చెన్నైలో చితక్కొట్టిన సీఎస్‌కే... రుతురాజ్ మరో హాఫ్ సెంచరీ! లక్నో ముందు భారీ టార్గెట్...

By Chinthakindhi RamuFirst Published Apr 3, 2023, 9:24 PM IST
Highlights

ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ బాదిన రుతురాజ్ గైక్వాడ్.. డివాన్ కాన్వే, శివమ్ దూబే మెరుపులు... మూడేసి వికెట్లు తీసిన రవి భిష్ణోయ్, మార్క్ వుడ్.. 

ఐపీఎల్ 2023 సీజన్‌ మొదటి మ్యాచ్‌లో చేతులు ఎత్తేసిన సీఎస్‌కే బ్యాటర్లు, చెన్నైలో చెలరేగిపోయారు. యంగ్ సెన్సేషన్ రుతురాజ్ గైక్వాడ్ మరో హాఫ్ సెంచరీతో చెలరేగగా డివాన్ కాన్వే, శివమ్ దూబే, మొయిన్ ఆలీ తమ స్టైల్‌లో మెరుపులు మెరిపించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 217 పరుగుల భారీ స్కోరు చేసింది...

కైల్ మేయర్స్ వేసిన తొలి ఓవర్‌లో 6 పరుగులే వచ్చాయి. అయితే ఆవేశ్ ఖాన్ వేసిన రెండో ఓవర్‌లో 17 పరుగులు రాబట్టింది సీఎస్‌కే. కృష్ణప్ప గౌతమ్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో 3 సిక్సర్లతో 20 పరుగులు రాబట్టాడు రుతురాజ్ గైక్వాడ్. మొదటి మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి ఢిల్లీ బ్యాటర్లకి చుక్కలు చూపించిన మార్క్ వుడ్ బౌలింగ్‌లో 4, 4, 6 బాది 19 పరుగులు రాబట్టాడు రుతురాజ్ గైక్వాడ్..

Latest Videos

పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. చెన్నైలో సీఎస్‌కేకి పవర్ ప్లేలో ఇదే అత్యధిక స్కోరు. డివాన్ కాన్వేతో కలిసి 9 ఓవర్లలో 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రుతురాజ్ గైక్వాడ్, రవి భిష్ణోయ్ వేసిన మొదటి ఓవర్ తొలి బంతికి అవుట్ అయ్యాడు.

31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసిన డివాన్ కాన్వే, ఆ తర్వాతి ఓవర్‌లోనే మార్క్ వుడ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

16 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 27 పరుగులు చేసిన శివమ్ దూబే, రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో మార్క్‌ వుడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో వరుసగా 3 ఫోర్లు బాదిన మొయిన్ ఆలీ 19 పరుగులు చేసి, భిష్ణోయ్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 8 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన బెన్ స్టోక్స్, ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో యష్ ఠాకూర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

మార్క్ వుడ్ వేసిన మూడో ఓవర్‌లో 2 సిక్సర్లు బాదిన అంబటి రాయుడు, ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో 16 పరుగులు రాబట్టాడు. ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో ఆవేశ్ ఖాన్ ప్లేస్‌లో ఆయుష్ బదోనీని ఇంపాక్ట్ ప్లేయర్‌గా టీమ్‌లోకి తీసుకొచ్చింది లక్నో సూపర్జెయింట్స్. 6 బంతుల్లో 3 పరుగులే చేసిన రవీంద్ర జడేజా, మార్క్ వుడ్ వేసిన ఆఖరి ఓవర్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు.. 

వస్తూనే వరుసగా రెండు సిక్సర్లు బాదిన మహేంద్ర సింగ్ ధోనీ, ఆ తర్వాతి బంతికి రవి భిష్ణోయ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంబటి రాయుడు 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు చేశాడు.  రవి భిష్ణోయ్ 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా మార్క్ వుడ్ 3 వికెట్లు తీశాడు. 

click me!