IPL 2023: తమ్ముడి చేతిలో అన్న ఓటమి.. లక్నోపై గుజరాత్ గ్రాండ్ విక్టరీ

Published : May 07, 2023, 07:28 PM ISTUpdated : May 07, 2023, 07:29 PM IST
IPL 2023: తమ్ముడి చేతిలో అన్న ఓటమి..  లక్నోపై గుజరాత్ గ్రాండ్ విక్టరీ

సారాంశం

IPL 2023, GT vs LSG: అన్నాదమ్ముల పోరులో  హర్ధిక్ పాండ్యాదే పైచేయి.  గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 228 పరుగుల  లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో  171 పరుగులకే పరిమితమైంది.  

ఐపీఎల్-16లో గుజరాత్ టైటాన్స్ కు  తిరుగులేదు. లక్నో సూపర్ జెయింట్స్ తో  అహ్మదాబాద్ వేదికగా ముగిసిన   ‘పాండ్యా బ్రదర్స్ పోరు’లో అన్న కృనాల్ ను తమ్ముడు హార్ధిక్ ఓడించాడు.  గుజరాత్ నిర్దేశించిన  228 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టు  ఓపెనింగ్ బ్యాటర్ క్వింటన్ డికాక్ (41 బంతుల్లో 70, 7 ఫోర్లు, 3 సిక్సర్లు), కైల్ మేయర్స్ లు పోరాడినా మిగిలిన బ్యాటర్లు విఫలమవడంతో   ఆ జట్టు 171 పరుగుల  వద్దే ఆగిపోయింది. ఈ విజయంతో గుజరాత్.. పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 

228 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఇన్నింగ్స్ ను ధాటిగానే ఆరంభించింది.    క్వింటన్ డికాక్  భారీ మెరుపులు మెరిపించకపోయినా కైల్ మేయర్స్ కు అండగా నిలిచాడు.  మేయర్స్.. 32 బంతుల్లో  7 బౌండరీలు,  2 సిక్సర్ల సాయంతో  48 పరుగులు చేశాడు.

హార్ధిక్ పాండ్యా వేసిన  రెండో ఓవర్లోనే హ్యాట్రిక్ ఫోర్లు బాదిన  మేయర్స్.. షమీ  వేసిన  మూడో ఓవర్లో భారీ సిక్సర్, ఫోర్ కొట్టాడు. ఈ ఓవర్లోనే డికాక్ రెండు ఫోర్లు సాధించాడు.  మూడు ఓవర్లలోనే ఈ జోడీ  అర్థ సెంచరీ భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుంది.  రషీద్ ఖాన్ వేసిన  ఐదో ఓవర్లో 14 పరుగులు రావడంతో పవర్ ప్లేలో   లక్నో.. వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. లక్ష్యం దిశగా సాగుతున్న ఈ జోడీని  మోహిత్ శర్మ విడదీశాడు. మోహిత్ వేసిన 9వ ఓవర్లో రెండో బంతికి  మేయర్స్ ఇచ్చిన క్యాచ్ ను రషీద్ ఖాన్ అద్భుతంగా అందుకున్నాడు.   

మేయర్స్ ప్లేస్ లో వచ్చిన  దీపక్ హుడా (11) తో కలిసి  డికాక్  లక్నో గెలుపును భుజాన వేసుకున్నాడు.  హార్ధిక్ పాండ్యా వేసిన  పదో ఓవర్లో చివరి బంతికి  డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా సిక్స్ కొట్టిన  డికాక్.. లక్నో స్కోరును వంద దాటించాడు. లక్నో విజయానికి చివరి 10 ఓవర్లలో 126 పరుగులు కావాల్సి వచ్చింది. 

వికెట్లు టప టప.. 

11వ ఓవర్ నుంచి  లక్నో ఇన్నింగ్స్ ఒడిదొడుకులకు లోనైంది. షమీ వేసిన  13వ ఓవర్లో  ఫస్ట్ బాల్ కు డికాక్ సింగిల్ తీసి హాఫ్ సెంచరీ చేశాడు.  రెండో బంతికి  దీపక్ హుడా రాహుల్ తెవాటియాకు క్యాచ్ ఇచ్చాడు.  మోహిత్ వేసిన    15వ ఓవర్లో  మూడో బంతికి సిక్సర్ బాదాడు డికాక్. కానీ ఐదో బంతికి  స్టోయినిస్  (4) ఔట్ అయ్యాడు. రషీద్ ఖాన్ వేసిన  16వ ఓవర్లో  డికాక్  కూడా  బౌల్డ్ అయ్యాడు.  

నూర్ అహ్మద్ వేసిన  18వ ఓవర్లో  నికోలస్ పూరన్  (3)  కూడా  భారీ షాట్ ఆడి షమీకి క్యాచ్ ఇచ్చాడు.  11 బంతుల్లో 1 ఫోర్ , 2 సిక్సర్లతో 21 పరుగులు చేసిన  అయుష్ బదోని  కూడా నిష్క్రమించాడు.  ఇదే ఓవర్లో ఆఖరి బంతికి   కృనాల్ పాండ్యా   డకౌట్ అయ్యాడు.  గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ నాలుగు వికెట్లతో లక్నో పోరాటానికి అడ్డుకట్ట వేశాడు. 

ఈ మ్యాచ్ లో టాస్  ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత  20 ఓవర్లలో   రెండు వికెట్లు కోల్పోయి 227 పరుగుల భారీ స్కోరు చేసింది.  వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (81), శుభ్‌మన్ గిల్ (94 నాటౌట్) లు రాణించారు. 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !