
ఐపీఎల్-2022 లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న రింకూ సింగ్.. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడి తన జట్టును గెలిపించినంత పనిచేశాడు. 15 బంతుల్లోనే 40 పరుగులు చేసిన అతడు.. చివర్లో ఔట్ కాకపోయి ఉంటే కేకేఆర్ చరిత్ర సృష్టించేదే. అయితే ఈ యువ ఆటగాడి జీవితమేమీ పూల పాన్పు కాదు. కష్టాల సుడిగుండాలెన్నో దాటుకుని ఈ స్థితికి చేరుకున్న అతడి బాధలు చెబితే తీరేవి కావు. తాజాగా లక్నో తో మ్యాచ్ కు ముందు అతడు తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర వ్యాఖ్యలు వెల్లడించాడు. కేకేఆర్ తన సామాజిక మాధ్యమాలలో ఇందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేసింది.
రింకూ సింగ్ మాట్లాడుతూ.. ‘గడిచిన ఐదేండ్లు నా జీవితంలో అత్యంత కీలకం. ఎన్నో సవాళ్ల తో కూడుకున్న ప్రయాణమిది. 2018 లో కేకేఆర్ నాకు అవకాశమొచ్చింది. అయితే నేను సరిగా రాణించలేదు. అయినా కేకేఆర్ నా మీద నమ్మకముంచింది..
గతేడాది విజయ్ హజారే ట్రోఫీ సమయంలో పరుగు తీసేప్పుడు నేను గాయపడ్డాను. అప్పుడు ఐపీఎల్ గురించిన ఆలోచనలే నన్ను వెంటాడాయి. నాకు ఆపరేషన్ అవసరమని.. కోలుకోవడానికి 6-7 నెలల సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. ఆటకు అన్ని రోజులు దూరంగా ఉండాలంటే నా వల్ల కాలేదు.
నాకు గాయమవ్వడం వల్ల నాన్న తట్టుకోలేకపోయారు. ఆయన రెండు మూడు రోజుల పాటు అసలు భోజనమే చేయలేదు. అయితే క్రికెట్ లో గాయాలు కామన్ అని నేను మా నాన్నకు చెప్పాను. నా కుటుంబంలో నేనే పోషించేవాడ్ని కాబట్టి ఆ మాత్రం ఆందోళనచెందడం సహజమే. మా నాన్న అలా ఉండటం చూసి నేను కూడా ఎంతో బాధపడ్డాను. కానీ నా మీద నాకు నమ్మకముంది. నాకున్న ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశాను..’ అని భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు.
1997 అక్టోబర్ 12న ఉత్తరప్రదేశ్ లొని అలీగఢ్ లో పుట్టిన రింకూ సింగ్.. 2017 లో ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ ఏడాది సరిగా ప్రదర్శన చేయలేదు. కానీ దేశవాళీలో అతడు రాణించడం చూసిన కేకేఆర్.. 2018 వేలంలో రూ. 80 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ 2021 విజయ్ హజారే ట్రోఫీ లో గాయపడ్డ అతడు ఆ ఏడాది ఐపీఎల్ తొలి దశలో ఆడలేదు. మళ్లీ ఈ సీజన్ లో కూడా అతడిని దక్కించుకున్నది కేకేఆర్. ఇక ఈ సీజన్ లో రింకూ సింగ్.. ఆడిన 7 మ్యాచులలో 174 పరుగులు చేశాడు.
రింకూ సింగ్ తండ్రి, అన్నలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు ఇంటింటికీ సరఫరా చేస్తుంటారు. 9వ తరగతి వరకు చదువుకున్న రింకూకు స్వీపర్ గా జాబ్ వచ్చినా అతడు క్రికెట్ తన కెరీర్ అనుకున్నాడు. దేశవాళీల్లో రాణించి తద్వారా ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అలీగఢ్ ఏరియాలో ఐపీఎల్ ఆడిన తొలి క్రికెటర్ గా రింకూ సింగ్ రికార్డు సృష్టించాడు.