.బట్లర్ నిష్క్రమించినా  శాంసన్ రాజస్తాన్ స్కోరును 200 దాటించాడు. నటరాజన్ వేసిన  ఆఖరి ఓవర్లో  4, 6 , 6 బాదాడు. ఫలితంగా రాజస్తాన్.. 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. 

సన్ రైజర్స్ బౌలర్లలో   మార్కండే, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్ లు ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. మరి  అసలే బ్యాటింగ్ వైఫల్యాలతో సతమతమవుతున్న   సన్ రైజర్స్.. ఈ కొండను ఢీకొట్టగలదా..? అన్నది  త్వరలో తేలనుంది. 

PREV
click me!

Recommended Stories

IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !
T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !