IPL 2022: రజత్ పటిదార్ సెన్సేషనల్ సెంచరీ, దినేశ్ కార్తీక్ మెరుపులు... లక్నో ముందు భారీ టార్గెట్..

By Chinthakindhi RamuFirst Published May 25, 2022, 9:51 PM IST
Highlights

Rajat Patidar: 49 బంతుల్లో సెంచరీ బాదిన రజత్ పటిదార్... ప్లేఆఫ్స్‌లో సెంచరీ చేసిన మొట్టమొదటి ఆర్‌సీబీ బ్యాటర్‌గా రికార్డు... దినేశ్ కార్తీక్ మెరుపులు.. 

ఐపీఎల్ 2022 వేలంలో అమ్ముడుపోని ప్లేయర్లు, సీజన్‌లో దుమ్మురేపుతున్నారు. గత సీజన్‌లో ఆర్‌సీబీకి ఆడినా వేలంలో అమ్ముడుపోని రజత్ పటిదార్‌ని గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమైన లువ్‌నీత్ సిసోడియా స్థానంలో రిప్లేస్‌మెంట్‌గా తీసుకుంది ఆర్‌సీబీ... విరాట్ కోహ్లీ, డుప్లిసిస్, మ్యాక్స్‌వెల్ వంటి స్టార్లు విఫలమైన చోటు, సెంచరీతో చెలరేగిపోయాడు రజత్ పటిదార్...   తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 207 పరుగుల భారీ స్కోరు చేసింది... 

టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన ఆర్‌సీబీకి శుభారంభం దక్కలేదు. కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్ మొదటి ఓవర్‌లోనే గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. మోహ్సీన్ ఖాన్ బౌలింగ్‌లో డి కాక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు డుప్లిసిస్. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో గోల్డెన డకౌట్ అయిన ఆరో కెప్టెన్‌గా నిలిచాడు డుప్లిసిస్...

2011లో అప్పటి ఆర్‌సీబీ కెప్టెన్ డానియల్ విటోరీ గోల్డెన్ డకౌట్ కాగా, 11 ఏళ్ల తర్వాత ఫాఫ్ డుప్లిసిస్ ఆ రికార్డు నెలకొల్పాడు. 4 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీని విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్ కలిసి ఆదుకున్నారు. రెండో వికెట్‌కి 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన విరాట్ కోహ్లీ, ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

24 బంతుల్లో 2 ఫోర్లతో 25 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్ 5లోకి ఎంట్రీ ఇచ్చాడు. క్రిస్ గేల్ 14562 పరుగులతో టాప్‌లో ఉంటే, షోయబ్ మాలిక్ 11698, కిరన్ పోలార్డ్ 11571, డేవిడ్ వార్నర్ 10740 పరుగులతో టాప్ 4లో ఉన్నాడు. 10586 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ని అధిగమించాడు...

గ్లెన్ మ్యాక్స్‌వెల్ 10 బంతుల్లో ఓ సిక్సర్‌తో 9 పరుగులు చేసి కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో అవుట్ కాగా మహిపాల్ లోమ్రోర్ 9 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసి రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. 

కృనాల్ పాండ్యా వేసిన ఆరో ఓవర్‌లో 4, 4, 6, 4 బాది 20 పరుగులు రాబట్టిన రజత్ పటిదార్, 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రవి భిష్ణోయ్ వేసిన 16వ ఓవర్‌లో 6, 4, 6, 4, 6 బాది 27 పరుగులు రాబట్టాడు రజత్ పటిదార్.. 

49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మోహ్సీన్ ఖాన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో సెంచరీ మార్కు అందుకున్నాడు రజత్ పటిదార్... ప్లేఆఫ్స్‌లో సెంచరీ చేసిన మొట్టమొదటి ఆర్‌సీబీ బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.

ప్లేఆఫ్స్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ప్లేయర్‌గా సాహా రికార్డును సమం చేశాడు పటిదార్. ఓవరాల్‌గా ప్లేఆఫ్స్‌లో సెంచరీ చేసిన ఐదో బ్యాట్స్‌మెన్ రజత్ పటిదార్. ఇంతకుముందు మురళీ విజయ్, వృద్ధిమాన్ సాహా, వీరేంద్ర సెహ్వాగ్, షేన్ వాట్సన్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు...

ఫీల్డింగ్‌లో ఈజీ క్యాచులను జారవిడిచిన లక్నో సూపర్ జెయింట్స్ భారీ మూల్యం చెల్లించుకుంది. దినేశ్ కార్తీక్, రజత్ పటిదార్ ఇచ్చిన క్యాచులను లక్నో ఫీల్డర్లు అందుకోలేకపోయారు. రజత్ పటిదార్ 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 112 పరుగులు చేయగా దినేశ్ కార్తీక్ 23 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 37 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆఖరి 5 ఓవర్లలో 84 పరుగులు రాబట్టారు ఈ ఇద్దరూ... 

click me!