IPL 2022: ఆఖరి మ్యాచ్‌లోనూ ఆరెంజ్ ఆర్మీ అదే తీరు... పంజాబ్ కింగ్స్ ముందు...

By Chinthakindhi RamuFirst Published May 22, 2022, 9:16 PM IST
Highlights

ఆఖరి మ్యాచ్‌లోనూ భారీ స్కోరు చేయలేకపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్... ఆకట్టుకున్న అభిషేక్ శర్మ... వాషింగ్టన్ సుందర్, రొమారియో సిఫర్డ్ మెరుపులతో... 

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్త్ దూరమైంది. సీజన్‌లో ఆఖరి మ్యాచ్... అయినా ఆరెంజ్ ఆర్మీ ఆటతీరు ఏ మాత్రం మారలేదు. వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి, ఆ తర్వాత ఐదు మ్యాచుల్లో ఓడి ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచులోనూ అదే రకమైన ప్రదర్శనతో ప్రేక్షకులను డిస్సప్పాయింట్ చేసింది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగుల ఓ మోస్తరు స్కోరు చేసింది. గత మ్యాచ్‌లో అదరగొట్టిన యంగ్ ఓపెనర్ ప్రియమ్ గార్గ్ 7 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి కగిసో రబాడా బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

14 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆరెంజ్ ఆర్మీ. ఈ దశలో అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి కలిసి రెండో వికెట్‌కి 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 18 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి, హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసిన అభిషేక్ శర్మ కూడా హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లోనే లియామ్ లివింగ్‌స్టోన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి ఇద్దరూ ఈ సీజన్‌లో 400+ పరుగులు పూర్తి చేసుకున్న అన్‌క్యాప్డ్ ప్లేయర్లుగా నిలవడం విశేషం...

నికోలస్ పూరన్ 10 బంతుల్లో 5 పరుగులు చేసి నాథన్ ఎల్లీస్ బౌలింగ్‌లో అవుటై తీవ్రంగా నిరాశపరిచాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే 17 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసిన అయిడిన్ మార్క్‌రమ్‌ని స్టంపౌట్‌గా పెవిలియన్ చేర్చాడు హర్‌ప్రీత్ బ్రార్...

దీంతో 15 ఓవర్లు ముగిసే సమయానికి 96 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్... అయితే రొమారియో సిఫర్డ్, వాషింగ్టన్ సుందర్ కలిసి వరుస బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు...

29 బంతుల్లో 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీని నాథన్ ఎల్లీస్ విడదీశాడు. 19 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్, నాథన్ ఎల్లీస్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా ఆ తర్వాతి బంతికే జగదీశ సుచిత్‌ గోల్డెన్ డకౌట్ అయ్యాడు.

ఇన్నింగ్స్ ఆఖరి బంతి నో బాల్‌గా వచ్చినా అనవసర పరుగుకి ప్రయత్నించిన భువనేశ్వర్ కుమార్ రనౌట్ అయ్యాడు. 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేసిన రొమారియో సిఫర్ట్ నాటౌట్‌గా నిలిచాడు.. 

పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. నాథన్ ఎల్లీస్ 41 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.

click me!