
ఐపీఎల్-2022 ఫైనల్ మ్యాచ్ కోసం బీసీసీఐ పలు మార్పులు చేసింది. ఈ మ్యాచ్ కు ముందు ముగింపు వేడుకలను నిర్వహించనున్న బీసీసీఐ.. వాటిని దృష్టిలో పెట్టుకుని మ్యాచ్ వేళల్లో మార్పులు చేసింది. సాధారణంగా ఐపీఎల్ లో లీగ్ మ్యాచ్ లను రాత్రి 7 గంటలకు టాస్ వేసి 7.30 గంటలకు స్టార్ట్ చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఫైనల్ ను కూడా ఇలాగే నిర్వహించాలి. కానీ ముగింపు వేడుకల వల్ల మ్యాచ్ ను అరగంట ఆలస్యంగా నిర్వహించనున్నారు.
క్రిక్ బజ్ కథనం ప్రకారం.. మే 29న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించనున్న ఫైనల్ మ్యాచ్ కు ముందు బాలీవుడ్ తారలతో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రెహ్మాన్ ల ప్రదర్శనలు నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది. సాయంత్రం 6.30 గంటలకు ఇవి స్టార్ట్ అవుతాయి.
సాయంత్రం 6.30 గంటల నుంచి 7.20 వరకు ఈ ప్రదర్శనలు ఉంటాయి. 50 నిమిషాల సంగీత, నాట్య ప్రదర్శనలు ముగిసిన తర్వాత పది నిమిషాల గ్యాప్ ఇచ్చి రాత్రి 7.30 కు టాస్ వేస్తారు. మళ్లీ టాస్ వేసినప్పట్నుంచి మ్యాచ్ జరిగే వరకు అరగంట సమయం గ్యాప్ ఉంటుంది. అంటే మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మేరకు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
వచ్చే ఐపీఎల్ నుంచి మ్యాచ్ వేళల్లో మార్పులు..?
ఈ ఏడాది ఫైనల్ తో పాటు వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ లో శని, ఆది వారాల్లో నిర్వహించే డబుల్ హెడర్ మ్యాచ్ వేళల్లో కూడా మార్పులు చేసేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తున్నది. ఈ సీజన్ లో డబుల్ హెడర్ మ్యాచ్ లు మధ్యాహ్నం 3.30 కు మొదలై.. రాత్రి 7.30 వరకు జరుగుతున్నాయి. అయితే వీటిని ఇకపై నుంచి వీటిని 4 గంటలకు ప్రారంభించి 8 గంటల వరకు జరుపనున్నారని బీసీసీఐ వర్గాల సమాచారం.
ఐపీఎల్ లో తొలి పది సీజన్ల వరకు డబుల్ హెడర్ మ్యాచ్ లను 4 గంటల నుంచి 8 గంటల వరకే నిర్వహించేవారు. కానీ గడిచిన నాలుగు సీజన్లుగా వీటిని 3.30 కే స్టార్ట్ చేస్తున్నారు. వీటి వల్ల రెండు మ్యాచులను వీక్షించాలనుకునే అభిమానులకు ఇబ్బంది తలెత్తకుండా.. బీసీసీఐ అధికారిక ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్ విజ్ఞప్తి మేరకు మ్యాచ్ వేళల్లో మార్పులు చేశారు. మొదటి మ్యాచ్ అయిపోయేసరికి 8 గంటలు దాటేది. అప్పటికే రెండో మ్యాచ్ (7.30 కే స్టార్ట్) కాస్త మిస్ అయ్యే అవకాశముండేది. కాగా మళ్లీ ఇప్పుడు పాత పద్ధితినే పాటించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నది.