
IPL 2022: రెండు సీజన్ల తర్వాత ఆర్‌సీబీ ఎలిమినేటర్ గండాన్ని దాటి, క్వాలిఫైయర్ 2కి దూసుకెళ్లింది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన హై స్కోరింగ్ గేమ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 14 పరుగుల తేడాతో ఓడింది... ఈ విజయంతో ఆర్‌సీబీ, 27న రాజస్థాన్ రాయల్స్‌తో క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఆడబోతోంది. 2016 తర్వాత తొలిసారిగా క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడబోతోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
208 పరుగుల భారీ లక్ష్యఛేదనతో బ్యాటింగ్ మొదలెట్టిన లక్నో సూపర్ జెయింట్స్‌కి మొదటి ఓవర్‌లోనే షాక్ తగిలింది. 5 బంతుల్లో ఓ సిక్సర్ బాదిన క్వింటన్ డి కాక్, సిరాజ్ బౌలింగ్‌లో డుప్లిసిస్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
11 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 19 పరుగులు చేసిన మనన్ వోహ్రా, హజల్‌వుడ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 41 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది లక్నో. ఈ దశలో దీపక్ హుడా, కెఎల్ రాహుల్ కలిసి మూడో వికెట్‌కి 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
26 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 45 పరుగులు చేసిన దీపక్ హుడాను హసరంగ క్లీన్ బౌల్డ్ చేశాడు. లక్నో విజయానికి ఆఖరి మూడు ఓవర్లలో 41 పరుగులు కావాల్సిన దశలో మొదటి రెండు బంతుల్లో వైడ్ల రూపంలో 6 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత రెండు బంతులకు పరుగులు ఇవ్వని హర్షల్ పటేల్, మూడో బంతికి స్టోయినిస్‌ని అవుట్ చేశాడు.
9 బంతుల్లో ఓ సిక్సర్‌తో 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు స్టోయినిస్. ఆ ఓవర్‌లో 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు హర్షల్ పటేల్. దీంతో ఆఖరి 2 ఓవర్లలో లక్నో విజయానికి 33 పరుగులు కావాల్సి వచ్చాయి.. 19వ ఓవర్ వేసిన జోష్ హజల్‌వుడ్ మొదటి మూడు బంతుల్లో 5 పరుగులు (మూడు వైడ్లతో) మాత్రమే ఇచ్చి
నాలుగో బంతికి కెఎల్ రాహుల్‌ని అవుట్ చేశాడు. 58 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 79 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, షాబాజ్ అహ్మద్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
ఆ తర్వాతి బంతికే జోష్ హజల్‌వుడ్‌కే క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్ అయ్యాడు కృనాల్ పాండ్యా. ఆఖరి దుస్మంత ఛమీరా ఫోర్ బాదడంతో లక్నో సూపర్ జెయింట్స్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 24 పరుగులు కావాల్సి వచ్చాయి...
మొదటి బంతికి సింగిల్ మాతమ్రే రాగా రెండో బంతికి పరుగులేమీ రాలేదు. మూడో బంతికి ఛమీరా భారీ సిక్సర్ బాదడంతో ఆఖరి 3 బంతుల్లో 16 పరుగులు కావాల్సి వచ్చాయి. ఆఖరి మూడు బంతుల్లో 1 పరుగు మాత్రమే ఇచ్చాడు హర్షల్ పటేల్.
టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన ఆర్‌సీబీ, రజత్ పటిదార్ సెన్సేషనల్ సెంచరీ కారణంగా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 207 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్ మొదటి ఓవర్‌లోనే గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. మోహ్సీన్ ఖాన్ బౌలింగ్‌లో డి కాక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు డుప్లిసిస్. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో గోల్డెన డకౌట్ అయిన ఆరో కెప్టెన్‌గా నిలిచాడు డుప్లిసిస్...
2011లో అప్పటి ఆర్‌సీబీ కెప్టెన్ డానియల్ విటోరీ గోల్డెన్ డకౌట్ కాగా, 11 ఏళ్ల తర్వాత ఫాఫ్ డుప్లిసిస్ ఆ రికార్డు నెలకొల్పాడు. 4 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీని విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్ కలిసి ఆదుకున్నారు. రెండో వికెట్‌కి 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన విరాట్ కోహ్లీ, ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
24 బంతుల్లో 2 ఫోర్లతో 25 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్ 5లోకి ఎంట్రీ ఇచ్చాడు. క్రిస్ గేల్ 14562 పరుగులతో టాప్‌లో ఉంటే, షోయబ్ మాలిక్ 11698, కిరన్ పోలార్డ్ 11571, డేవిడ్ వార్నర్ 10740 పరుగులతో టాప్ 4లో ఉన్నాడు. 10586 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ని అధిగమించాడు...
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 10 బంతుల్లో ఓ సిక్సర్‌తో 9 పరుగులు చేసి కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో అవుట్ కాగా మహిపాల్ లోమ్రోర్ 9 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసి రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
కృనాల్ పాండ్యా వేసిన ఆరో ఓవర్‌లో 4, 4, 6, 4 బాది 20 పరుగులు రాబట్టిన రజత్ పటిదార్, 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రవి భిష్ణోయ్ వేసిన 16వ ఓవర్‌లో 6, 4, 6, 4, 6 బాది 27 పరుగులు రాబట్టాడు రజత్ పటిదార్..
పటిదార్ 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మోహ్సీన్ ఖాన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో సెంచరీ మార్కు అందుకున్నాడు రజత్ పటిదార్... ప్లేఆఫ్స్‌లో సెంచరీ చేసిన మొట్టమొదటి ఆర్‌సీబీ బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.
ప్లేఆఫ్స్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ప్లేయర్‌గా సాహా రికార్డును సమం చేశాడు పటిదార్. ఓవరాల్‌గా ప్లేఆఫ్స్‌లో సెంచరీ చేసిన ఐదో బ్యాట్స్‌మెన్ రజత్ పటిదార్. ఇంతకుముందు మురళీ విజయ్, వృద్ధిమాన్ సాహా, వీరేంద్ర సెహ్వాగ్, షేన్ వాట్సన్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు...
ఫీల్డింగ్‌లో ఈజీ క్యాచులను జారవిడిచిన లక్నో సూపర్ జెయింట్స్ భారీ మూల్యం చెల్లించుకుంది. దినేశ్ కార్తీక్, రజత్ పటిదార్ ఇచ్చిన క్యాచులను లక్నో ఫీల్డర్లు అందుకోలేకపోయారు.
రజత్ పటిదార్ 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 112 పరుగులు చేయగా దినేశ్ కార్తీక్ 23 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 37 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆఖరి 5 ఓవర్లలో 84 పరుగులు రాబట్టారు ఈ ఇద్దరూ...