మనోడు మరో డేల్ స్టెయిన్ అవుతాడా... బౌన్సర్లతో భయపెడుతున్న సన్‌రైజర్స్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్..

Published : Mar 24, 2022, 05:10 PM IST
మనోడు మరో డేల్ స్టెయిన్ అవుతాడా... బౌన్సర్లతో భయపెడుతున్న సన్‌రైజర్స్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్..

సారాంశం

ఐపీఎల్ 2022 రిటెన్షన్‌లో భాగంగా కెప్టెన్ కేన్ విలియంసన్‌తో పాటు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌లను రిటైన్ చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... ప్రాక్టీస్ సెషన్స్‌లో అదరగొడుతున్న ఉమ్రాన్ మాలిక్... 

అనుకోకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లోకి వచ్చి, సంచలన స్పెల్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు జమ్మూ కశ్మీర్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్. ఐపీఎల్‌లో వేసిన మొదటి బంతినే 145 కి.మీ.ల వేగంతో విసిరి, అందర్నీ అవాక్కయ్యేలా చేసిన ఉమ్రాన్ మాలిక్... ఐపీఎల్ 2022 సీజన్‌ కోసం తన అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాడు...

తాజాగా ఉమ్రాన్ మాలిక్, నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. బీభత్సమైన ఫామ్‌లో ఉన్న విండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్‌ బ్యాటింగ్ చేస్తుంటే... ఓ రాకసి బౌన్సర్‌తో అతన్ని భయపెట్టాడు ఉమ్రాన్ మాలిక్...

ఆ తర్వాతి బంతి కూడా బౌన్సర్‌గా రావడం, షాట్ ఆడే ప్రయత్నంలో నికోలస్ పూరన్... ఫీల్డర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ కావడం జరిగిపోయాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ చేస్తుంటే... సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌ డేల్ స్టెయిన్ శిక్షణలో ఈ కశ్మీరీ కుర్రాడు మరింత రాటుతేలినట్టు కనిపిస్తున్నాడని అంటున్నారు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్...

డేల్ స్టెయిన్ కోచింగ్‌లో ఉమ్రాన్ మాలిక్, టీమిండియా డేల్ స్టెయిన్‌గా మారితే... భారత జట్టుకి మరో మెరుపు ఫాస్ట్ బౌలర్ దొరికినట్టే అంటూ అంచనా వేస్తున్నారు. 

ఐపీఎల్‌ 2021 సీజన్‌లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరంగ్రేటం చేసిన ఉమ్రాన్ మాలిక్... తన తొలి ఓవర్‌లో 145, 142, 150, 147, 143, 142 కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేసి... క్రికెట్ ఎక్స్‌పర్ట్స్‌ని అవాక్కయ్యేలా చేశాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో 150 కి.మీ.ల మార్కు అందుకున్న మొట్టమొదటి భారత బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ఉమ్రాన్ మాలిక్..

ఐపీఎల్ 2021 సీజన్‌లో 14 మ్యాచుల్లో మూడంటే మూడు విజయాలను మాత్రమే అందుకుని, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, కెప్టెన్ కేన్ విలియంసన్‌తో పాటు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లుగా జమ్మూ కశ్మీర్ ప్లేయర్లు ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్‌లను మాత్రమే రిటైన్ చేసుకుంది...

ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో టి నటరాజన్ కరోనా కారణంగా జట్టుకి దూరం కావడంతో, నట్టూకి రిప్లేస్‌మెంట్‌గా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ఉమ్రాన్ మాలిక్. నెట్ బౌలర్‌గా ఉన్న ఉమ్రాన్ మాలిక్, రెగ్యూలేషన్ 6.1 రూల్ ఆధారంగా ఆరెంజ్ ఆర్మీ టీమ్‌లో చోటు దక్కించుకోగలిగాడు...

అంతా బాగానే ఉన్నా ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో రూ.10.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన నికోలస్ పూరన్, ఇలా అవుట్ కావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు అవాక్కయ్యారు. ఉమ్రాన్ మాలిక్‌ బౌలింగ్‌లో బౌన్సర్లను ఫేస్ చేయలేని వాడు... లీగ్ మొదలయ్యాక ఎలా ఆడతాడోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?