శివాలెత్తిన స్టోయినిస్.. పూరన్‌కు పూనకం.. లక్నోకు లాస్ట్ బాల్ విక్టరీ.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన ఆర్సీబీ

Published : Apr 10, 2023, 11:37 PM ISTUpdated : Apr 10, 2023, 11:46 PM IST
శివాలెత్తిన స్టోయినిస్.. పూరన్‌కు పూనకం.. లక్నోకు లాస్ట్ బాల్ విక్టరీ.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన ఆర్సీబీ

సారాంశం

IPL 2023: వారెవ్వా.. ఐపీఎల్-16లో నిన్న  ముగిసిన సూపర్ సండే మ్యాచ్ లను మరిచిపోకముందే  మరో ఉత్కంఠ మ్యాచ్ జరిగింది. ఇరు జట్ల మధ్య  విజయం దోబూచులాడుతూ సాగిన పోరులో విజయం  లక్నోను వరించినా  అభిమానులకు మాత్రం అసలైన  టీ20 మజా దక్కింది. రెండు జట్లు కలిపి  ఏకంగా  420 పరుగుల పండుగను అభిమానులకు అందించాయి.

చేయాల్సింది  213 పరుగుల భారీ లక్ష్యం. టార్గెట్ ను ఛేదించే క్రమంలో 23 కే 3 వికెట్లు పోయాయి.   ఈ సమీకరణంతో ఉన్న టీమ్  200  స్కోరును ఛేదించాలంటే అద్భుతమే జరగాలి అనుకున్నారు చిన్నస్వామి  స్టేడియంతో పాటు టీవీల ముందు కూర్చున్న వేలాది మంది క్రికెట్ అభిమానులు.  ఆ అద్భుతాన్ని లక్నో  సూపర్ జెయింట్స్ చేసి చూపెట్టింది.  ఆర్సీబీ బౌలర్లను  ఎడా పెడా బాదుతూ  ఇద్దరు  లక్నో ఆటగాళ్లు సృష్టించిన విధ్వాంసానికి  చిన్నస్వామి హోరెత్తింది. ఆర్సీబీ బౌలర్లపై    నికోలస్ పూరన్ (19 బంతుల్లో 62, 4 ఫోర్లు, 7 సిక్సర్లు) పూనకమొచ్చినట్టు ఊగిపోగా.. స్టోయినిస్ (30 బంతుల్లో 65, 6 ఫోర్లు, 5 సిక్సర్లు) శివాలెత్తాడు.  లక్నో ఛేదించిన టార్గెట్ లో  పూరన్, స్టోయినిస్  లు చేసినవే  127 పరుగులు కావడం విశేషం.  వీళ్లిద్దరి బాదుడుతో 213 పరుగుల లక్ష్యాన్ని  లక్నో ఆఖరి బంతికి విన్నింగ్ రన్ కొట్టి ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. లక్నోను కట్టడి చేసే క్రమంలో 105 కే 5 వికెట్లు తీసిన   బెంగళూరు బౌలర్లు  ఆ తర్వాత లయ తప్పారు. 

భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి క్రీజులోకి వచ్చిన  లక్నోకు  ఇన్నింగ్స్ ప్రారంభంలోనే  బ్యాక్ టు బ్యాక్ షాకులు తాకాయి.   సూపర్ ఫామ్ లో ఉన్న ఆ జట్టు ఓపెన్  కైల్ మేయర్స్  (0)  డకౌట్ అయ్యాడు.  దీపక్ హుడా  (9), కృనాల్ పాండ్యా (0) లు కూడా  విఫలమయ్యారు. 

సిరాజ్ వేసిన తొలి ఓవర్లో  మూడో బంతికే  మేయర్స్  క్లీన్ బౌల్డ్ కాగా  రీస్ టాప్లీ ప్లేస్ లో  ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన పార్నెల్   ఒకే ఓవర్లో  లక్నోకు డబుల్ షాకులిచ్చాడు.   పార్నెల్ వేసిన   4వ ఓవర్లో   హుడా కీపర్ కార్తీక్ కు క్యాచ్ ఇచ్చాడు.   ఇదే ఓవర్లో మరో రెండు బంతుల తర్వాత కృనాల్ కూడా  కార్తీక్ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. 

స్టోయినిస్ షో.. 

23కే 3 కీలక వికెట్లు కోల్పోయిన తరుణంలో కెఎల్ రాహుల్ (20 బంతుల్లో 18, 1 ఫోర్) ఆచిచూచి ఆడాడు.  కానీ మరో ఎండ్ లో స్టోయినిస్ మాత్రం  ఆర్సీబీ బౌలర్లపై రెచ్చిపోయాడు. హర్షల్ పటేల్ వేసిన  8వ ఓవర్లో  6, 4, 4 తో జూలు విదిల్చిన అతడు.. కర్ణ్ శర్మ వేసిన 9వ ఓవర్లో  కూడా  ఓ సిక్సర్ రెండు ఫోర్లతో  రెచ్చిపోయాడు. షాబాజ్ వేసిన  పదో ఓవర్లో  లాంగాఫ్ లో భారీ సిక్సర్ కొట్టి 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్లో మరో సిక్స్ బాదేశాడు.  కర్ణ్ శర్మ వేసిన  11వ ఓవర్లో  రెండో బంతికి సిక్స్ కొట్టిన అతడు..  అదే ఓవర్లో నాలుగో బంతికి   షాబాజ్  అహ్మద్  కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

పూరన్ వచ్చాడు.. పూనకమొచ్చినట్టు కొట్టాడు.. 

