చెపాక్‌లో చెన్నైకి ఝలక్ ఇచ్చిన రాజస్తాన్.. లాస్ట్ ఓవర్ థ్రిల్లర్‌లో శాంసన్ సేనదే విజయం..

By Srinivas MFirst Published Apr 12, 2023, 11:29 PM IST
Highlights

IPL 2023 CSK vs RR:  చెన్నై సూపర్ కింగ్స్ - రాజస్తాన్ రాయల్స్ మధ్య  చెన్నై చెపాక్ వేదికగా ఉత్కంఠగా ముగిసిన  17వ లీగ్ మ్యాచ్ లో  సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్తాన్‌కే విజయం దక్కింది. 

ఐపీఎల్ - 16లో మరో  ఉత్కంఠ పోరు.  గడిచిన మూడు రోజులుగా  లాస్ట్ ఓవర్ థ్రిల్లర్‌లలో ఫలితాలు తేలుతున్న  పరంపరను కొనసాగిస్తూ  చెన్నై సూపర్ కింగ్స్ -  రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ కూడా  అదే బాటలో సాగింది.   చివరి బంతి వరకూ ఫలితం ఇరు జట్ల మధ్య దోబూచులాడింది.   రాజస్తాన్ నిర్దేశించిన  176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో  చెన్నై..  113కే 6 వికెట్లు కోల్పోయినా  రవీంద్ర జడేజా  (15 బంతుల్లో 25 నాటౌట్, 1 ఫోర్, 2 సిక్సర్లు),  వరల్డ్ బెస్ట్ ఫినిషర్ ఎంఎస్ ధోని  (17 బంతుల్లో 32 నాటౌట్, 1 ఫోర్, 3 సిక్సర్లు)  లు  ధనాధన్ ఆటతో  మ్యాచ్ కు  థ్రిల్లింగ్ ఎండింగ్ ఇచ్చే యత్నం చేసినా  సందీప్ శర్మ    తెలివిగా బౌలింగ్ చేసి  చెన్నైకి విజయాన్ని దూరం చేశాడు. స్పిన్ కు అనుకూలించిన  చెపాక్ పిచ్ పై  175 పరుగులను డిఫెండ్ చేసుకుంది.  స్పిన్నర్ల త్రయం అశ్విన్, చాహల్,  జంపాలు చెన్నై బ్యాటర్లను కట్టడి చేశారు.  ఈ ముగ్గురి స్పిన్ ఉచ్చులో పడ్డ  చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి  172  పరుగులకే పరిమితమైంది.  ఫలితంగా రాజస్తాన్  3 పరుగుల తేడాతో విజయం సాధించింది.  

176 పరుగుల లక్ష్య ఛేదనలో   చెన్నైకి రెండో ఓవర్లోనే షాక్ తగిలింది.  ఫామ్ లో ఉన్న ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (8) ను సందీప్ శర్మ  ఔట్ చేశాడు.   గత మ్యాచ్ లో  ముంబైపై సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన అజింక్యా రహానే (19 బంతుల్లో  31,  2 ఫోర్లు, 1 సిక్సర్) తో  కలిసి డెవాన్ కాన్వే  (38 బంతుల్లో 50,  6 ఫోర్లు) లు చెన్నైని ముందుకు నడిపించారు. రహానే - కాన్వేలు మరీ ధాటిగా ఆడకపోయినా  రన్ రేట్ 7 కు తగ్గకుండా జాగ్రత్తపడ్డారు. 

Latest Videos

స్పిన్ ఉచ్చులో చిక్కిన చెన్నై.. 

చెన్నై పిచ్  స్పిన్నర్లకు అనుకూలిస్తుండంతో  సంజూ శాంసన్ తెలివిగా  జోస్ బట్లర్ స్థానంలో  ఆడమ్ జంపాను ఇంపాక్ట్ ప్లేయర్ గా రంగ ప్రవేశం చేయించాడు. అశ్విన్ వేసిన 10వ ఓవర్లో  మూడో బంతికి  రహానే వికెట్ల ముందు దొరికిపోయాడు.   దీంతో 68 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 

రహానే ప్లేస్ లో వచ్చిన శివమ్ దూబే   (8)  కూడా  ఆకట్టుకోలేదు. స్పిన్నర్లు రెండు వైపులా కట్టడి చేస్తుండటంతో  చెన్నైకి పరుగుల రాక కష్టమైంది.   మోయిన్ అలీ  (7) కూడా విఫలమయ్యాడు.  మగల స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అంబటి రాయుడు (1) కూడా భారీ షాట్ ఆడి   హెట్మెయర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పదో ఓవర్ నుంచి 14 ఓవర్ వరకూ ఐదు ఓవర్లలో చెన్నై 27 పరుగేలే చేసింది.   ఈ క్రమంలో చెన్నై.. రహానే, దూబే, మోయిన్ అలీ, రాయుడు  వికెట్లను కూడా కోల్పోయింది. 

చాహల్ వేసిన  15వ ఓవర్లో  ఐదో బాల్ కు స్క్వేర్ లెగ్ దిశగా మూడు పరుగులు తీసిన కాన్వే  హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  కానీ అదే ఓవర్లో  ఆఖరి బంతికి   జైస్వాల్ సూపర్ క్యాచ్ పట్టడంతో  పెవిలియన్ కు చేరాడు. 

ఆశలు కల్పించిన ధోని - జడేజా 

ఇక చివరి 5 ఓవర్లలో  63 పరుగులు చేయాల్సి ఉండగా  ధోని  తో కలిసి రవీంద్ర జడేజా లు చెన్నైకి విజయం మీద ఆశలు కల్పించారు.  జంపా వేసిన   18వ ఓవర్లో  ధోని 4, 6 కొట్టాడు. 12 బంతులలో  40 పరుగులు చేయాల్సి ఉండగా  జేసన్ హోల్డర్ వేసిన 19వ ఓవర్లో ఫోర్, రెండు సిక్సర్లు  కొట్టాడు.  ఇక చివరి ఓవర్లో  చెన్నై విజయానికి  21 పరుగులు అవసరమయ్యాయి.    శాంసన్ బంతిని  సందీప్ శర్మకు అందించాడు.  తొలి రెండు బంతులు వైడ్స్. రెండు, మూడు బంతులకు  ధోని భారీ సిక్సర్లు బాదాడు. 4, 5 బంతులకు రెండు పరుగులే వచ్చాయి. ఇక  చివరి బంతికి ఐదు పరుగులు చేయాల్సి ఉండగా.. సందీప్ వేసిన  యార్కర్ డెలివరీని ధోని ఒక్క పరుగు మాత్రమే తీశాడు.  దీంతో  రాజస్తాన్ 3 పరుగుల తేడాతో నెగ్గింది.  చెన్నై కెప్టెన్ గా   ధోని తన 200వ మ్యాచ్ ను నెగ్గలేకపోయాడు. 

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన  రాజస్తాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి  175 పరుగులు చేసింది.  బట్లర్ (52) తో పాటు పడిక్కల్ (38), అశ్విన్ (30), హెట్మెయర్ (30) లు రాణించారు. చెన్నై బౌలర్లలో  ఆకాశ్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, రవీంద్ర జడేజా ద లు తలా రెండు వికెట్లు తీశారు.  మోయిన్ అలీకి ఒక వికెట్ దక్కింది. 
 

click me!