IPL 2022: రాహుల్ త్రిపాఠి రచ్చ రచ్చ.. ముంబై ముందు భారీ టార్గెట్ ఉంచిన సన్ రైజర్స్

By Srinivas MFirst Published May 17, 2022, 9:25 PM IST
Highlights

IPL 2022 MI vs SRH: ప్లేఆఫ్ ఆశలు అడుగంటిన వేళ ఈ మ్యాచ్ లో భారీ తేడాతో నెగ్గితే  అందుకు ఓ చిన్న అవకాశమైతే వస్తుందన్న అవకాశాల నేపథ్యంలో  సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు రెచ్చిపోయారు. 

ఐపీఎల్-15లో భాగంగా  ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న కీలక మ్యాచ్ లో  సన్ రైజర్స్ బ్యాటింగ్ లో అదరగొట్టింది.  రాహుల్ త్రిపాఠి (76), ప్రియం గార్గ్ (42), నికోలస్  పూరన్ (38) లు రెచ్చిపోయి ఆడారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్.. 6 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరు చేసింది. పవర్ ప్లే తో పాటు మిడిల్ ఓవర్స్ లో  ధాటిగా ఆడిన  సన్ రైజర్స్.. ఆఖర్లో తడబడి వరుసగా వికెట్లు కోల్పోయింది. లేకుంటే మన స్కోరు మరో 25 పరుగులన్నా ఎక్కువ చేసుండేది. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ (9) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు.  కానీ  ఆ తర్వాత వన్ డౌన్ లో వచ్చిన  రాహుల్ త్రిపాఠి (44 బంతుల్లో 76.. 9 ఫోర్లు, 3 సిక్సర్లు) తో  కలిసి ప్రియం గార్గ్ (26 బంతుల్లో 42.. 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడాడు.  

ఈ ఇద్దరూ కలిసి ముంబై బౌలర్లను ఆటాడుకున్నారు. డేనియల్ సామ్స్ వేసిన 3 వ ఓవర్లో గార్గ్ రెండు ఫోర్లు కొట్టాడు. సంజయ్ యాదవ్ వేసిన నాలుగో ఓవర్లో రాహుల్ త్రిపాఠి కూడా రెండు బౌండరీలు సాధించాడు. బుమ్రా వేసిన ఐదో ఓవర్లో త్రిపాఠి.. 6, 4, 4 బాదాడు.  సామ్స్ వేసిన ఆరో ఓవర్లో రెండో బంతికి ప్రియం గార్గ్ ఇచ్చిన క్యాచ్ ను సంజయ్ యాదవ్ డ్రాప్ చేశాడు.  అదే ఓవర్లో ఐదో బంతికి సిక్సర్ బాదిన అతడు జోరు కొనసాగించాడు. ఈ ఇద్దరి జోరుతో 9 ఓవర్లు ముగిసేసరికి సన్ రైజర్స్ స్కోరు 90 పరుగులకు చేరింది. కానీ పదో ఓవర్ వేసిన రమన్దీప్ సింగ్  బౌలింగ్ లో అతడికే క్యాచ్ ఇచ్చిన గార్గ్ పెవిలియన్ చేరాడు.  ఈ ఇద్దరూ రెండో వికెట్ కు 78 పరుగులు జోడించారు.  

పూరన్.. రాహుల్ రచ్చ రచ్చ 

గార్గ్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన నికోలస్ పూరన్ (22 బంతుల్లో 38.. 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా అదే జోరు కొనసాగించడంతో సన్ రైజర్స్ స్కోరు బ్రేకుల్లేకుండా దూసుకెళ్లింది. వస్తూనే బుమ్రా బౌలింగ్ లో ఫోర్ తో ఖాతా తెరిచిన పూరన్.. మెరిడిత్ వేసిన 13 వ ఓవర్లో  వరుస బంతుల్లో రెండు సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత మార్కండే ఓవర్లో 4, 6 కొట్టాడు. కాగా మరో వైపు అదే ఓవర్లో చివరి బంతికి సింిల్ తీసిన  త్రిపాఠి.. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ  పూర్తి చేసుకున్నాడు.  ఈ సీజన్ లో అతడికి ఇది మూడో హాఫ్ సెంచరీ.  

హాఫ్ సెంచరీ తర్వాత త్రిపాఠి మరింత రెచ్చిపోయాడు. సామ్స్ వేసిన 16వ ఓవర్లో 6, 4, 4 బాది స్కోరు బోర్డును హైస్పీడ్ లో పరిగెత్తించాడు. కానీ మెరిడిత్ వేసిన 17వ ఓవర్ ఆఖరి బంతికి  పూరన్.. మార్కండేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 76 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.  ఆ తర్వాతి ఓవర్లోనే రాహుల్ త్రిపాఠి కూడా.. రమన్దీప్ సింగ్ బౌలింగ్ లో తిలక్ వర్మ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ వెంటనే మార్క్రమ (2) కూడా వెనుదిరిగాడు. 

ఇక ఆఖర్లో.. కేన్ విలియమ్సన్ (8 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (9) లు క్రీజులో ఉన్నా టెస్టుల మాదిరే ఆడారు. 18వ ఓవర్లో 2 పరుగులు రాగా.. 19వ ఓవర్లో 11 పరుగులొచ్చాయి. ఇక  బుమ్రా వేసిన 20 వ ఓవర్లో 7 పరుగులొచ్చాయి. కీలకమైన చివరి 3 ఓవర్లలో సన్ రైజర్స్ 20 పరుగులే చేయగలిగింది. 

సన్ రైజర్స్ బ్యాటర్ల ధాటికి ముంబై బౌలర్లు చతికిలపడ్డారు. రమన్దీప్ సింగ్ ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించాడు. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు అతడు 3 వికెట్లు పడగొట్టాడు.  మిగిలిన వారిలో ప్రతి బౌలర్ ఎకానమీ 10 దాటింది. బుమ్రా, సామ్స్, మెరిడిత్ కూడా తలో వికెట్ పడగొట్టినా భారీ పరుగులిచ్చారు. 

click me!