స్టోయినిస్ స్థానంలో వచ్చిన  నికోలస్ పూరన్  పూనకం వచ్చినోడిలా ఊగిపోయి ఆడాడు.   తాను ఎదుర్కున్న రెండో బంతికే సిక్సర్ కొట్టాడు. కానీ  12వ ఓవర్ వేసిన సిరాజ్.. తొలి బంతికి కెఎల్ రాహుల్ ను ఔట్ చేశాడు.    అతడి స్థానంలో వచ్చిన   అయూష్ బదోని  (24 బంతుల్లో 30, 4 ఫోర్లు) తో  కలిసి పూరన్ రెచ్చిపోయాడు.  క్రీజులో పూనకం వచ్చినోడిలా ఊగిపోతూ ఆర్సీబీ బౌలర్లను ఆటాడుకున్నాడు.  కర్ణ్ శర్మ వేసిన  13వ ఓవర్లో రెండు సిక్సర్లు.. హర్షల్ పటేల్ వేసిన మరుసటి ఓవర్లో  6, 4, 6.. పార్నెల్ వేసిన  15వ ఓవర్లో   4, 6, 4 తో వీరవిహారం చేశాడు. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. ఈ సీజన్ లో  ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కావడం విశేషం.  డేవిడ్ విల్లీ వేసిన  17వ ఓవర్లో  కూడా  చివరి బంతికి సిక్స్ కొట్టాడు. తద్వారా ఆర్సీబీ స్కోరు 185 దాటింది.  సిరాజ్ వేసిన 17వ ఓవర్లో  చివరి బంతిని హై ఫుల్ టాస్ గా వేయగా.. పూరన్  దానిని స్క్వేర్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడాడు. కానీ షాబాజ్  క్యాచ్ పట్టడంతో   పూరన్ ఇన్నింగ్స్ ముగిసింది.  

 

ఆఖర్లో హైడ్రామా..

పూరన్ ఔటయ్యేటప్పటికీ  లక్నో స్కోరు   189-6. అప్పటికే లక్నో విజయం దాదాపు ఖాయమైంది.  చివరి 18 బంతుల్లో  21 పరుగులు చేయాలి. హర్షల్ పటేల్  వేసిన 18వ ఓవర్లో ఉనద్కత్ ఓ ఫోర్ కొట్టాడు. మొత్తంగా 9 పరుగులొచ్చాయి. పార్నెల్ వేసిన   19వ ఓవర్లో ఓ ఫోర్ బాదిన బదోని.. ఐదో బంతిని సిక్సర్ కు తరలించే క్రమంలో  బ్యాట్ తో వికెట్లను పడగొట్టేసి హిట్ వికెట్ గా వెనుదిరిగాడు  చివరి ఓవర్లో   ఐదు పరుగులు అవసరం కాగా.. హర్షల్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్లో రెండో బాల్ కు మార్క్ వుడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  మూడో బంతికి బిష్ణోయ్ రెండు పరుగులు తీశాడు.  నాలుగో బంతికి ఒక్క పరుగు వచ్చింది. ఐదో బంతికి ద ఉనద్కత్ ఔట్. ఆరో బంతికి  హర్షల్ పటేల్ వేసిన బంతిని కొట్టడంలో మిస్ అయినా   అవేశ్ ఖాన్ - బిష్ణోయ్ లు క్విక్ సింగిల్ తో లక్నోకు మరుపురాని విజయాన్ని అందించారు. 

కేజీఎఫ్ షో.. 

అంతకుముందు ఈ మ్యాచ్ లో  ఫస్ట్ బ్యాటింగ్ చేసిన  ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 212 పరుగుల భారీ స్కోరు చేసింది. చిన్నస్వామి స్టేడియంలో  విరాట్ కోహ్లీ  (44 బంతుల్లో  61, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అంటించిన  అగ్నికి కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (46 బంతుల్లో 79 నాటౌట్, 5 ఫోర్లు, 5 సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (29 బంతుల్లో59, 3 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆయువులా కలిశారు.    కోహ్లీ (కే), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (జీ) ఫాఫ్ డుప్లెసిస్ (ఎఫ్) ల ధాటికి లక్నో బౌలర్లు బెంబేలెత్తారు. 

PREV
click me!

Recommended Stories

KKR : రూ. 25 కోట్లు పెట్టినా తగ్గేదేలే.. కోల్‌కతా నైట్ రైడర్స్ పక్కా మాస్టర్ ప్లాన్.. !
IPL : ఆర్సీబీ అభిమానులకు పండగే ! 40 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ టీమ్ ప్లేయర్ !