Sri Lanka: వాళ్లకు తిండికే గతి లేదు.. మేం వెళ్లి క్రికెట్ ఏం ఆడతాం..? లంక పర్యటనపై తేల్చుకోలేకపోతున్న కంగారూలు

By Srinivas MFirst Published May 25, 2022, 4:56 PM IST
Highlights

Australia Tour Of Sri Lanka: తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక కు క్రికెట్ ఆస్ట్రేలియా మరో షాక్ ఇవ్వనుంది. లంకలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ పర్యటనకు మంగళం పాడితేనే బెటర్ అనే అభిప్రాయంతో ఉంది.

శ్రీలంకలో గత కొద్దిరోజులుగా పోటెత్తుతున్న అల్లర్లు.. అందుకు కారణమైన ఆర్థిక సంక్షోభంతో ఆ దేశం అట్టుడుకుతున్నది.  కనీస అవసరాలు తీరక ప్రజలు  చాలా కష్టాలు పడుతున్నారు. తినడానికి తిండి లేక ప్రజలు వలసలు వెళ్తున్నారు. ఏదైతే అది తేల్చుకుందామనుకున్న జనమేమో  ప్రభుత్వం పై పోరాడుతున్నారు. పెట్రోల్, విదేశీ వనరులు, నిత్యావసరాలు.. ఇలా ఏ దిక్కుకు చూసినా శూణ్యమే కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో లంకలో వెళ్లి క్రికెట్ ఆడటం కూడా భావ్యం కాదనే ఉద్దేశంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉన్నారు. వచ్చే నెలలో  కంగారూలు లంకలో పర్యటించాల్సి  ఉండగా.. దానిపై  క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) పునరాలోచనలో పడింది.

లంకలో ప్రజల నిరసనలు, విద్యుత్ కోతల కారణంగా పర్యటనను వాయిదా వేసుకోవడమే మంచిదనే అభిప్రాయంలో ఆస్ట్రేలియా క్రికెటర్లున్నారు. ఇదే విషయంలో  సీఏ కూడా  పునరాలోచనలో పడింది. దీనిపై ఈ వారంలోనే ఒక నిర్ణయం వెలువడే అవకాశమున్నది. ఒకవేళ పర్యటనకు సీఏ సై అంటే మాత్రం ఆసీస్ ఆటగాళ్లు జూన్ లో లంక పర్యటనకు రావాల్సిందే. 

ఇదే విషయమై సీఏ సీఈవో టాడ్ గ్రీన్బెర్గ్ మాట్లాడుతూ.. ‘శ్రీలంకలో జరుగుతున్న పరిణామాల గురించి మా క్రికెటర్లకు అవగాహన ఉంది.  అక్కడి ప్రజలు నిత్యావసరాలకే ఇబ్బందులు పడుతున్న వేళ తాము వెళ్లి క్రికెట్ ఏం ఆడగలమనే ఆందోళనలో వాళ్లున్నారు. మా ఆటగాళ్ల  భద్రత, ఇతర అంశాల దృష్ట్యా పర్యటనకు సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం..’ అని తెలిపారు. 

రాత్రి వద్దు.. పొద్దంతా ముద్దు.. 

ఆహార వస్తువుల ధరలు ఆకాశాన్నంటడం.. విద్యుత్ కోత,  పెట్రోల్ నిల్వలు కూడా తగ్గిపోవడంతో లంక అల్లర్లతో అట్టుడుకుతున్నది. అయితే  తమ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో  పర్యటనలో టెస్టు సిరీస్ ను ముందు జరపాలని ఆ తర్వాత వన్డే, టీ20 లను నిర్వహించేందుకు అనుమతినివ్వాలని  శ్రీలంక క్రికెట్.. సీఏను కోరింది. తద్వారా తాము డే అండ్ నైట్ మ్యాచ్  లకు కొంత పెట్రోల్ ను ఆదా చేసుకోగలుగుతామని (జనరేటర్ల కోసం) అభ్యర్థించింది. 

ఆసీస్ పర్యటనలో షెడ్యూల్ ప్రకారమైతే  ముందు 3 టీ20లు.. ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడాల్సి  ఉంది. అయితే టీ20, వన్డే లను నిర్వహించేందుకు  లంక బోర్డు వద్ద పెట్రోల్ నిల్వలు లేవు. అందుకే  టెస్టు సిరీస్ ను ముందు జరపాలని కోరింది. అయితే దీనిపై సీఏ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 

ఆసియా  కప్ కూడా గోవిందా..? 

ఆస్ట్రేలియా గనక లంక ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని  పర్యటనను రద్దు చేసుకుంటే అది లంకకు భారీ షాకే.  ఈ సిరీస్ ద్వారా ఎంతో కొంత ఆదాయాన్ని ఆర్జించాలని లంక భావిస్తున్నది. ఒకవేళ ఈ పర్యటన రద్దైతే దాని ఎఫెక్ట్ ఆసియా కప్ నిర్వహణ మీద కూడా పడొచ్చని వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ లో జరగాల్సి ఉన్న ఆసియా కప్  లంకలో కాకుంటే దుబాయ్ లో గానీ బంగ్లాదేశ్ లో గానీ నిర్వహించే అవకాశాలున్నాయి. ఆసియా కప్ రద్దైతే లంక క్రికెట్ కు భారీ నష్టం తప్పదు. 

click me!