ఎండలకు తాళలేక.. ఆ సిరీస్ ను డే అండ్ నైట్ కు మార్చనున్న పీసీబీ..

By Srinivas MFirst Published May 17, 2022, 7:58 PM IST
Highlights

Pak vs WI ODI: ఉపఖండంలో ఎండలు మండిపోతున్నాయి. భారత్ తో పాటు  పాకిస్తాన్ లో కూడా దాదాపు ఒకే వాతావరణ పరిస్థితులుంటాయి.  ఇండియాలో మాదిరే పాక్ లో కూడా వేడి దడ పుట్టిస్తున్నది. 

తీవ్రమైన ఎండలు, ఉక్కపోత, వడగాలుల కారణంగా ఉపఖండంలో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం 11 గంటల తర్వాత బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్నారు. ఎండల కారణంగా సాయంత్రమైతే తప్ప బయటకు రావడానికి ఇష్టపడని ప్రజలు ఇక  క్రికెట్ మ్యాచులు ఏం చూస్తారు..? ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. త్వరలో  ఆ దేశంలో వెస్టిండీస్ తో జరుగబోయే పరిమిత ఓవర్ల క్రికెట్ షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చేసింది.  డే మ్యాచ్ లకు బదులు.. డే అండ్ నైట్ మ్యాచ్ లుగా వాటిని నిర్వహించనుంది. 

ఈ ఏడాది  జూన్ 8 నుంచి పాకిస్తాన్ తో వెస్టిండీస్ మూడు వన్డేలు ఆడనుంది. రావల్పిండి, ముల్తాన్ లలో ఈ మ్యాచులు జరుగుతాయి.  జూన్ 8, 10, 12 తేదీలో మ్యాచులు జరగాల్సి ఉంది. 

అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ సిరీస్ ను డే మ్యాచ్ లుగా ఆడించాలని పీసీబీ భావించింది. కానీ  ఈ సిరీస్ జరుగబోయే ముల్తాన్, రావల్పిండిలలో ఎండ వేడి ఇప్పటికే 45 డిగ్రీలకు చేరువలో ఉంది.  ఇది జూన్ 8 నాటికి 40 డిగ్రీలకు తగ్గకుండా ఉండే అవకాశముందని అక్కడి వాతావరణ శాఖ  తెలిపింది.

ఈ నేపథ్యంలో ఉక్కపోత, ఎండి వేడికి ఆటగాళ్లతో పాటు మ్యాచ్ చూడటానికి వచ్చే ప్రేక్షకులు కూడా తట్టుకోరని భావించిన పీసీబీ..  మ్యాచులను డే అండ్ నైట్ కు షిఫ్ట్ చేసింది. మధ్యాహ్నం రెండు గంటలకు మొదలుకావాల్సిన మ్యాచులు..  తాజా షెడ్యూల్ ప్రకారం సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రారంభమవుతాయి.  

 

PCB is planning to start matches of Pak vs Wi Odi's at 5PM because of Heatwave & Venue is probably is Multan Cricket Stadium.

— Komal see (@Komal_see)

ఇక ఈ మూడు మ్యాచులలో ఆటగాళ్లు వేడి నుంచి ఉపశమనం పొందడానికి గాను  మ్యాచ్ మధ్యలో ప్రత్యేక డ్రింక్ బ్రేక్ లు అందించడంతో పాటు డగౌట్లలో ఆటగాళ్లకు కూలర్లు ఏర్పాటు చేయనున్నారు. 

కాగా.. షెడ్యూల్ ప్రకారమైతే గతేడాది డిసెంబర్ లోనే ఈ మ్యాచులు జరగాల్సి ఉంది. డిసెంబర్ లో పాక్ పర్యటనకు వచ్చిన వెస్టిండీస్.. మూడు టీ20 లతో పాటు వన్డేలు కూడా ఆడాల్సింది.  కానీ కరోనా కారణంగా విండీస్ పర్యటన అర్థాంతరంగా ముగిసింది. వెస్టిండీస్ జట్టులోని పలువురు కీలక ఆటగాళ్లు కరోనా భారిన పడటంతో కేవలం టీ20లనే నిర్వహించచి వన్డే సిరీస్ ను వాయిదా వేశారు. వాటిని  జూన్్ లో నిర్వహిస్తున్నారు. ఇదిలాఉండగా ఇటీవలే విండీస్ కెప్టెన్సీ బాధ్యతలతో పాటు ఆటగాడిగా కూడా రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ సారథి పొలార్డ్ స్థానంలో నికోలస్  పూరన్ ఈ సిరీస్ లో పూర్తిస్థాయి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు. 

click me!