IPL 2023: ముంబైపై పంజా విసిరిన కింగ్స్.. రోహిత్ బౌలర్లను ఉతికారేసిన పంజాబ్

Published : Apr 22, 2023, 09:23 PM IST
IPL 2023: ముంబైపై పంజా విసిరిన కింగ్స్..  రోహిత్ బౌలర్లను ఉతికారేసిన పంజాబ్

సారాంశం

IPL 2023, MI vs PBKS: వాంఖెడేలో పంజాబ్ కింగ్స్ గర్జించింది.  ముంబై బౌలర్లను కట్టడి చేస్తూ వీరబాదుడు బాదింది. కెప్టెన్ సామ్ కరన్ కు తోడుగా   హర్‌ప్రీత్, జితేశ్ శర్మల మెరుపులతో  ముంబై ముందు భారీ స్కోరును నిలిపింది. 

ఆరంభం అదరకున్నా  మిడిలార్డార్  బ్యాటర్లు రాణించడంతో  పంజాబ్ కింగ్స్  మెరిసింది. వాంఖెడే వేదికగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో  8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.  పంజాబ్ సారథి  సామ్ కరన్ (29 బంతుల్లో 55, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) కు తోడుగా హర్‌ప్రీత్ సింగ్ భాటియా (28 బంతుల్లో  41, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), వికెట్ కీపర్ జితేశ్ శర్మ  (7 బంతుల్లో 25, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో   ఆ జట్టు భారీ స్కోరు చేసింది.   ఆరంభ ఓవర్లలో  మెరుగ్గానే బౌలింగ్ వేసిన   ముంబై బౌలర్లు తర్వాత లయతప్పి భారీ పరుగులు సమర్పించుకున్నారు. 

టాస్ ఓడి  బ్యాటింగ్ కు వచ్చిన పంజాబ్  ఈసారి ఓపెనింగ్ జోడీని మార్చినా  శుభారంభం దక్కలేదు.   ప్రభ్‌సిమ్రన్ సింగ్  (17 బంతులలో  26, 1 ఫోర్, 2 సిక్సర్లు)   కు తోడుగా మాథ్యూ షార్ట్ (10 బంతుల్లో 11, 2 ఫోర్లు)   తొలి వికెట్ కు  18 పరుగులే జోడించారు.   కామెరూన్ గ్రీన్ వేసిన  మూడో ఓవర్లో  షార్ట్.. చావ్లా చేతికి చిక్కాడు. 

ప్రభ్‌సిమ్రన్ తో కలిసి  అథర్వ   రెండో వికెట్ కు  37  పరుగులు జోడించారు.   17 బంతుల్లో   3 బౌండరీల సాయంతో  29 పరుగులు చేసిన అథర్వ  క్రీజులో కుదురుకుంటున్నట్టే కనిపించాడు. వీరిద్దరి దూకుడుతో  పవర్ ప్లే లో ఒక వికెట్ నష్టానికి 58 పరుగులు చేసిన  పంజాబ్.. తర్వాత గాడి తప్పింది.  అర్జున్ టెండూల్కర్ వేసిన  ఏడో ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ ‌ను  ఎల్బీగా వెనక్కి పంపాడు. నాలుగో స్థానంలో వచ్చిన  లియామ్ లివింగ్‌స్టొన్  (10)  ఓ భారీ సిక్సర్ బాదినా  చావ్లా వేసిన పదో ఓవర్లో  ఫస్ట్ బాల్ కు  వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ స్టంపౌట్  చేశాడు.   అదే ఓవర్లో   అథర్వ కూడా.. నాలుగో బాల్  కు  క్లీన్ బౌల్డ్ అయ్యాడు.   

ఆదుకున్న హర్‌ప్రీత్  - కరన్  

83కే నాలుగు వికెట్లు కోల్పోయిన పంజాబ్ ను హర్‌ప్రీత్ సింగ్  భాటియా ,  కెప్టెన్ సామ్ కరన్ లు ఆదుకున్నారు. ఇద్దరూ ముంబై బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కున్నారు. క్రీజులో కుదురుకునేదాకా నెమ్మదిగా ఆడిన భాటియా.. తర్వాత రెచ్చిపోయాడు. అర్జున్ వేసిన   16వ ఓవర్లో సామ్ కరన్   ఓ సిక్స్, ఫోర్ కొట్టి అతడికి బ్యాటింగ్  ఇచ్చాడు. ఆ తర్వాత మూడు బంతుల్లో  హర్‌ప్రీత్.. 4, 6, 4, 4  బాదాడు.  ఈ ఓవర్లో మొత్తం 31 పరుగులొచ్చాయి. దీంతో పంజాబ్ స్కోరు  150 కి చేరింది.  

గ్రీన్ వేసిన  18వ ఓవర్లో కరన్  రెండు సిక్సర్లు బాదాడు.  కానీ నాలుగో బాల్ కు భాటియా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే అతడి స్థానంలో వచ్చిన జితేశ్ శర్మ  కూడా వస్తూనే రెండు సిక్సర్లు కొట్టాడు.   ఈ ఓవర్లో కూడా 25 పరుగులొచ్చాయి.   జోఫ్రా ఆర్చర్ వేసిన  19వ ఓవర్లో   మూడో బాల్ కు ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కరన్.. అదే ఓవర్లో చివరి బంతికి అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆఖరి ఓవర్లో  జితేశ్ మరో రెండు సిక్సర్లు బాది  పంజాబ్ కు భారీ ఆధిక్యాన్ని అందించాడు. 

PREV
click me!

Recommended Stories

స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?