IPL 2022: నరాలు తెగే ఉత్కంఠ.. సన్ రైజర్స్ దే విజయం.. ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్ ఆశలకు ఛాన్స్

By Srinivas MFirst Published May 17, 2022, 11:33 PM IST
Highlights

IPL 2022 MI vs SRH: వరుస పరాజయాలకు సన్ రైజర్స్ బ్రేక్ వేసింది. ప్లేఆఫ్ కు ఆశలు అడుగంటినా ఏదో ఓ మూలన ఉన్న అవకాశాల కోసం  తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. షాకిస్తుందనుకున్న ముంబై దానికి కొద్దిదూరంలో నిలిచిపోయింది.

ఐపీఎల్-15లో ఏ మూలనో మిణుకు మిణుకుమంటున్న ప్లేఆఫ్ ఆశలను కాపాడుకోవాలంటే తప్పకుండా నెగ్గాల్సిన మ్యాచ్ లో  సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్ రౌండ్ ప్రదర్శన చేసింది. ముందు బ్యాటింగ్ లో భారీ స్కోరు చేసిన ఎస్ఆర్హెచ్.. తర్వాత బౌలింగ్ లోనూ రాణించి ఐదు పరాజయాల తర్వాత మళ్లీ విజయాన్ని అందుకుంది. సన్ రైజర్స్ నిర్దేశించిన 194 పరుగుల లక్ష్య ఛేదనలో  ముంబై ఇండియన్స్.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా సన్ రైజర్స్ 3 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ  సీజన్ లో ముంబైకి ఇది పదో ఓటమి కాగా సన్ రైజర్స్ కు ఆరో గెలుపు. 

తాజా విజయంతో సన్ రైజర్స్ 13 మ్యాచుల్లో 6 విజయాలు సాధించి  12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలోనే ఉంది. ఈ సీజన్ లో ఆఖరు మ్యాచ్ అయిన హైదరాబాద్-పంజాబ్  పోరులో హైదరాబాద్ నెగ్గినా ఆ లోపు ఢిల్లీ క్యాపిటల్స్ గనక మే 21న ముంబై ఇండియన్స్ ను ఓడిస్తే ఆ జట్టు ప్లేఆఫ్ చేరుతుంది. హైదరాబాద్ ప్లేఆఫ్ కు అవకాశం కోల్పోతుంది.  

ఎస్ఆర్హెచ్ నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో  ముంబైకి మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (36 బంతుల్లో 48.. 2 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇషాన్ కిషన్  (34 బంతుల్లో 43.. 5 ఫోర్లు, 1 సిక్సర్) లు తొలి వికెట్ కు 10.4 ఓవర్లలో 95 పరుగులు జోడించారు.  

ఛేదించాల్సిన లక్ష్యం భారీగా ఉండటంతో ఆచితూచి బ్యాటింగ్ చేసిన ఈ జంట వీలు చిక్కినప్పుడల్లా  బంతిని బౌండరీ లైన్ దాటించింది. భువనేశ్వర్ వేసిన రెండో ఓవర్లో హిట్ మ్యాన్ సిక్సర్ కొట్టగా.. వాషింగ్టన్ సుందర్ వేసిన 3వ ఓవర్లో ఇషాన్ కిషన్.. రెండు ఫోర్లు కొట్టాడు.  నటరాజన్ వేసిన ఐదో ఓవర్లో కిషన్ ర బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు బాదగా.. ఆఖరు బంతిని రోహిత్ సిక్స్ కొట్టాడు. ఆరు ఓవర్లకు ముంబై వికెట్లేమీ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. 

షాకిచ్చిన ఉమ్రాన్ మాలిక్.. 

మిడిల్ ఓవర్లలో వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదిన ఈ జంట..  ప్రమాదకరంగా పరిణమిస్తున్న తరుణంలో వాషింగ్టన్ సుందర్ వేసిన 11వ ఓవర్లో నాలుగో బంతిని భారీ షాట్ ఆడబోయన రోహిత్.. సుచిత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఓవర్లోనే ఉమ్రాన్ మాలిక్.. ముంబైకి మరో షాకిచ్చాడు.  మూడో బంతికి ఇషాన్ కిషన్ ను పెవిలియన్ కు పంపాడు.

కిషన్ స్థానంలో వచ్చిన తిలక్ వర్మ (8) ను కూడా ఉమ్రాన్.. 15వ ఓవర్ తొలి బంతికి ఔట్ చేశాడు. అదే ఓవర్లో ఉమ్రాన్.. డేనియల్ సామ్స్ (15) ను కూడా సాగనంపాడు. ఫలితంగా ముంబై 15 వ ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. 30 పరుగుల వ్యవధిలో ఆ జట్టు 4 కీలక వికెట్లు కోల్పోయింది. అందులో 3 ఉమ్రాన్ కు దక్కినవే కావడం గమనార్హం. 

ఒకే ఓవర్లో 4 సిక్సర్లు.. భయపెట్టిన టిమ్ డేవిడ్.. 

చివర్లో టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 46.. 3 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచితంగా పోరాడాడు. నటరాజన్ వేసిన  18వ ఓవర్లో  డేవిడ్ నాలుగు సిక్సర్లు బాదాడు.  ఆ ఓవర్లో 26 పరుగులొచ్చాయి. దీంతో  మ్యాచ్  హైదరాబాద్ చేజారిన్టేట అనిపించింది. కానీ అదే ఓవర్లో ఆఖరిబంతికి అనసరపు పరుగు తీయబోయిన అతడిని నటరాజ్ రనౌట్ చేసి మ్యాచ్  ను మమళ్లీ సన్ రైజర్స్ వైపునకు తిప్పాడు. 19వ ఓవర్ వేసిన భువీ.. సంజయ్ యాదవ్ ను ఔట్ చేయడమే గాక మెయిడిన్ ఓవర్ వేశాడు. చివరి ఓవర్ వేసిన ఫరూఖీ.. 15 పరుగులిచ్చాడు. ఫలితంగా 3 పరుగుల తేడాతో హైదరాబాద్ ను విజయం వరించింది. 

అంతకుముందు టాస్ ఓడిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి (76), ప్రియం గార్గ్ (42), నికోలస్ పూరన్ (38) లు రెచ్చిపోయి ఆడారు. 

click me!