
నాలుగు రోజుల క్రితం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచులో ఈ సీజన్ లో అత్యల్ప స్కోరు (68) నమోదు చేసి అవమానకర ఓటమిని మూటగట్టుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. నేడు రాజస్తాన్ రాయల్స్ తో పోటీ పడబోతున్నది. ఈ రెండు జట్ల మధ్య పూణే లోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఎ) వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఆర్సీబీ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో మూడు (రాజస్తాన్), ఐదు (బెంగళూరు) స్థానాల్లో ఉన్న ఈ జట్లు నేటి మ్యాచ్ గెలిచి ముందంజ వేయాలని భావిస్తున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లలో మార్పులు చేశాయి. ఆర్సీబీ ఓపెనర్ అనూజ్ రావత్ స్థానంలో రజత్ పాటిదార్ తుదిజట్టులోకి వచ్చాడు. ఇక రాజస్తాన్ లో కరుణ్ నాయర్, ఒబెడ్ మెక్ కాయ్ స్థానాలను డారెల్ మిచెల్, కుల్దీప్ సేన్ భర్తీ చేయనున్నారు.
గత మ్యచ్ తాలూకూ ఓటమిని త్వరగా మరిచిపోయి తద్వారా సీజన్ లో ముందుకు సాగాలని భావిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ కు అతి పెద్ద సమస్య విరాట్ కోహ్లి ఫామ్. ఈ సీజన్ లో కోహ్లి దారుణంగా విఫలమవుతున్నాడు. గత రెండు మ్యాచులలో వరుసగా డకౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో కోహ్లి ఏ మేరకు రాణిస్తాడనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అంతేగాక ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ.. ఓపెనర్ అనూజ్ రావత్ ను పక్కకునెట్టి తిరిగి కోహ్లితో ఓపెనింగ్ చేయించనుంది.
కోహ్లి సంగతి పక్కనబెడితే ఆర్సీబీకి ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్ లు కీలక ఆటగాళ్లు. అయితే సన్ రైజర్స్ తో మ్యాచ్ లో వీళ్లంతా విఫలమయ్యారు. ఈ స్టార్ ఆటగాళ్లు ఆడితేనే నేటి మ్యాచ్ లో బెంగళూరుకు భారీ స్కోరు దక్కుతుంది.
బౌలింగ్ లో జోష్ హెజిల్వుడ్, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ తో పాటు స్పిన్నర్లు వనిందు హసరంగ జోరు మీదున్నారు. సన్ రైజర్స్ తో మ్యాచ్ లో తప్పితే మిగిలిన మ్యాచుల్లో ప్రత్యర్థులను కట్టడి చేయడంలో వీళ్లంతా సఫలమయ్యారు.
ఇక రాజస్తాన్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లలో సంచలన ప్రదర్శనలతో దూసుకుపోతున్నది. ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ జోస్ బట్లర్.. ఇప్పటికే 3 సెంచరీలు చేసి ఇప్పుడు నాలుగో సెంచరీ పై కన్నుపెట్టాడు. అతడికి తోడు దేవదత్ పడిక్కల్ (గత సీజన్ లో ఆర్సీబీ తరఫున ఆడాడు), కెప్టెన్ సంజూ శాంసన్, షిమ్రాన్ హెట్మెయర్ లు మంచి ఫామ్ లో ఉన్నారు. బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ దుమ్ము దులుపుతుండగా పర్పుల్ క్యాప్ ఓనర్ యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ లు రాజస్థాన్ కు అదనపు బలంలా మారారు.
ముఖాముఖి :
ఐపీఎల్ లో ఇరు జట్లు ఇప్పటివరకు 26 సందర్భాల్లో తలపడ్డాయి. ఇందులో బెంగళూరు 13 మ్యాచులు నెగ్గగా పది మ్యాచులలో రాజస్తాన్ ను విజయం వరించింది. మూడు మ్యాచులలో ఫలితం రాలేదు. ఇక ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఆఖరి 5 మ్యాచులలో ఆర్సీబీదే విజయం. ఈ ఐపీఎల్ లో కూడా ఆర్సీబీ-రాజస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో సంజూ శాంసన్ సేనకు పరాజయమే ఎదురైంది.
తుది జట్లు :
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, దినేశ్ కార్తిక్, ప్రభుదేశాయ్, రజత్ పాటిదార్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, వనిందు హసరంగ, జోష్ హాజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్
రాజస్తాన్ రాయల్స్ : జోస్ బట్లర్, దేవ్‌దత్ పడిక్కల్, సంజూ శాంసన్ (కెప్టెన్), షిమ్రన్ హెట్‌మెయిర్, రియాన్ పరాగ్, డారెల్ మిచెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ సేన్, చాహల్