
ఐపీఎల్-16 లో మరో సెంచరీ నమోదైంది. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (58 బంతుల్లో 101, 13 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో కదం తొక్కిన వేళ.. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ భారీ స్కోరు సాధించింది. గిల్ తో పాటు సాయి సుదర్శన్ (36 బంతుల్లో 47, 6 బౌండరీలు, 1 సిక్స్) కూడా రాణించాడంతో గుజరాత్ టైటాన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఈ ఇద్దరూ మినహ మిగిలిన గుజరాత్ బ్యాటర్లు విఫలం కావడంతో ఆ జట్టు 200 బిలో స్కోరుతోనే సరిపెట్టుకుంది. మరి సన్ రైజర్స్ బ్యాటర్లు ఈ లక్ష్యాన్ని ఏ మేరకు అందుకుంటారో చూడాలి.
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన గుజరాత్.. ఫస్ట్ ఓవర్ లోనే వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా వికెట్ కోల్పోయినా సాయి సుదర్శన్ తో కలిసి గిల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇద్దరూ సన్ రైజర్స్ బౌలర్లను ఆటాడుకున్నారు. ఫజల్లా ఫరూఖీ వేసిన నాలుగో ఓవర్లో వరుసగా 4 ఫోర్లు కొట్టిన గిల్ గుజరాత్ స్కోరును నాలుగు ఓవర్లకే 50 దాటించాడు.
మార్క్‌రమ్ వేసిన ఏడో ఓవర్లో రెండు బౌండరీలు బాదిన అతడు 22 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత కూడా గిల్ తన జోరు కొనసాగించాడు. సాయి సుదర్శన్ కూడా మెరుపులు మెరిపించడంతో గుజరాత్ స్కోరు 10 ఓవర్లకే వంద పరుగులు దాటింది.
అభిషేక్ శర్మ వేసిన 12వ ఓవర్లో 6, 4 కొట్టి 80లలోకి చేరిన గిల్ క్రమంగా సెంచరీకి చేరువయ్యాడు. ఈ క్రమంలో అతడు కాస్త నెమ్మదించాడు. అదే సమయంలో మార్కో జాన్సెన్ వేసిన 15వ ఓవర్లో సాయి సుదర్శన్ భారీ షాట్ ఆడబోయి నటరాజన్ చేతికి చిక్కాడు. దీంతో రెండో వికెట్ కు 147 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన హార్ధిక్ పాండ్యా (8), డేవిడ్ మిల్లర్ (7), రాహుల్ తెవాటియా (3) లు కూడా వెంటవెంటనే వెనుదిరిగారు.
90లలోకి వచ్చాక నెమ్మదించిన గిల్.. నటరాజన్ వేసిన 19వ ఓవర్లో రెండో బాల్ కు సింగిల్ తీసి ఐపీఎల్ లో తన తొల సెంచరీని నమోదు చేసుకున్నాడు. సెంచరీ తర్వాత గిల్ నిష్క్రమిచడంతో గుజరాత్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. భువనేశ్వర్ ఆఖరి ఓవర్లో.. గిల్, రషీద్ ఖాన్ (0) లను ఔట్ చేశాడు. మూడో బాల్ కు నూర్ అహ్మద్ రనౌట్ అయ్యాడు. నాలుగో బాల్ కు శనక (9) ఒక్క పరుగు తీశాడు. ఐదో బాల్ కు షమీ ఔట్ అయ్యాడు. దీంతో ఒక దశలో 220 స్కోరు చేస్తుందనుకున్న గుజరాత్.. 188 -9 పరుగులకే పరిమితమైంది. భువనేశ్వర్ నాలుగు ఓవర్లు వేసి 30 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు.