పంజాబ్ కింగ్స్ ఘన విజయం.. ఓటమితో మొదలెట్టిన కేకేఆర్‌! డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం...

By Srinivas MFirst Published Apr 1, 2023, 7:29 PM IST
Highlights

PBKS vs KKR IPL 2023: ఐపీఎల్ -16 లో కొత్త కెప్టెన్‌తో బరిలో దిగిన పంజాబ్ కింగ్స్, తొలి మ్యాచ్‌లోనే బోణీ కొట్టింది. వర్షం కారణంగా నిలిచిన మ్యాచ్‌లో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 7 పరుగుల తేడాతో గెలిచింది పంజాబ్.. 

మొహాలీలో పంజాబ్ కింగ్స్‌కి మొదటి మ్యాచ్‌లో విజయం వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్, 191 పరుగులు చేయగా ఈ లక్ష్యచేధనలో కేకేఆర్..  16 ఓవర్లు ముగిసేటప్పటికీ 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది.   కేకేఆర్ విజయానికి  24 బంతుల్లో 46  పరుగులు కావాల్సి ఉండగా..  వర్షం అంతరాయం కలిగించింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం పంజాబ్ కింగ్స్ 7 పరుగుల తేడాతో గెలిచినట్టు తేల్చారు అంపైర్లు.. 

భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో  కేకేఆర్ ఏ దశలోనూ  ఆ దిశగా సాగలేదు.    రెండో ఓవర్లోనే  మన్‌దీప్ సింగ్ (2) ను ఔట్ చేసి అర్ష్‌దీప్ సింగ్ పంజాబ్ కు తొలి బ్రేక్ ఇచ్చాడు.  ఇదే ఓవర్లో  అనుకుల్ రాయ్ (4) కూడా  ఔటయ్యాడు.   

మన్‌దీప్ సింగ్ విఫలమైనా  సామ్ కరన్ వేసిన  తొలి ఓవర్లో  6,4 తో ఊపుమీదున్న   రహ్మనుల్లా గుర్బాజ్ (16 బంతుల్లో 22, 3 ఫోర్లు, 1 సిక్సర్)అర్ష్‌దీప్ వేసిన నాలుగో ఓవర్లో కూడా  ఓ బౌండరీ సాధించాడు. కానీ నాథన్ ఎల్లీస్ వేసిన ఐదో ఓవర్లో   రెండో బంతికి  క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  

29కే 3 కీలక వికెట్లు కోల్పోయిన  దశలో   కేకేఆర్ ను వెంకటేశ్ అయ్యర్ (28 బంతుల్లో 34, 3 ఫోర్లు, 1 సిక్సర్),  కెప్టెన్ నితీశ్ రాణా (17 బంతుల్లో 24, 3 ఫోర్లు, 1 సిక్సర్) ఆదుకునే యత్నం చేశారు.  వరుణ్ చక్రవర్తి స్థానంలో  ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన   వెంకటేశ్ తో కలిసి  నాలుగో వికెట్ కు రానా  46 పరుగులు జోడించారు.  సికందర్ రజ వేసిన  ఆరో ఓవర్లో  వెంకటేశ్  రెండు ఫోర్లు కొట్టాడు.  భానుక రాజపక్స స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన  రిషి ధావన్  వేసిన  9వ ఓవర్లో  నితీశ్..  4, 6, 4 బాదాడు. కానీ రజ వేసిన  పదో ఓవర్లో   రెండో బంతికి  రాహుల్ చహర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.  ఇక చహర్ వేసిన  11వ ఓవర్లో తొలి బంతికి   రింకూ సింగ్  (4) క్ బౌల్డ్ అయ్యాడు.  ఈ ఓవర్ ముగిసేటప్పటికీ  కేకేఆర్.. 5 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. 

జోరు పెరుగుతుండగా.

రింకూ సింగ్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ఆండ్రూ రసెల్ (19 బంతుల్లో 35, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తో కలిసి  వెంకటేశ్ అయ్యర్   కేకేఆర్ ను విజయం వైపు నడిపించాడు. ఈ ఇద్దరూ ఆరో వికెట్ కు  30 బంతుల్లోనే 50 పరుగులు జోడించారు.  నాథన్ ఎల్లీస్ వేసిన   14వ ఓవర్లో  రసెల్ ఓ ఫోర్ కొట్టగా అయ్యర్ రెండు భారీ సిక్సర్లు బాదాడు.  

చివరి  6 ఓవర్లలో   74 పరుగులు అవసరముండగా.. సామ్ కరన్ వేసిన  15వ ఓవర్లో  రసెల్ సిక్సర్, ఫోర్ కొట్టాడు.  కానీ ఐదో బంతికి భారీ షాట్ ఆడి   బౌండరీ లైన్ వద్ద ఉన్న  రజకు  క్యాచ్ ఇచ్చాడు.  తర్వాత ఓవర్లో వెంకటేశ్ అయ్యర్ కూడా   అర్ష్‌దీప్ బౌలింగ్ లో  ఔటయ్యాడు.  

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్.. 20 ఓవర్లలో  5 వికెట్ల నష్టానికి  191 పరుగులు చేసింది.  భానుక రాజపక్స  (50), శిఖర్ ధావన్ (40), ప్రభ్‌సిమ్రన్  (23), సామ్ కరన్ (26) రాణించారు.   కేకేఆర్ బౌలర్లలో సౌథీ రెండు వికెట్లు తీయగా  నరైన్, ఉమేశ్, వరుణ్ చక్రవర్తిలు తలా ఓ వికెట్ తీశారు. 

click me!