IPL: ఈశాన్య భారతాన వర్షాలు.. ఈడెన్ గార్డెన్ అతలాకుతలం.. ప్లేఆఫ్స్ సాగేనా..?

By Srinivas MFirst Published May 22, 2022, 2:31 PM IST
Highlights

IPL 2022 Playoffs: ఆదివారంతో ఐపీఎల్-15 సీజన్ లీగ్ దశ ముగియనుంది. మే 24 నుంచి  ప్లేఆఫ్స్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ప్లేఆఫ్స్ జరుగబోయే ఈడెన్ గార్డెన్ మాత్రం వర్ష భీభత్సానికి అతలాకుతలమైంది. 
 

ఐపీఎల్-2022 లో తుది దశకు చేరుకున్నది. ఈ లీగ్ లో ఇక మరో ఐదు మ్యాచులు మాత్రమే మిగిలున్నాయి. ఆదివారంతో లీగ్ మ్యాచ్ లు పూర్తి కానున్నాయి.  మే 24 నుంచి ప్లేఆఫ్స్ మొదలుకానున్నాయి. అయితే ప్లేఆఫ్స్ కు ముందు.. ఈ మ్యాచులు జరుగబోయే వేదిక కోల్కతా లోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్ అతలాకుతలమైంది.  వర్షం, బలమైన ఈదురుగాలులతో స్టేడియం అంతా అల్లకల్లోలమైంది.  గంటకు 90 కిలోమీటర్ల వేగంతో విసిరిన ఈదురుగాలు ఈడెన్ గార్డెన్ లోని ప్రెస్ బాక్స్, హోర్డింగ్స్, ఇతర వస్తువులు ధ్వంసమయ్యాయి. దీంతో ఇక్కడ ప్లేఆఫ్స్ జరుగుతాయా..? లేదా..? అన్నది అనుమానంగా ఉంది. 

గత వారం రోజులుగా ఈశాన్య భారతాన వర్షాలు భీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి.  బౌగోళికపరంగా ఈశాన్య రాష్ట్రాలను ఆనుకుని ఉండే పశ్చిమబెంగాల్ లోనూ ఈ ప్రభావం కనబడుతున్నది. కోల్కతా లో కూడా గత నాలుగైదురోజులుగా ఈదురుగాలులతో కూడిన వర్షం నమోదవుతున్నది. 

ఈ నేపథ్యంలో శనివారం కూడా 90 కిలోమీటర్ల వేగంతో విసిరిన ఈదురుగాలులతో స్టేడియంలోని ప్రెస్ బాక్స్ అద్దాలు తునా తునకలయ్యాయి. పలు హోర్డింగ్స్,  మైదానంలో కప్పి ఉంచిన టార్ఫలిన్ కవర్లు ధ్వంసమయ్యాయి. స్టేడియాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తో పాటు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధికారులు పర్యవేక్షించారు. 

ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో భాగంగా మే 24న ఇక్కడ తొలి క్వాలిఫైయర్స్ మ్యాచ్ జరగాల్సి ఉంది. గుజరాత్ టైటాన్స్-రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ మధ్య  ఇక్కడ మంగళవారం రాత్రి మ్యాచ్  నిర్వహించాల్సి ఉంది. మే 25న  ఎలిమినేటర్ మ్యాచ్ (లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) మధ్య జరుగనుంది. ఈ రెండు మ్యాచులు కోల్కతాలోనే నిర్వహిస్తారు.  మ్యాచుల నిర్వహణకు మరో రెండు రోజులే సమయముండటం.. ఈశాన్య భారతంలో ఇంకా వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో  మ్యాచుల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

 

Eden Gardens damaged after a thunderstorm pic.twitter.com/I2cXOXsCbS

— Akash Kharade (@cricaakash)

ఇదే విషయమై క్యాబ్ అధికారులు మాట్లాడుతూ.. ‘మ్యాచులకు  మరో రెండ్రోజుల టైమ్  ఉంది. అప్పటివరకు స్టేడియాన్ని రెడీ చేస్తాం. ప్రెస్ బాక్స్ లో పగిలిన అద్దాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయిస్తాం. ప్రస్తుతానికైతే ఇక్కడ వర్షం లేదు. మైదానంలో కూడా టార్ఫలిన్ కవర్లను తీసేసి డ్రెయిన్ సిస్టం ప్రారంభించాం.. పరిస్థితి అదుపులోనే ఉంది..’ అని  చెప్పడం కొంత ఊరటనిచ్చే అంశం. 

ఐపీఎల్ ప్లేఆఫ్స్, ఫైనల్ షెడ్యూల్ ఇది..

- మే 24న తొలి క్వాలిఫైయర్ : గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ 
- మే 25న ఎలిమినేటర్ : లక్నో సూపర్  జెయింట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  ( ఈ రెండు మ్యాచులు ఈడెన్ గార్డెన్స్ లో)
- మే 27న రెండో క్వాలిఫైయర్ : క్వాలిఫైయర్ ఓడిన జట్టు వర్సెస్ ఎలిమినేటర్ లో గెలిచిన జట్టు 
- మే 29న ఫైనల్ : క్వాలిఫైయర్-1 విజేత వర్సెస్ క్వాలిఫైయర్-2  విజేత  (ఎలిమినేటర్ తో పాటు ఫైనల్ మ్యాచ్ ను అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహిస్తారు) 

 

click me!