అతడు అబద్దాల కోరు.. నేను హిందూను అవడం వల్లే అలా చేశాడు : పాక్ మాజీ కెప్టెన్ పై కనేరియా సంచలన వ్యాఖ్యలు

Published : Apr 29, 2022, 03:59 PM IST
అతడు అబద్దాల కోరు.. నేను హిందూను అవడం వల్లే అలా చేశాడు : పాక్ మాజీ కెప్టెన్ పై కనేరియా సంచలన వ్యాఖ్యలు

సారాంశం

Danish Kaneria: తాను హిందూను అవడం వల్లే పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ఆడనీయకుండా తనపై కుట్రలు పన్నారని మాజీ క్రికెటర్  దానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఏ తప్పూ  చేయలేదని  ఇప్పటికైనా నిషేధం ఎత్తివేయాలని అభ్యర్థించాడు. 

ఇటీవల యూట్యూబ్ వేదికగా పలు విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా తాజాగా ఆ జట్టు మాజీ సారథి, స్టార్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది పై  షాకింగ్ కామెంట్స్ చేశాడు.  అతడు ఓ అబద్దాల కోరు, మోసగాడు అని.. తన క్రికెట్ కెరీర్ నాశనం కావడానికి అఫ్రిదియే కారణమని వ్యాఖ్యానించాడు. తాను ఓ హిందూవును కావడం వల్లే  తనపై కక్ష్య గట్టి జట్టులోంచి తొలగించేలా కుట్రలు పన్నారని  కనేరియా తెలిపాడు. స్పాట్ ఫిక్సింగ్ లో తనను  కావాలనే ఇరికించారని, ఆ నిషేధాన్ని ఎత్తివేయాలని అతడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ని అభ్యర్థించాడు. 

తాజాగా దానిష్ కనేరియా అక్కడి ఓ ప్రముఖ మీడియా సంస్థతో స్పందిస్తూ.. ‘నా సమస్య (కనేరియా హిందువు అవడం వల్లే జట్టులో సమస్యలు ఎదుర్కుంటున్నాడని) గురించి ముందుగా ప్రజలకు తెలిసేలా మాట్లాడింది షోయభ్ అక్తర్. నా కోసం మాట్లాడినందుకు అక్తర్ కు కృతజ్ఞతలు. అయితే తర్వాత అతడిపై ఒత్తిళ్ల కారణంగా అక్తర్ కూడా దాని గురించి ఏం మాట్లాడలేకపోయాడు. కానీ నిజం కూడా అదే...

పాకిస్తాన్ మాజీ సారథి షాహిద్ అఫ్రిది వల్లే నా కెరీర్ నాశనమైంది. వన్డేలలో నేను పాక్ తరఫున ఎక్కువ  మ్యాచులు ఆడకపోవడానికి కారణం అఫ్రిదినే. అతడు నన్నెప్పుడూ బెంచ్ కే పరిమితం  చేసేవాడు. అఫ్రిది ఒక అబద్దాల కోరు. మోసగాడు. క్యారెక్టర్లెస్ పర్సన్. అయితే నేను ఇవేమీ పట్టించుకునేవాడిని కాదు. నా ధ్యాసంతా ఆటమీదే ఉండేది. అతడి కుట్రలు, వ్యూహాలను నేను పట్టించుకునేవాడిని కాదు. 

నా మీద ఇతర ఆటగాళ్లను ఉసిగొల్పడం, నన్ను ప్రతీసారి తక్కువ చేసి చూడటం చేస్తుండేవాడు.  కానీ నేను ప్రతిసారి మంచి ప్రదర్శనలు చేస్తుండటంతో  అతడు నాపై అసూయను పెంచుకున్నాడు.  నేను పాకిస్తాన్ కు ఆడినందుకు గర్వపడుతున్నాను. దానికి నేను చాలా కృతజ్ఞుతుడిని...’ అని తెలిపాడు. 

స్పాట్ ఫిక్సింగ్ కేసులో తనను అకారణంగా ఇరికించారని, దాని నుంచి విముక్తి కల్పించాలని కనేరియా పీసీబీని కోరాడు. ‘నా మీద తప్పుడు ఆరోపణలు మోపి నన్ను జట్టు నుంచి దూరం చేశారు. ఆ కేసు (స్పాట్ ఫిక్సింగ్) లో నిందితుడి పేరుతో పాటు నా పేరును కూడా చేర్చారు. అతడు (సదరు నిందితుడు)  నాతో పాటు మిగతా పాక్ ప్లేయర్లకు, అఫ్రిదికీ స్నేహితుడే. కానీ నేనే ఎందుకు టార్గెట్ అయ్యానో నాకైతే తెలియదు.  ఇప్పటికైనా నా మీద ఉన్న నిషేధాన్ని ఎత్తివేయమని పీసీబీ ని కోరుతున్నాను. దాని వల్ల నా కెరీర్ నాశనమైంది. 

పాక్ లో చాలా మంది క్రికెటర్ల మీద నిషేధాలు విధించినా తర్వాత తొలగించారు. మరి దానికి నేనెందుకు అర్హుడిని కానో అర్థం కావడం లేదు. నిషేధం పడిన వారు తిరిగి జట్టులోకి కూడా వచ్చారు. నేనేం పాపం చేశాను. నేనిప్పుడు అంతర్జాతీయ క్రికెట్ ఆడను. నాకు  పీసీబీ నుంచి ఏ ఉద్యోగం కూడా వద్దు. కానీ నా మీద విధించిన నిషేధాన్ని మాత్రం దయచేసి ఎత్తేయండి. నిషేధాన్ని ఎత్తేస్తే నా బతుకు నేను ప్రశాంతంగా బతుకుతా..’ అని అన్నాడు. 

పాకిస్తాన్ తరఫున 2000 నుంచి 2010 వరకు ఆడిన  కనేరియా.. 61 టెస్టులాడాడు. టెస్టులలో ఏకంగా 261 వికెట్లు పడగొట్టాడు.  కానీ వన్డేలలో మాత్రం  కనేరియా.. 18 మ్యాచులు మాత్రమే ఆడాడు. 2012లో అతడిపై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా పీసీబీ  అతడిపై జీవిత కాల నిషేధం విధించింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

18 Sixes In One T20I Innings : 18 సిక్సర్లతో 27 బంతుల్లోనే సెంచరీ.. గేల్, రోహిత్ రికార్డులు బ్రేక్
Virat Kohli టెన్త్ క్లాస్ మార్కుల మెమో వైరల్.. ఇంతకూ కోహ్లీ ఏ సబ్జెక్ట్ లో తోపు, ఎందులో వీక్..?