Dewald Brevis: కల నెరవేరిన క్షణం.. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న బేబీ ఏబీడీ.. క్రికెట్ దేవుడి నుంచి ప్రశంసలు

Published : Apr 14, 2022, 06:27 PM IST
Dewald Brevis: కల నెరవేరిన క్షణం.. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న బేబీ ఏబీడీ.. క్రికెట్ దేవుడి నుంచి ప్రశంసలు

సారాంశం

TATA IPL 2022: ముంబై ఇండియన్స్ యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ తన చిన్ననాటి కల నెరవేర్చుకున్నాడు. ముంబై-పంజాబ్ నడుమ గురువారం జరిగిన  మ్యాచులో  సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన అతడు తాజాగా... 

ముంబై ఇండియన్స్  సంచలనం జూనియర్ ఏబీ డివిలియర్స్ డెవాల్డ్ బ్రెవిస్ తన చిన్ననాటి కలను నెరవేర్చుకున్నాడు.  క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు వీరాభిమాని అయిన బ్రెవిస్.. ఐపీఎల్ లో భాగంగా సచిన్ దగ్గర బ్యాటింగ్ పాఠాలు నేర్చుకుంటున్నాడు. ఇక గురువారం  పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో బ్రెవిస్ వీరవిహారం చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో 25 బంతుల్లోనే 49  పరుగులు చేశాడు బేబీ ఏబీడీ. అయితే మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా బ్రెవిస్ ఇన్నింగ్స్ మాత్రం పంజాబ్ ను  వణికించింది.

కాగా మ్యాచ్ అనంతరం  సచిన్ టెండూల్కర్  బ్రెవిస్ ఆటతీరుకు మంత్రముగ్దుడయ్యాడు. సచిన్ చేతుల మీదుగా  బేబీ ఏబీడీకి ముంబై ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఐపీఎల్ లో ఇచ్చే అవార్డులే గాక ముంబైలో  మ్యాచ్ బాగా ఆడిన ఆటగాళ్లకు ప్రత్యేక అవార్డులిస్తారు. ఆటగాళ్లను ప్రోత్సహించడానికి ముంబై ఈ సూత్రాన్ని పాటిస్తున్నది. 

అయితే చిన్ననాటి నుంచి సచిన్ ఫోటోలను  తన ఇంటి గోడపై  పెట్టుకుని ఆరాదించిన బ్రెవిస్ ఇప్పుడు ఆ దిగ్గజం చేతుల మీదుగానే  ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బ్యాడ్జీని అందుకున్నాడు. దీంతో  జూనియర్ ఏబీడీ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ తన సోషల్ మీడియా ఖాతాలలో పంచుకుంది.  దక్షిణాఫ్రికా పై సచిన్  చేసిన డబుల్ సెంచరీ (2010లో) తర్వాత  బ్రెవిస్.. కోట్లాది భారతీయుల మాదిరిగానే ఈ క్రికెట్ దేవుడికి భక్తుడిగా మారాడని గతంలో చెప్పుకున్నాడు. అలాంటి  బ్రెవిస్ ఇప్పుడు ఏకంగా సచిన్ దగ్గరే క్రికెట్ పాఠాలు నేర్చుకుంటుండటం గమనార్హం. 

 

బ్రెవిస్ తో పాటు మరో కుర్రాడు తిలక్ వర్మ (20 బంతుల్లో 36.. 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా  అద్భుతంగా పోరాడాడు. తిలక్  కు కూడా ముంబై తరఫున ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బ్యాడ్జీ దక్కింది.  బ్రెవిస్ కు సచిన్ చేతుల మీదుగా అవార్డు దక్కగా.. తిలక్ కు  జహీర్ ఖాన్ బ్యాడ్జీ అందజేశాడు. 

ఈ ఇద్దరూ కలిసి పంజాబ్ కింగ్స్ బౌలర్లను చితకబాదారు.  ముఖ్యంగా బ్రెవిస్.. రాహుల్ చాహర్ వేసిన 9వ ఓవర్లో విశ్వరూపం చూపించాడు.  ఆ ఓవర్లో వరుసగా 4, 6, 6, 6, 6 బాదాడు. ఆ ఓవర్లో మొత్తం 29 పరుగులొచ్చాయి. 

 

ఇక నిన్నటి మ్యాచ్ లో వీళ్లిద్దరూ ఆడినప్పుడు గెలుపు మీద పంజాబ్ కు ఆశలే లేవు. కానీ ఒడియన్ స్మిత్.. బ్రెవిస్ ను ఔట్ చేశాక మ్యాచ్ కీలక మలుపు తిరిగింది. తిలక్ వర్మ రనౌట్  కాగా తర్వాత వచ్చిన పొలార్డ్ కూడా అతడినే అనుసరించాడు.  సూర్యకుమార్ యాదవ్ కూడా 19వ ఓవర్లో వెనుదిరిగి నిరాశపరిచాడు. దీంతో పంజాబ్ నిర్దేశించిన 199 పరుగుల లక్ష్యానికి ముంబై 12 పరుగుల (186-9) దూరంలో నిలిచింది. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !