IPL 2022: రాణించిన జైస్వాల్, శాంసన్.. లక్నో ముందు భారీ లక్ష్యం..

By Srinivas MFirst Published May 15, 2022, 9:20 PM IST
Highlights

TATA IPL 2022 LSG vs RR: ప్లేఆఫ్ రేసులో కీలక మ్యాచ్ ఆడుతున్న రాజస్తాన్ రాయల్స్  బ్యాటింగ్ లో రాణించింది. ఈ సీజన్ లో  ఆరెంజ్ క్యాప్ ను తన వద్ద ఉంచుకున్న జోస్ బట్లర్ మినహా క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాటర్  తమ వంతుగా బాది పోయారు.

ఐపీఎల్-15లో భాగంంగా  లక్నో సూపర్ జెయింట్స్ తో కీలక మ్యాచ్ ఆడుతున్న  రాజస్తాన్ రాయల్స్ బ్యాటింగ్ లో ఆకట్టుకుంది. ఆ జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (41), కెప్టెన్ సంజూ శాంసన్ (32) లు తొలుత మోత మోగించగా.. తర్వాత క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాటర్ ఆకట్టుకున్నాడు. ఈ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ హెల్డర్ (ఇప్పటివరకు) గా ఉన్న  బట్లర్ మినహా అందరూ దుమ్ము దులిపారు. పలితంగా  రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులుభారీ స్కోరు చేసింది. పటిష్ట బౌలింగ్ లైనప్ ఉన్న రాజస్తాన్ బౌలర్లను తట్టుకుని లక్నో.. ఈ లక్ష్యాన్ని ఛేదించగలదా..? 

టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన రాజస్తాన్ కు ఫామ్ లో ఉన్న  జోస్ బట్లర్ (2)ను ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఔట్ చేసింది లక్నో. అవేశ్ ఖాన్ బౌలింగ్ లో బట్లర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే  బట్లర్ స్థానంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ (24 బంతుల్లో 32.. 6 ఫోర్లు), యశస్వి జైస్వాల్  (29 బంతుల్లో 41.. 6 ఫోర్లు, 1 సిక్సర్) దూకుడుగా ఆడారు. 

మోహ్సిన్ ఖాన్ వేసిన  నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన శాంసన్.. బిష్ణోయ్ వేసిన 8వ ఓవర్లో కూడా అదే జోరు కొనసాగించాడు. మరోవైపు 14 పరగుల వద్ద మోహిసిన్ ఖాన్ క్యాచ్ మిస్ అవడంతో జైస్వాల్ కూడా రెచ్చిపోయి ఆడాడు. చమీర వేసిన 6వ ఓవర్లో  4, 4, 6 బాదాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 64 పరుగులు జోడించారు. అయితే 9వ ఓవర్ వేసిన హోల్డర్.. ఐదో బంతికి శాంసన్ ను ఔట్ చేశాడు. 

శాంసన్ స్థానంలో  క్రీజులోకి వచ్చిన పడిక్కల్ (18 బంతుల్లో 39.. 5 ఫోర్లు, 2 సిక్సర్లు)  కూడా దూకుడుగానే ఆడాడు. స్టోయినిస్ వేసిన పదో ఓవర్లో పడిక్కల్ 4,6,4 తో  15 పరుగులు పిండుకున్నాడు. చమీర వేసిన తర్వాత ఓవర్లో కూడా రెండు ఫోర్లు బాదాడు. కాగా, అయూష్ బదోని వేసిన 12వ ఓవర్లో జైస్వాల్.. అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  ఆ తర్వాత ఓవర్లో బిష్ణోయ్.. పడిక్కల్  ను కూడా పెవిలియన్ కు పంపాడు. అప్పటికీ 14 ఓవర్లలో రాజస్తాన్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 122 పరుగులు.

ఆ క్రమంలో  జిమ్మీ నీషమ్ (12) తో జతకలిసిన రియాన్ పరాగ్ (17.. 1 సిక్సర్ ) నెమ్మదిగా ఆడారు. లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో స్కోరు వేగం నెమ్మదించింది. అయితే మోహిసిన్ ఖాన్ వేసిన 17 వ ఓవర్లో సిక్సర్ కొట్టిన  పరాగ్..  బిష్ణోయ్ వేసిన 18వ ఓవర్లో తొలి బంతికే భారీ షాట్ కు యత్నించి స్టోయినిస్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అదే  ఓవర్లో అనవసరపు పరుగుకు యత్నించిన నీషమ్.. రనౌట్ అయ్యాడు.  

కాగా.. 19వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన బౌల్ట్ (17 నాటౌట్) రాజస్తాన్ స్కోరును 170 పరుగులు దాటించాడు. ఆఖరి ఓవర్ వేసిన అవేశ్ ఖాన్.. 10 పరుగులే ఇచ్చాడు. అశ్విన్ (10) నాటౌట్ గా నిలిచాడు. చివరికి 20 ఓవర్లలో రాజస్తాన్ 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగలిగింది. 

 

178/6, 20 overs

Time to fight, time to defend. 💪

— Rajasthan Royals (@rajasthanroyals)

లక్నో బౌలర్లలో రవిబిష్ణోయ్ ఆకట్టుకున్నాడు. నాలుగు ఓవర్లు వేసిన అతడు.. 31 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అవేశ్ ఖాన్, జేసన్ హెల్డర్, అయుష్ బదోని లకు తలో వికెట్ దక్కింది.

click me!