IPL 2023: చెన్నైకి షాకిచ్చిన కోల్కతా.. చెపాక్‌‌లో రింకూ-రాణాల సూపర్ షో

By Srinivas MFirst Published May 14, 2023, 11:12 PM IST
Highlights

IPL 2023, CSK vs KKR:  చెన్నై టాప్ - 1   ఆశలను కోల్కతా  అడియాసలు  చేసింది. ఈడెన్ గార్డెన్ లో తమను ఓడించినందుకు గాను బదులు తీర్చుకుని చెన్నైకి షాకిచ్చింది. 

ఐపీఎల్ - 16 పాయింట్ల పట్టికలో  నెంబర్ వన్ పొజిషనే లక్ష్యంగా  స్వంత గ్రౌండ్ లో కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో  చెన్నై సూపర్ కింగ్స్ కు నిరాశ తప్పలేదు.  బ్యాటింగ్ లో విఫలమైన  చెన్నై బౌలింగ్ లో కూడా ఆకట్టుకోలేకపోయింది. స్పిన్ కు అనుకూలించిన పిచ్ పై  మొదట ఫీల్డింగ్ చేసి సీఎస్కేను  144 పరుగులకే కట్టడి చేసిన  కోల్కతా ఆ తర్వాత  లక్ష్యాన్ని 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి   ఛేదించింది. కేకేఆర్ సారథి నితీశ్ రాణా  (44 బంతుల్లో 57 నాటౌట్, 6 ఫోర్లు, 3 సిక్సర్లు),  రింకూ సింగ్ (43 బంతుల్లో 54,  4 ఫోర్లు, 3 సిక్సర్లు) లు అర్థ సెంచరీలతో రాణించి  కోల్కతాకు విజయాన్ని అందించారు.  ఈ  ఓటమితో చెన్నై స్థానమేమీ మారకపోయినా  కేకేఆర్ మాత్రం  8 నుంచి 7వ స్థానానికి ఎగబాకింది. ఆ  జట్టుకు ప్లేఆఫ్స్ ఆశలు ఇంకా మిగిలే  ఉన్నాయి. 

ఛేదించాల్సిన లక్ష్యం  చిన్నదే  అయినా   రెండో ఇన్నింగ్స్ లో మరింత టర్న్ అయే చెపాక్ పిచ్ పై కోల్కతాకు  ఛేజింగ్ అంత ఈజీ కాదని ఆ జట్టు అభిమానులు భావించారు. అందుకు తగ్గట్టుగానే   పవర్ ప్లేలోనే   కేకేఆర్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది.

Latest Videos

దీపక్ చాహర్ వేసిన మొదటి ఓవర్లో ఆఖరి బంతికి రహ్మనుల్లా గుర్బాజ్ (1)   బౌండరీ లైన్ వద్ద  తుషార్ అద్భుత క్యాచ్ అందుకోవడంతో  ఔట్ అయ్యాడు.  ఇంపాక్ట్ ప్లేయర్ గా  వచ్చిన  వెంకటేశ్ అయ్యర్.. 4 బంతుల్లో రెండు బౌండరీలతో  9 పరుగులు చేసి  చాహర్ వేసిన మూడో ఓవర్లో  ఐదో బంతికి  జడేజాకు క్యాచ్ ఇచ్చాడు.   చాహర్ తన మరుసటి ఓవర్లో జేసన్ రాయ్ (12) ను కూడా ఔట్ చేసి కేకేఆర్‌కు షాకిచ్చాడు. 

ఛాన్స్ ఇవ్వని రాణా - రింకూ.. 

33కే 3 కీలక వికెట్లు కోల్పోయిన దశలో మరో వికెట్ పడితే ఫలితం మరో విధంగా ఉండేదే. కానీ  కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా, రింకూ సింగ్  లు చెన్నైకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు.   ఇద్దరూ చెన్నై బౌలర్లను  సమర్థవంతంగా ఎదుర్కున్నారు.  మోయిన్ అలీ,  రవీంద్ర జడేజా,  తీక్షణ ల స్పిన్ త్రయానికి బెదరలేదు. కేకేఆర్ స్పిన్నర్లు రాణించిన చోట  చెన్నై స్పిన్నర్లు  అంతగా ఆకట్టుకోకపోవడం గమనార్హం. 

రాణా - రింకూలు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూనే వికెట్ల మధ్య పరిగెడుతూ  స్కోరు బోర్డును ముందుకు తీసుకుపోయారు.  ధోని బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా ఈ ఇద్దరూ క్రీజులో కుదురుకున్నాక  ఎవరినీ వదల్లేదు.  పతిరన వేసిన   16వ ఓవర్లో ఆఖరి బంతికి   ఫోర్ కొట్టిన రింకూ.. 35 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తీక్షణ  వేసిన 17వ ఓవర్లో  ఐదో బాల్ కు  సింగిల్ తీసిన రాణా  తన అర్థ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. పతిరన వేసిన 18వ ఓవర్లో ఫస్ట్ బాల్ కు రింకూ రనౌట్ అయినా  రసెల్ (2 నాటౌట్) తో  కలిసి రాణా మిగతా పని పూర్తి చేశాడు. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన   చెన్నై సూపర్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో  ఆరు వికెట్ల నష్టానికి  144 పరుగులే చేయగలిగింది.   కోల్కతా స్పిన్  ఉచ్చులో  బంధీ అయిన  చెన్నై బ్యాటర్లు పరుగులు సాధించడంలో విఫలమయ్యారు.  శివమ్ దూబే  (34 బంతుల్లో 48 నాటౌట్)   రాణించగా  డెవాన్ కాన్వే (30)  ఫర్వాలేదనిపించాడు. 

click me!