అక్కడ నన్ను బ్రాడ్మన్ లా చూస్తారు.. కానీ అనుభవానికి విలువనివ్వరు : బంగ్లా వికెట్ కీపర్ సంచలన వ్యాఖ్యలు

Published : May 19, 2022, 03:56 PM IST
అక్కడ నన్ను బ్రాడ్మన్ లా చూస్తారు.. కానీ అనుభవానికి విలువనివ్వరు : బంగ్లా వికెట్ కీపర్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

Mushfiqur Rahim: బంగ్లాదేశ్ క్రికెట్ లో టెస్టులలో 5వేల పరుగులు   పూర్తి చేసిన క్రికెటర్ గా ఇటీవలే రికార్డులకెక్కాడు  ఆ జట్టు వికెట్ కీపర్ ముష్ఫీకర్ రహీమ్.  సెంచరీ అయ్యాక అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.   

ఫీల్డ్ లో ఓవర్ యాక్షన్ చేస్తూ, అతికి మారుపేరు గా నిలిచే బంగ్లాదేశ్ వికెట్ కీపర్  బ్యాటర్ ముష్ఫీకర్ రహీమ్ తనను తాను క్రికెట్ దిగ్గజం, ఆస్ట్రేలియాకు చెందిన డాన్ బ్రాడ్మన్ తో పోల్చుకుంటున్నాడు. భారత్ తో మ్యాచ్ ఉన్నప్పుడల్లా  చేయాల్సిన దానికంటే అతి చేసే రహీమ్.. బంగ్లాదేశ్ తరఫున  టెస్టులలో 5 వేల పరుగులు చేసిన ఆటగాడిగా ఇటీవలే రికార్డు సాధించాడు. శ్రీలంకతో చిత్తోగ్రమ్ వేదికగా జరిగిన  తొలి టెస్టులో సెంచరీ చేసిన తర్వాత అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

రహీమ్ మాట్లాడుతూ.. ‘చాలా కాలం తర్వాత సెంచరీ చేయడం చాలా ఆనందంగా ఉంది.  కానీ ఇదే ముగింపు కాదు. ఇది ఇంకా కొనసాగాలి. టెస్టులలో 5 వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్ గా రికార్డులకెక్కడం నాతోనే ఆగిపోకూడదు.  ఆ లెగసీ కొనసాగాలి.. 

బంగ్లా జట్టులో  ప్రస్తుతమున్న జూనియర్ ఆటగాళ్లు రాబోయే కాలంలో 8వేలు, పది వేల పరుగులు చేయాలని ఆశిస్తున్నా.  బంగ్లాదేశ్ లో  నన్ను చాలా మంది ప్రజలు  డాన్ బ్రాడ్మన్ తో పోలుస్తారు. అయితే బాగా ఆడితే బ్రాడ్మన్ తో పోల్చే జనమే ఆడకుంటే కనీసం నా వైపు కన్నెత్తి కూడా చూడరు. ఇలాంటి వాళ్లను (బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును ఉద్దేశిస్తూ..) బంగ్లాదేశ్ లోనే చూస్తాం.. 

ఇప్పుడున్న జట్టులో నేను చాలా సీనియర్ సభ్యుడిని.  కానీ  నేను ఎంత కాలం క్రికెట్ ఆడతాననేదానిమీద నాకే స్పష్టత లేదు.  సీనియర్ ప్లేయర్లకు  ఇక్కడ మద్దతు లేదు. ఇప్పుడిదే సంస్కృతి నడుస్తున్నది.  కానీ యువ ఆటగాళ్ల వరకైనా ఈ పద్దతి మారాలి. వాళ్లకు మద్దతు కావాలి. బంగ్లాదేశ్ లో  ఎక్స్పీరియన్స్ ఆటగాళ్లకు విలువ లేదు. నేను బంగ్లాదేశ్ తరఫున 17 ఏండ్లుగా ఆడుతున్నాను. ఆ దేవుడి దయ వల్లే ఇదంతా. కానీ నాకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు..’ అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

 

ముష్ఫీకర్ రహీమ్ కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఇటీవల ఢీ అంటే ఢీ అనే పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో అతడిని కొన్ని మ్యాచులకు పక్కనబెట్టింది బీసీబీ. దీంతో అతడు పై విధంగా వ్యాఖ్యానించి  తన కడుపు మంటను చల్లార్చుకున్నాడని అంటున్నారు అక్కడి క్రికెట్ అభిమానులు. 

ఇక శ్రీలంక-బంగ్లాదేశ్ ల మద్య జరిగిన తొలి టెస్టు  పేలవమైన డ్రామా ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక.. 397 పరుగులకు ఆలౌట్ అయింది. ఏంజెలో మాథ్యూస్ (199) ఒక్క పరుగుతో డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లా. 465 పరుగులు చేసింది. తమీమ్ ఇక్బాల్ (133) తో పాటు ముష్ఫీకర్ (105) కూడా సెంచరీ సాధించాడు. కాగా రెండో ఇన్నింగ్స్ లో లంక.. 6 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. కానీ అప్పటికే ఐదు రోజులు ముగియడంతో  మ్యాచ్ డ్రా గా ముగిసింది. 

PREV
click me!

Recommended Stories

కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?
టీ20ల్లో అట్టర్ ప్లాప్ షో.. అందుకే పక్కన పెట్టేశాం.. అగార్కర్ కీలక ప్రకటన