ఆఖరి ఓవర్‌లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్... హ్యాట్రిక్ కొట్టిన ముంబై ఇండియన్స్.. 

Published : Apr 18, 2023, 11:25 PM IST
ఆఖరి ఓవర్‌లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్... హ్యాట్రిక్ కొట్టిన ముంబై ఇండియన్స్.. 

సారాంశం

IPL 2023: ఆఖరి వికెట్ తీసిన అర్జున్ టెండూల్కర్.. 19.5  ఓవర్లలో 178 పరుగులకు ఆలౌట్ అయిన ఆరెంజ్ ఆర్మీ... 14 పరుగుల తేడాతో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. 

ఐపీఎల్ 2023 సీజన్‌లో మరో మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగి, ఫ్యాన్స్‌కి టీ20 క్రికెట్ మజాని అందించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ విజయానికి ఆఖరి ఓవర్‌లో 20 పరుగులు కావాల్సిన దశలో అర్జున్ టెండూల్కర్‌కి బాల్ అందించిన రోహిత్ శర్మ పెద్ద సాహసమే చేశాడు. అయితే కట్టుదిట్టమైన బౌలింగ్‌లో ఆఖరి ఓవర్‌లో 4 పరుగులే ఇచ్చిన అర్జున్, ఓ వికెట్ కూడా తీసి ముంబైకి విజయాన్ని అందించాడు. 


గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన హారీ బ్రూక్, 7 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసిన బెహ్రాన్‌డార్ఫ్ బౌలింగ్‌లో సూర్యకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 11 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. వన్‌డౌన్‌లో వచ్చిన రాహుల్ త్రిపాఠి 5 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసి బెహ్రాన్‌డార్ఫ్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు.

25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్, మయాంక్ అగర్వాల్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. 17 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసిన కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్, కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో హృతిక్ షోకీన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

అభిషేక్ వర్మ 2 బంతుల్లో 1 పరుగు చేసి పియూష్ చావ్లా బౌలింగ్‌లో టిమ్ డేవిక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

13 ఓవర్లు ముగిసే సమయానికి 106 పరుగులే చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. చివరి 7 ఓవర్లలో 86 పరుగులు కావాల్సి రావడంతో మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ ఖాయమనుకున్నారంతా. అయితే పియూష్ చావ్లా వేసిన ఆఖరి ఓవర్‌లో 4, 6, 6, 4 బాదిన హెన్రీచ్ క్లాసిన్ మ్యాచ్‌లో ఊపు తీసుకొచ్చాడు..

అయితే 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 పరుగులు చేసిన క్లాసిన్, అదే ఓవర్‌లో ఆఖరి బంతికి టిమ్ డేవిడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 55 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 

మొదటి 13 బంతుల్లో 14 పరుగులే చేసిన మయాంక్ అగర్వాల్, 41 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 48 పరుగులు చేసి రిలే మెడరిత్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

6 బంతుల్లో 3 ఫోర్లతో 13 పరుగులు చేసిన మార్కో జాన్సెన్ కూడా మెడరిత్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. జాన్సెన్ అవుట్ అయ్యే సమయానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 20 బంతుల్లో 44 పరుగులు కావాలి..

6 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్, 18వ ఓవర్‌ ఐదో బంతికి రనౌట్ అయ్యాడు. దీంతో ఆరెంజ్ ఆర్మీ విజయానికి ఆఖరి 2 ఓవర్లలో 24 పరుగులు కావాల్సి వచ్చాయి. 19వ ఓవర్ వేసిన కామెరూన్ గ్రీన్ 4 పరుగులే ఇచ్చాడు..

అర్జున్ టెండూల్కర్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో తొలి బంతికి పరుగులేమీ రాలేదు. రెండో బంతికి అనవసర పరుగు కోసం ప్రయత్నించి అబ్దుల్ సమద్ అవుట్ అయ్యాడు. భువీని అవుట్ చేసిన అర్జున్ టెండూల్కర్, ఐపీఎల్‌లో మొట్టమొదటి వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. 


అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192  పరుగుల భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై ఇండియన్స్‌కి మంచి ఆరంభం దక్కింది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ కలిసి 4.4 ఓవర్లలో 41 పరుగులు జోడించారు. 18 బంతుల్లో 6 ఫోర్లతో 28 పరుగులు చేసిన రోహిత్ శర్మ, నటరాజన్ బౌలింగ్‌లో అయిడిన్ మార్క్‌రమ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో వరుసగా హ్యాట్రిక్ ఫోర్లు బాదిన రోహిత్ శర్మ, ఐపీఎల్‌లో 6 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇషాన్ కిషన్ 31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసి మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో అయిడిన్ మార్క్‌రమ్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌కి అవుట్ అయ్యాడు. 

గత మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపించిన సూర్యకుమార్ యాదవ్ 3 బంతుల్లో ఓ సిక్సర్‌తో 7 పరుగులు చేసి మార్కో జాన్సెన్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు..17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 37 పరుగులు చేసిన తిలక్ వర్మ, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మొదటి 20 బంతుల్లో 21 పరుగులే చేసిన కామెరూన్ గ్రీన్, మెల్లిమెల్లిగా గేర్ మార్చాడు..

నటరాజన్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో వరుసగా 4, 4, 4, 6 బాది 33 బంతుల్లో మొట్టమొదటి ఐపీఎల్ హాఫ్ సెంచరీ అందుకున్నాడు కామెరూన్ గ్రీన్. 40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 64 పరుగులు చేసిన కామెరూన్ గ్రీన్ నాటౌట్‌గా నిలవగా 11 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసిన టిమ్ డేవిడ్ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రనౌట్ అయ్యాడు. 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !