
ఈడెన్ గార్డెన్ వేదికగా రాజస్తాన్ రాయల్స్ తో జరుగుతున్న 56వ లీగ్ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ లో తడబడింది. రాజస్తాన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ మాయకు తోడు ప్రారంభ ఓవర్లలో ట్రెంట్ బౌల్ట్ వేగానికి కేకేఆర్ కుదేలైంది. వెంకటేశ్ అయ్యర్ (42 బంతుల్లో 57, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్థ సెంచరీతో అడ్డుకోకుంటే ఆ జట్టు పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. అయ్యర్ అర్థ సెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో కేకేఆర్.. 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేసింది. మరి ఈ స్వల్ప స్కోరును కేకేఆర్ బౌలర్లు ఏ మేరకు కాపాడుకుంటారో..!
టాస్ ఓడి ఫస్ట్ బ్యాటిగ్ కు వచ్చిన కోల్కతాకు ఆశించిన ఆరంభమేమీ దక్కలేదు. ఓపెనర్లుగా వచ్చిన జేసన్ రాయ్ (10) మరోసారి విఫలమవగా 12 బంతుల్లోనే ఓ సిక్సర్ రెండు బౌండరీలతో 18 పరుగులు చేసిన రహ్మనుల్లా గుర్బాజ్ కూడా ఎక్కువ సేపు నిలువలేదు. ఈ ఇద్దరినీ బౌల్ట్ ఔట్ చేశాడు.
చహల్ మాయ..
29కే రెండు వికెట్లు కోల్పోయిన కేకేఆర్‌ను వన్ డౌన్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్, కెప్టెన్ నితీశ్ రాణా (17 బంతుల్లో 22) ఆదుకున్నారు. ఈ ఇద్దరూ మూడో వికెట్ కు 48 పరుగులు జోడించారు. అశ్విన్ వేసిన 10వ ఓవర్లో వెంకటేశ్ అయ్యర్ రెండు భారీ సిక్సర్లు బాదగా అదే ఓవర్లో నితీశ్ రాణా కూడా ఓ ఫోర్ కొట్టి ఢిల్లీ స్కోరు వేగాన్ని పెంచారు. కానీ 11వ ఓవర్ వేసిన చహల్.. నితీశ్ రాణాను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఐపీఎల్ లో చహల్ కు ఇది 184 వ వికెట్. దీంతో అతడు ఈ లీగ్ లో బ్రావో రికార్డు (183 వికెట్లు) ను బ్రేక్ చేశాడు.
నితీశ్ నిష్క్రమించినా అయ్యర్ ధాటిగానే ఆడాడు. చహలే వేసిన 13వ ఓవర్లో 6, 4, 4 తో15 పరుగులు పిండుకున్నాడు. తద్వారా కేకేఆర్ స్కోరు వంద పరుగులు దాటింది. కానీ కెఎం అసిఫ్ వేసిన 14వ ఓవర్లో రసెల్ (10) రెండో బాల్ సిక్స్ కొట్టినా మూడో బాల్ కు అశ్విన్ కు క్యాచ్ ఇచ్చాడు. అసిఫ్ వేసిన 16వ ఓవర్లో ఫస్ట్ బాల్ సింగిల్ తీసి హాఫ్ సెంచరీ చేసుకున్న అయ్యర్.. చహల్ వేసిన 17వ ఓవర్లో మొదటి బంతికి బౌల్ట్ కు క్యాచ్ ఇచ్చాడు. ఇదే ఓవర్లో నాలుగో బాల్ కు శార్దూల్ ఠాకూర్ (1) కూడా ఎల్బీగా నిష్క్రమించాడు. చహల్ 19వ ఓవర్లో నాలుగో బంతికి రింకూ సింగ్ ను కూడా ఔట్ చేసి కేకేఆర్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు.
రాజస్తాన్ బౌలర్లలో చహల్ కు నాలుగు వికెట్లు దక్కగా బౌల్ట్ రెండు వికెట్లు పడగొట్టాడు. సందీప్ శర్మకు ఒక వికెట్ దక్కింది.