IPL 2023: చెపాక్‌లో చెన్నై బ్యాటింగ్‌కు చెక్ పెట్టిన ఢిల్లీ.. స్పిన్ పిచ్‌పై ఊరించే టార్గెట్

By Srinivas MFirst Published May 10, 2023, 9:24 PM IST
Highlights

IPL 2023, CSK vs DC:చెపాక్ లో  చెన్నై సూపర్ కింగ్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ షాకిచ్చింది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న చెన్నైని 167 పరుగులకే  పరిమితం చేసి గెలవడానికి మంచి  బాట వేసుకుంది. ఇక  ఢిల్లీ బ్యాటర్లు కూడా రాణిస్తే చెన్నైకి చెక్ పెట్టినట్టే.. 

ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. పటిష్టమైన చెన్నై బ్యాటింగ్ లైనప్ ను భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు.   కట్టుదిట్టంగా బంతులు విసురుతూ, క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ  చెన్నైని 167   పరుగులకే పరిమితం  చేశారు. చెన్నై బ్యాటర్లలో టాప్ స్కోరర్ గా చేసిన పరుగులు 25 (దూబే) అంటే ఆ జట్టు బ్యాటింగ్ ఎంత పేలవంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.  ఢిల్లీ బౌర్లలో అక్షర్, కుల్దీప్, ఖలీల్ రాణించారు. 

టాస్ గెలిచి  బ్యాటింగ్ ఎంచుకున్న  చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ ను ధాటిగానే ఆరంభించింది. ఓపెనర్ రుతరాజ్ గైక్వాడ్  18 బంతుల్లోనే  4 బౌండరీల సాయంతో  24 పరుగులు  సాధించి మంచి టచ్ లోనే కనిపించాడు.   13 బంతుల్లో 10 పరుగులే చేసిన కాన్వే ఇబ్బందిపడ్డాడు.    

Latest Videos

కాన్వేను  అక్షర్ పటేల్  ఐదో ఓవర్లో ఫస్ట్ బాల్ కు ఎల్బీగా ఔట్ చేశాడు.  ఆ కొద్దిసేపటికే  ఏడో ఓవర్ మొదటి బంతికి   రుతురాజ్ ను కూడా పెవిలియన్ చేర్చడంతో చెన్నైకి కష్టాలు మొదలయ్యాయి.  వన్ డౌన్ లో వచ్చిన  అజింక్యా రహానే  20 బంతుల్లో  21 పరుగులు చేసి  లలిత్ యాదవ్ బౌలింగ్ లో అతడికే క్యాచ్ ఇచ్చి  ఔట్ అయ్యాడు క్రీజులో ఇబ్బంది పడ్డ మోయిన్ అలీని  కుల్దీప్ యాదవ్  ఔట్ చేసి చెన్నై కష్టాలను మరింత పెంచాడు. 

ఆదుకుంటాడనుకున్న   శివమ్ దూబే.. ధాటిగానే ఆడాడు.   12 బంతులే ఆడిన అతడు   3 భారీ సిక్సర్లతో  25 పరుగులు చేశాడు. అంబటి రాయుడుతో కలిసి  ఐదో వికెట్ కు   46 పరుగులు జోడించి ఇన్నింగ్స్ ను నిలబెట్టే దిశగా  సాగాడు. కానీ  మిచెల్ మార్ష్ వేసిన  15వ ఓవర్లో  భారీ షాట్  ఆడి  బౌండరీ లైన్ వద్ద డేవిడ్ వార్నర్ కు క్యాచ్ ఇచ్చి నిరాశగా వెనుదిరిగాడు.   17 బంతుల్లో  ఓ సిక్స్, ఓ ఫోర్ తో క్రీజులో కుదురుకున్నట్టే కనిపించిన  రాయుడు  కూడా  ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో రిపల్ పటేల్ చేతికి చిక్కాడు.  

చివర్లో  జడ్డూ - ధోని మెరుపులు : 

17 ఓవర్లు ముగిసేసరికి  6 వికెట్ల నష్టానికి   128 పరుగులే చేసిన చెన్నై.. 167 స్కోరు చేసిందంటే దానికి కారణం రవీంద్ర జడేజా(16 బంతుల్లో 20, 1 ఫోర్, 1 సిక్సర్) - మహేంద్ర సింగ్ ధోనీ (9 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు)లే.  కుల్దీప్ వేసిన  18వ ఓవర్లో జడ్డూ.. సిక్స్ కొట్టగా  ఖలీల్ అహ్మద్  వేసిన 19వ ఓవర్లో  ధోని 6,4,6 తో   చెన్నై స్కోరును  160 దాటించాడు. ఇక మిచెల్ మార్ష్ వేసిన  చివరి ఓవర్లో  జడ్డూ.. ఫస్ట్ బాల్ ఫోర్ కొట్టినా తర్వాత బంతికే ఔటయ్యాడు. ఐదో బాల్ కు ధోని కూడా ఔటయ్యాడు. ఫలితంగా  సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి  167 పరుగులు చేసింది.  సెకండ్ ఇన్నింగ్స్ లో  మరింత నెమ్మదించే చెపాక్ పిచ్ పై  ఈ లక్ష్యాన్ని  చెన్నై బౌలర్లు ఏ మేరకు కాపాడుకుంటారనేది ఆసక్తికరం. 

click me!