
కోల్కతా నైట్ రైడర్స్ యువ ఆటగాడు, ఈ సీజన్ లో ఆ జట్టుకు ఊహించని ఫినిషింగ్ లతో కేకేఆర్ విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు రింకూ సింగ్. సీజన్ ఆరంభంలో గుజరాత్ టైటాన్స్ తో అహ్మదాబాద్ వేదికగా ముగిసిన మ్యాచ్ లో ఆఖరి ఓవర్లో కేకేఆర్ విజయానికి 29 పరుగులు అవసరమవగా.. యశ్ దయాల్ బౌలింగ్ లో ఆఖరి ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి కేకేఆర్‌కు విజయాన్ని అందించాడు. ఈ ప్రదర్శనతో రింకూ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ను మెప్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రింకూ ఆటకు మరో సూపర్ స్టార్ కూడా ఫ్యాన్ అయ్యాడు.
సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ రింకూ సింగ్ ఆటకు ముగ్డుడైపోయాడు. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత రజినీకాంత్.. రింకూకు ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించాడట. చెన్నై వస్తే తమ ఇంటికి రావాలని కూడా చెప్పాడట. ఈ విషయాన్ని స్వయంగా రింకూనే వెల్లడించాడు.
కేకేఆర్ ఇటీవలే పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత రింకూ జియో సినిమాతో మాట్లాడుతూ.. ‘గుజరాత్ తో మ్యాచ్ లో ఐదు సిక్సర్లు కొట్టిన తర్వాత నాకు చాలా మంది నుంచి మెసేజ్‌లు వచ్చాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ సార్ నుంచి కూడా నాకు ఫోన్ వచ్చింది. ఆయన నన్ను ప్రత్యేకగా అభినందించారు. చెన్నై వస్తే తమ ఇంటికి రావాలని ఆహ్వానించారు..’అని తెలిపాడు.
గుజరాత్ తో పాటు కేకేఆర్.. ఇటీవల పంజాబ్ తో మ్యాచ్ గెలిచేందుకు కూడా రింకూ కీలక పాత్ర పోషించాడు. పంజాబ్ తో మ్యాచ్ లో చివర్లో ఆండ్రీ రసెల్ కేకేఆర్ ను విజయ తీరాలకు చేర్చినా చివరి బంతికి ఫోర్ కొట్టి ఆ జట్టుకు విజయాన్ని అందించింది మాత్రం రింకూనే.
కాగా ఈ సీజన్ లో చెన్నైతో ఈడెన్ గార్డెన్ వేదికగా మ్యాచ్ ఆడిన కోల్కతా.. మే 14న చెపాక్ వేదికగా సీఎస్కేతో తలపడనుంది. నేటి సాయంత్రమో లేక రేపో నితీశ్ రాణా సేన చెన్నైలో అడుగుపెట్టనుంది. మరి చెన్నైకి వెళ్తే రాణా.. జైలర్ హీరో ఇంటికి వెళ్తాడో..? లేదో..? చూడాలి.
ఈ సీజన్ లో 12 మ్యాచ్ లు ఆడిన కోల్కతా.. ఐదు మ్యాచ్ లలో గెలిచి ఏడింటిలో ఓడి పది పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ప్రస్తుత పాయింట్ల పట్టికను చూస్తే ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరడం కష్టమే..