IPL 2023: చెన్నైని స్పిన్ ఉచ్చులో బంధించిన కోల్కతా.. కేకేఆర్ ముందు ఈజీ టార్గెట్

By Srinivas MFirst Published May 14, 2023, 9:24 PM IST
Highlights

IPL 2023, CSK vs KKR: స్లో టర్నర్ అయిన   చెపాక్ పిచ్ పై  కేకేఆర్ బౌలర్లు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లను  కట్డడి చేశారు.  స్పిన్నర్లు రాణించడంతో   చెన్నై 144 పరుగులకే పరిమితమైంది.  

ఐపీఎల్ - 16 టేబుల్ టాపర్ గా నిలవాలని టార్గెట్ గా పెట్టుకున్న  చెన్నై  సూపర్ కింగ్స్.. ఆ మేరకు బ్యాటింగ్ లో  విఫలమైంది.   స్లో టర్నర్ అయిన చెపాక్ పిచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్  ఎంచుకున్న ధోని సేనను కేకేఆర్ స్పిన్ త్రయం   వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, సుయాశ్ శర్మలు  స్పిన్ ఉచ్చులో బంధించారు.  ఈ ముగ్గురితో పాటు శార్దూల్ ఠాకూర్ కూడా  కట్టడి చేయడంతో  చెన్నై.. నిర్ణీత  20 ఓవర్లలో  6 వికెట్ల నష్టానికి  144 పరుగులే చేసింది.  చెన్నై మిడిలార్డర్ బ్యాటర్ శివమ్ దూబే (34 బంతుల్లో 48 నాటౌట్, 1 ఫోర్, 3 సిక్సర్లు) తో పాటు  రవీంద్ర జడేజా (24 బంతుల్లో 20, 1 సిక్స్) లు  ఆ జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు.  

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న  చెన్నై సూపర్ కింగ్స్..  ఇన్నింగ్స్ ను ధాటిగానే ఆరంభించింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (13 బంతుల్లో 17, 2 ఫోర్లు), డెవాన్ కాన్వే (28 బంతుల్లో 30, 3 ఫోర్లు)   3.3 ఓవర్లలోనే  31 పరుగులు జోడించారు. కానీ  వరుణ్ చక్రవర్తి  కేకేఆర్ కు బ్రేక్ ఇచ్చాడు. 

Latest Videos

వరుణ్ వేసిన నాలుగో ఓవర్ మూడో బంతికి  రుతురాజ్.. వైభవ్ అరోరాకు క్యాచ్ ఇచ్చాడు. వన్ డౌన్ లో వచ్చిన రహానే.. 11 బంతులలో  ఓ ఫోర్, ఓ సిక్సర్ తో  16 పరుగులు చేసి జోష్ మీదే కనిపించినా  చక్రవర్తి అతడిని కూడా  ఔట్ చేశాడు.  

రహానే ఔట్ అయిన కొద్దిసేపటికే  కాన్వే  ను పదో ఓవర్లో  పెవిలియన్ కు పంపాడు.  పవర్ ప్లేలో బాగానే ఆడినా   స్పిన్నర్లు  రంగ ప్రవేశం చేయడంతో చెన్నై  స్కోరు వేగం తగ్గింది. పది ఓవర్లో ముగిసేసరికి  ఆ జట్టు  3 వికెట్ల నష్టానికి  68 పరుగులే చేసింది.   రహానే స్థానంలో  వచ్చిన రాయుడు   (4) మరసారి విఫలమయ్యాడు.   సునీల్ నరైన్ వేసిన  11వ ఓవర్లో ఫస్ట్ బాల్ కు రాయుడు ఔట్ కాగా.. చివరి బంతికి   మోయిన్ అలీ  (1) కూడా నిష్క్రమించాడు.  

దూబే - జడ్డూల కీలక ఇన్నింగ్స్.. 

72కే ఐదు కీలక వికెట్లు కోల్పోయిన  చెన్నైని  మిడిలార్డర్ బ్యాటర్ శివమ్ దూబే ఆదుకున్నాడు.  క్రీజులోకి వచ్చిన వెంటనే  సుయాశ్  శర్మ వేసిన  12వ ఓవర్లో  భారీ సిక్సర్ బాదిన అతడు రవీంద్ర జడేజా తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు   చక్రవర్తి,  సుయాశ్, నరైన్ లతో కలిసి  కేకేఆర్  కెప్టెన్ నితీశ్ రాణా ఈ ఇద్దరిపై  స్పిన్  అస్త్రాలు ప్రయోగించినా  వాటిని తట్టుకుని  నిలబడిందీ ద్వయం.  17వ ఓవర్ ఫస్ట్ బాల్ కు  చెన్నై స్కోరు  వంద పరుగులకు చేరింది.  సుయాశ్ వేసిన ఈ ఓవర్లో జడేజా,  దూబేలు తలా ఓ సిక్సర్ బాది చెన్నై స్కోరు వేగాన్ని పెంచారు.  కానీ చివర్లో  ఠాకూర్, వైభవ్ అరోరా లు కట్టుదిట్టంగా బంతులు వేసి  చెన్నైని  150 పరుగుల లోపే పరిమితం చేశారు. 

కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, నరైన్ లు రెండేసి వికెట్లు తీయగా శార్దూల్, వైభవ్ లకు తలా ఓ వికెట్ దక్కింది.  నరైన్.. 4 ఓవర్లు వేసి 15 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీయడం గమనార్హం. 

వీజీ కాదు.. 

ఈ పిచ్ పై  145 టార్గెట్ ను ఛేదించడం కూడా అంత వీజీ కాదు.  రెండో ఇన్నింగ్స్ లో  మరింత టర్న్   అయ్యే  చెపాక్ లో  రవీంద్ర జడేజా, మోయిన్ అలీ, తీక్షణతో పాటు పతిరన వంటి బౌలర్లను ఎదుర్కుని  కేకేఆర్ ఈ టార్గెట్‌ను ఛేదించడం అంత సులభమైతే కాదు. మరి కేకేఆర్ ఈ లక్ష్యాన్ని ఛేదించగలదో లేదో  కొద్దిసేపట్లో తేలనుంది. 

click me!