
ఐపీఎల్-2022 రెండో దశ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే సగం మ్యాచులు ఆడిన జట్లు.. ఇక జరుగబోయే ప్రతి మ్యాచ్ ను సీరియస్ గా తీసుకోవాల్సిందే. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఇకపై జరుగబోయే ప్రతి మ్యాచ్ కూడా ముఖ్యమే. ఈ నేపథ్యంలో కెఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్.. అతడి ప్రాణమిత్రుడు మయాంక్ అగర్వాల్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ తో నేడు కీలక పోరులో తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఈ సీజన్ లో రాహుల్ టాస్ ఓడటం ఇది వరుసగా తొమ్మిదోసారి కావడం గమనార్హం.
కర్నాటక కు చెందిన రాహుల్.. మయాంక్ అగర్వాల్ లు స్కూల్ డేస్ నుంచి మిత్రులు. వారిద్దరూ కలిసి కర్నాటకకు అండర్-15 నుంచి ప్రాతినిథ్యం వహించారు. లక్నో తో చేరకముందు రాహుల్ కూడా పంజాబ్ సారథిగా పనిచేశాడు. ఆ క్రమంలో వీళ్లిద్దరూ ఓపెనర్లుగా వచ్చేవారు. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం ఇద్దరూ ఢీ అంటే ఢీ అనబోతున్నారు. ఈ మ్యాచ్ కోసం పంజాబ్ లో మార్పులు లేవు. కానీ లక్నోలో మనీష్ పాండే స్థానంలో అవేశ్ ఖాన్ ఆడుతున్నాడు.
ఇక ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. ఆడిన 8 మ్యాచుల్లో 5 విజయాలు, 3 ఓటములతో (10 పాయింట్లు) పాయింట్ల పట్టికలో లక్నో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఆ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ (ప్రస్తుతం 3వ స్థానం) ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి వెళ్లొచ్చు.
అదే విధంగా.. 8 మ్యాచులాడిన పంజాబ్.. నాలుగింట్లో గెలిచి అన్నే మ్యాచుల్లో ఓడింది. ప్రస్తుతం 8 పాయింట్లంతో ఉన్న పంజాబ్.. ఏడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో ఓడితే పంజాబ్ తర్వాత జరుగబోయే నాలుగు మ్యాచుల్లో గెలవాల్సి ఉంటుంది.
తుది జట్లు :
పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, భానుక రాజపక్స, రిషి ధావన్, కగిసో రబడ, రాహుల్ చాహర్, సందీప్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్, కెఎల్ రాహుల్ (కెప్టెన్), కృనాల్ పాండ్యా, దీపక్ హుడా, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, దుష్మంత చమీరా, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, మోహిసిన్ ఖాన్