IPL 2023: చెన్నైలో బోణీ కొట్టిన సూపర్ కింగ్స్.. ఆఖరి ఓవర్ వరకూ పోరాడి ఓడిన లక్నో జెయింట్స్‌...

By Chinthakindhi RamuFirst Published Apr 3, 2023, 11:36 PM IST
Highlights

IPL 2023: 218 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 205 పరుగులు చేసిన లక్నో సూపర్ జెయింట్స్... 12 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఐపీఎల్ 2023 సీజన్‌లో తొలి విజయం..

ఐపీఎల్ 2023 సీజన్‌‌లో హోం గ్రౌండ్ సెంటిమెంట్ కొనసాగుతోంది. ఒక్క హైదరాబాద్ మినహా మిగిలిన టీమ్స్‌ అన్నీ హోం గ్రౌండ్‌లో ఘన విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో చెన్నై సూపర్ కింగ్స్ కూడా చేరిపోయింది. 218 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన లక్నోకి మంచి ఆరంభం దక్కినా, సరిగ్గా వాడుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసిన లక్నో సూపర్ జెయింట్స్, సీఎస్‌కే చేతుల్లో 12 పరుగుల తేడాతో పోరాడి ఓడింది. 

భారీ లక్ష్యఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్‌కి శుభారంభం దక్కింది. గత మ్యాచ్‌లో అదరగొట్టిన కైల్ మేయర్స్, అదే ఫామ్‌ని కొనసాగించాడు. 22 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేసిన కైల్ మేయర్స్, మొయిన్ ఆలీ బౌలింగ్‌లో డివాన్ కాన్వేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 79 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది లక్నో...

Latest Videos

దీపక్ హుడా 6 బంతుల్లో 2 పరుగులు చేయగా 18 బంతుల్లో 2 ఫోర్లతో 20 పరుగులు చేసిన కెఎల్ రాహుల్ మరోసారి నిరాశపరిచాడు. కృనాల్ పాండ్యా 9 బంతుల్లో ఓ సిక్స్‌తో 9 పరుగులు చేసి అవుట్ కాగా 18 బంతుల్లో ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసిన మార్కస్ స్టోయినిస్‌ని మొయిన్ ఆలీ క్లీన్ బౌల్డ్ చేశాడు..

18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 32 పరుగులు చేసిన నికోలస్ పూరన్, తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో బౌండరీ లైన్ దగ్గర బెన్ స్టోక్స్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

 24 బంతుల్లో 62 పరుగులు కావాల్సిన దశలో 17వ ఓవర్‌లో 18 పరుగులు రాబట్టాడు కృష్ణప్ప గౌతమ్. దీంతో చివరి 18 బంతుల్లో లక్నో విజయానికి 44 పరుగులు కావాల్సి వచ్చాయి. అయితే ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన తుషార్ దేశ్‌పాండే 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో లక్నో విజయానికి ఆఖరి 2 ఓవర్లలలో 37 పరుగులు కావాల్సి వచ్చాయి..

19వ ఓవర్ వేసిన యంగ్ బౌలర్ రాజవర్థన్ హంగర్‌గేకర్, 3 వైడ్లు వేసినా కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో చివరి ఓవర్‌లో సీఎస్‌కే విజయానికి 28 పరుగులు అవసరమయ్యాయి. ఆఖరి ఓవర్ వేసిన తుషార్ దేశ్ పాండే, ఓ వైడ్, ఓ నో బాల్ వేశాడు. ఫ్రీ హిట్‌కి ఆయుష్ బదోనీ 2 పరుగులు మాత్రమే రాబట్టగలిగాడు..

రెండో బంతికి పరుగులేమీ రాలేదు. మూడో బంతికి భారీ షాట్‌కి ప్రయత్నించిన ఆయుష్ బదోనీ, ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 18 బంతుల్లో 23 పరుగులు చేసిన బదోనీ, ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు.

ఆఖరి 3 బంతుల్లో 23 పరుగులు కావాల్సి రావడంతో చెన్నై విజయం ఖరారైపోయింది. చివరి రెండు బంతుల్లో మార్క్ వుడ్ ఓ ఫోర్, సిక్సర్ బాదాడంతో లక్నో స్కోరు 200 మార్కు దాటింది.


అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 217 పరుగుల భారీ స్కోరు చేసింది...  పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. చెన్నైలో సీఎస్‌కేకి పవర్ ప్లేలో ఇదే అత్యధిక స్కోరు. డివాన్ కాన్వేతో కలిసి 9 ఓవర్లలో 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రుతురాజ్ గైక్వాడ్, రవి భిష్ణోయ్ వేసిన మొదటి ఓవర్ తొలి బంతికి అవుట్ అయ్యాడు.

31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసిన డివాన్ కాన్వే, ఆ తర్వాతి ఓవర్‌లోనే మార్క్ వుడ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

16 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 27 పరుగులు చేసిన శివమ్ దూబే, రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో మార్క్‌ వుడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో వరుసగా 3 ఫోర్లు బాదిన మొయిన్ ఆలీ 19 పరుగులు చేసి, భిష్ణోయ్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 8 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన బెన్ స్టోక్స్, ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో యష్ ఠాకూర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

6 బంతుల్లో 3 పరుగులే చేసిన రవీంద్ర జడేజా, మార్క్ వుడ్ వేసిన ఆఖరి ఓవర్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు.. వస్తూనే వరుసగా రెండు సిక్సర్లు బాదిన మహేంద్ర సింగ్ ధోనీ, ఆ తర్వాతి బంతికి రవి భిష్ణోయ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంబటి రాయుడు 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.  
 

click me!