IPL 2022 GT vs RR: తఢాఖా చూపించిన హర్ధిక్ పాండ్యా... రాయల్స్ ముందు భారీ టార్గెట్...

Published : Apr 14, 2022, 09:19 PM ISTUpdated : Apr 14, 2022, 09:25 PM IST
IPL 2022 GT vs RR:  తఢాఖా చూపించిన హర్ధిక్ పాండ్యా... రాయల్స్ ముందు భారీ టార్గెట్...

సారాంశం

ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన హార్ధిక్ పాండ్యా... రాజస్థాన్ రాయల్స్ ముందు 193 పరుగుల భారీ టార్గెట్... 

గత రెండు సీజన్లలో పర్ఫామెన్స్ బాగోలేదని హార్ధిక్ పాండ్యాని రిటైన్ చేసుకోకుండా ముంబై ఇండియన్స్ తప్పు చేసిందా? ఐపీఎల్ ఫ్యాన్స్‌లో ఈ ప్రశ్న రేకెత్తించేలా ఐపీఎల్ కెరీర్‌లో తొలిసారిగా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ 50+ స్కోరు చేశాడు... కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్‌కి మంచి స్కోరు అందించాడు... అంతేకాకుండా ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్‌కి దూసుకెళ్లాడు. 

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. జేమ్స్ నీశమ్ వేసిన మొదటి ఓవర్‌లో మూడు ఫోర్లు బాదిన మాథ్యూ వేడ్, రెండో ఓవర్‌లో రనౌట్ అయ్యాడు. 6 బంతుల్లో 3 ఫోర్లతో 12 పరుగులు చేసిన మాథ్యూ వడ్, వాన్ దేర్ దుస్సేన్ డైరెక్ట్ త్రోకి పెవిలియన్ చేరాడు...

రెండు మ్యాచుల బ్రేక్ తర్వాత తుదిజట్టులో చోటు దక్కించుకున్న విజయ్ శంకర్ 7 బంతుల్లో 2 పరుగులు చేసి కుల్దీప్ సేన్ బౌలింగ్‌లో శాంసన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

14 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, రియాన్ పరాగ్ బౌలింగ్‌లో హెట్మయర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 53 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది గుజరాత్ టైటాన్స్. ఈ దశలో అభినవ్ మనోహర్, హార్ధిక్ పాండ్యా కలిసి నాలుగో వికెట్‌కి 86 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసిన అభినవ్ మనోహర్, యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో రవిచంద్రన్ అశ్విన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదిన డేవిడ్ మిల్లర్, కుల్దీప్ సేన్ వేసిన 19వ ఓవర్‌లో 21 పరుగులు రాబట్టాడు. మొదటి 3 ఓవర్లలో 30 పరుగులిచ్చిన కుల్దీప్ సేన్, ఆఖరి ఓవర్‌లో 21 పరుగులిచ్చి మొత్తంగా 51 పరుగులు సమర్పించాడు. 

4 ఓవర్లు వేసిన రవిచంద్రన్ అశ్విన్, 33 పరుగులిచ్చి  వికెట్లేమీ తీయలేకపోయాడు. 2021 నుంచి గత 10 ఐపీఎల్ మ్యాచుల్లో కలిపి కేవలం 2 వికెట్లు మాత్రమే తీయగలిగాడు రవి అశ్విన్. 

హార్ధిక్ పాండ్యా 52 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా డేవిడ్ మిల్లర్ 14 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 31 పరుగులు చేశారు. ఈ ఇద్దరూ 25 బంతుల్లో 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

2019 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరుపున కేకేఆర్‌పై 34 బంతుల్లో 91 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యాకి ఇది ఐపీఎల్ కెరీర్‌లో రెండో అత్యధిక స్కోరు. ఐపీఎల్ కెరీర్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో 50+ పరుగులు చేయడం కూడా పాండ్యాకి ఇదే తొలిసారి. ఓవరాల్‌గా ఐపీఎల్ 2022 సీజన్‌లో 228 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, ఆరెంజ్ క్యాప్ రేసులో జోస్ బట్లర్‌ని అధిగమించాడు...

జోస్ బట్లర్ రెండో ఇన్నింగ్స్‌లో 11 పరుగులు చేస్తే, ఆరెంజ్ క్యాప్ మళ్లీ అతని చేతికి వెళ్తుంది. 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !