
ఐపీఎల్-15లో ఇప్పటికే ప్లేఆఫ్ చేరుకున్న గుజరాత్ టైటాన్స్ తర్వాత అక్కడికి వెళ్లే జట్టు ఏదో నేడు తేలనుంది. పాయింట్ల పట్టికలో టాప్-2 లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్, మూడో స్థానంలో ఉన్న రాజస్తాన్ రాయల్స్ మధ్య నేడు ఆసక్తికర పోరు జరుగుతున్నది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. లక్నో బౌలింగ్ చేయనుంది. ఈ రెండు జట్లు తాము ఆడిన గత మ్యాచులలో ఓడాయి. గుజరాత్ చేతిలో లక్నో ఓడగా.. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో రాజస్తాన్ ఓడింది. ఈ ఓటమిని మరిచి సానుకూల దృక్పథంతో ఆడి ఈ మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్స్ కు ధీమాగా వెళ్లాలని రెండు జట్లు భావిస్తున్నాయి.
గుజరాత్ తర్వాత రెండో స్థానంలో ఉన్న లక్నో ప్లేఆఫ్ బెర్త దాదాపు ఖాయమైనట్టే. ఆడిన 12 మ్యాచుల్లో 8 మ్యాచులు గెలిచి 4 ఓడిన లక్నో.. ప్లేఆఫ్ రేసులో గుజరాత్ తర్వాత నిలిచింది. ఈ మ్యాచ్ గెలిస్తే లక్నో ఈ సీజన్ లో అధికారికంగా ప్లేఆఫ్స్ చేరిన రెండో జట్టు అవుతుంది. మరో మ్యాచ్ కోసం వేచి చూడకుండా ఈ మ్యాచ్ లోనే నెగ్గాలని లక్నో భావిస్తున్నది.
ఇదిలాఉండగా.. రాజస్తాన్ రాయల్స్.. ఆడిన 12 మ్యాచులలో 7 మ్యాచుల్లో నెగ్గి ఐదింటిలో ఓడింది. ఈ మ్యాచ్ లో ఓడితే రాజస్తాన్ కూడా ప్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి. మరో మ్యాచ్ మిగిలున్నా అప్పటివరకు ఆగకుండా లక్నోనే ఓడించి ప్లేఆఫ్ చేరాలని సంజూ శాంసన్ సేన ప్రణాళికలు రచిస్తున్నది.
ఈ సీజన్ లో ఈ రెండు జట్ల మధ్య వాంఖెడే వేదికగా ముగిసిన 20వ లీగ్ మ్యాచ్ లో రాజస్తాన్ నే విజయం వరించింది. ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్ లో లక్నో.. 3 పరుగుల తేడాతో ఓడింది. అందుకు బదులు తీర్చుకోవాలని లక్నో భావిస్తున్నది.
ఈ మ్యాచ్ కోసం.. రాజస్తాన్ రాయల్స్ లో డసెన్ స్థానంలో జిమ్మీ నీషమ్, కుల్దీప్ సేన్ స్థానంలో ఒబెడ్ మెక్ కాయ్ ఆడనున్నార. ఇక లక్నో లో గత మ్యాచ్ లో ఆడని రవి బిష్ణోయ్ తిరిగి తుది జట్టులో చేరాడు.
తుది జట్లు :
లక్నో సూపర్ జెయింట్స్ : కెఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, అయుష్ బదోని, జేసన్ హోల్డర్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, మోహ్సిన్ ఖాన్
రాజస్తాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, జిమ్మీ నీషమ్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, ఒబెడ్ మెక్ కాయ్