యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ, ధృవ్ జురెల్ మెరుపులు...భారీ స్కోరు చేసిన రాజస్థాన్ రాయల్స్...

By Chinthakindhi RamuFirst Published Apr 27, 2023, 9:16 PM IST
Highlights

జైపూర్‌లో అత్యధిక స్కోరు బాదిన రాజస్థాన్ రాయల్స్... యశస్వి జైస్వాల్ సంచలన హాఫ్ సెంచరీ!  ఆఖర్లో మెరుపులు మెరిపించిన ధృవ్ జురెల్, దేవ్‌దత్ పడిక్కల్.. 

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఓపెనర్ల పైనే ఎక్కువగా ఆధారపడిన రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో అదిరిపోయే ఆరంభం దక్కిడం, ఊహించని ఫినిషింగ్‌తో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 202 పరుగుల భారీ స్కోరు చేసింది. జైపూర్ వేదికపై ఇదే అత్యధిక స్కోరు. 


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్‌కి యశస్వి జైస్వాల్ అదిరిపోయే ఆరంభం అందించాడు. ఆకాశ్ సింగ్ వేసిన మొదటి ఓవర్‌లో 3 ఫోర్లు బాదాడు జైస్వాల్. తుషార్ దేశ్‌పాండే వేసిన రెండో ఓవర్‌లో జోస్ బట్లర్ 2 ఫోర్లు బాదగా ఆకాశ్ సింగ్ వేసిన మూడో ఓవర్‌లో  4, 6, 4, 4 బాది 18 పరుగులు రాబట్టాడు యశస్వి జైస్వాల్. దీంతో 3 ఓవర్లు ముగిసే సమయానికే 42 పరుగులకి చేరుకుంది రాజస్థాన్ రాయల్స్ స్కోరు...

Latest Videos

మహీశ్ తీక్షణ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ అవుట్ కోసం ధోనీ డీఆర్‌ఎస్ తీసుకున్నా ఫలితం దక్కలేదు. అయితే స్కోరు వేగం తగ్గడంతో తర్వాతి 3 ఓవర్లలో 22 పరుగులే వచ్చాయి. పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 64 పరుగులు చేసింది రాయల్స్. 

26 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడుతుంటే మరో ఎండ్‌లో జోస్ బట్లర్ నెమ్మదిగా ఆడాడు. 21 బంతుల్లో 4 ఫోర్లతో 27 పరుగులు చేసిన జోస్ బట్లర్, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 86 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్...

17 బంతుల్లో ఓ ఫోర్‌తో 17 పరుగులు చేసిన సంజూ శాంసన్, తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, అదే ఓవర్‌లో యశస్వి జైస్వాల్ వికెట్ కూడా కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్. 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, అజింకా రహానేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

10 బంతుల్లో 8 పరుగులు చేసిన సిమ్రాన్ హెట్మయర్‌ని మహీశ్ తీక్షణ క్లీన్ బౌల్డ్ చేశాడు. యశస్వి జైస్వాల్ క్రీజులో ఉన్నప్పుడు 10 ఓవర్లలో 100 పరుగులు చేసి ఈజీగా 200+ పరుగులు చేసేలా కనిపించిన రాజస్థాన్ రాయల్స్, మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో 14, 15, 16, 17 ఓవర్లలో ఏడేసి పరుగులే రాబట్టగలిగింది. 

18వ ఓవ్‌లో 2 ఫోర్లు బాదిన దేవ్‌దత్ పడిక్కల్ 13 పరుగులు రాబట్టగా తుషార్ దేశ్‌పాండే వేసిన 19వ ఓవర్‌లో 4, 6 బాదిన ధృవ్ జురెల్ 16 పరుగులు రాబట్టాడు. పథిరాణా వేసిన ఆఖరి ఓవర్‌ మొదటి రెండు బంతుల్లో 6, 4 బాదిన ధృవ్ జురెల్ 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. చివరి 3 బంతుల్లో 8 పరుగులు రాబట్టిన దేవ్‌దత్ పడిక్కల్ 13 బంతుల్లో 5 ఫోర్లతో 23 పరుగులు చేశాడు..

click me!