చెన్నై ‘టాప్’ లేపిన రాజస్థాన్ రాయల్స్... సీఎస్‌కేని ఓడించి, టేబుల్ టాప్‌లోకి సంజూ శాంసన్ టీమ్...

By Chinthakindhi RamuFirst Published Apr 27, 2023, 11:11 PM IST
Highlights

చెన్నై సూపర్ కింగ్స్‌ని ఓడించి టేబుల్ టాప్‌కి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్... 3 వికెట్లు తీసిన ఆడమ్ జంపా, రవిచంద్రన్ అశ్విన్‌కి రెండు వికెట్లు... 47 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, హాఫ్ సెంచరీ చేసిన శివమ్ దూబే...

ఐపీఎల్ 2023 సీజన్‌లో టేబుల్ టాపర్ చెన్నై సూపర్ కింగ్స్‌కి రెండోసారి ఝలక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. సీజన్‌ ఆరంభంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్, ఈ సారి 32 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ టేబుల్ టాపర్‌గా నిలిచింది..

భారీ లక్ష్యఛేదనని నెమ్మదిగా ఆరంభించింది చెన్నై సూపర్ కింగ్స్. సందీప్ శర్మ, కుల్దీప్ యాదవ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మొదటి 3 ఓవర్లలో 13 పరుగులు మాత్రమే వచ్చాయి. 16 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన డివాన్ కాన్వే, పవర్ ప్లేలో ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు.

Latest Videos

29 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 47 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, ఆడమ్ జంపా బౌలింగ్‌లో దేవ్‌దత్ పడిక్కల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 13 బంతుల్లో 15 పరుగులు చేసిన అజింకా రహానే, అశ్విన్ బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా వస్తూనే భారీ షాట్‌కి ప్రయత్నించిన అంబటి రాయుడు, డకౌట్ అయ్యాడు...

12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 23 పరుగులు చేసిన మొయిన్ ఆలీ, ఆడమ్ జంపా బౌలింగ్‌లో సంజూ శాంసన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. చివరి 4 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి 74 పరుగులు కావాల్సి వచ్చాయి..

జాసన్ హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో శివమ్ దూబే ఓ సిక్సర్, 2 ఫోర్లతో 16 పరుగులు రాబట్టాడు. దీంతో చివరి 3 ఓవర్లలో 58 పరుగులు అవసరమయ్యాయి. సందీప్ శర్మ వేసిన 18వ ఓవర్‌లో జడేజా 2 ఫోర్లు బాదడంతో 12 పరుగులు వచ్చాయి. జాసన్ హోల్డర్ వేసిన 19వ ఓవర్‌లో 9 పరుగులే రావడంతో ఆఖరి ఓవర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి 37 పరుగులు కావాల్సి వచ్చాయి. అప్పటికే చెన్నై ఓటమి ఖరారైపోయింది...

చివరి ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ 4 పరుగులే ఇచ్చి ఓ వికెట్ తీయడంతో 32 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది రాజస్థాన్ రాయల్స్. 33 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులు చేసిన శివమ్ దూబే, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 202 పరుగుల భారీ స్కోరు చేసింది. జైపూర్ వేదికపై ఇదే అత్యధిక స్కోరు. రాయల్స్‌కి యశస్వి జైస్వాల్ అదిరిపోయే ఆరంభం అందించాడు.  

26 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడుతుంటే మరో ఎండ్‌లో జోస్ బట్లర్ నెమ్మదిగా ఆడాడు. 21 బంతుల్లో 4 ఫోర్లతో 27 పరుగులు చేసిన జోస్ బట్లర్, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

17 బంతుల్లో ఓ ఫోర్‌తో 17 పరుగులు చేసిన సంజూ శాంసన్, తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, అదే ఓవర్‌లో యశస్వి జైస్వాల్ వికెట్ కూడా కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్. 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, అజింకా రహానేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

10 బంతుల్లో 8 పరుగులు చేసిన సిమ్రాన్ హెట్మయర్‌ని మహీశ్ తీక్షణ క్లీన్ బౌల్డ్ చేశాడు.  పథిరాణా వేసిన ఆఖరి ఓవర్‌ మొదటి రెండు బంతుల్లో 6, 4 బాదిన ధృవ్ జురెల్ 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. చివరి 3 బంతుల్లో 8 పరుగులు రాబట్టిన దేవ్‌దత్ పడిక్కల్ 13 బంతుల్లో 5 ఫోర్లతో 23 పరుగులు చేశాడు..

click me!